దొంగ - తిలక్ గారి రచన

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

తెలుగువచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.ఇప్పుడు వినబోయే కథ 'దొంగ' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఈ పుస్తకం మీరు డిజిటల్ ఎడిషన్ లేదా ప్రింటెడ్ ఎడిషన్ కొనడానికి, ఇదే వెబ్ పేజీ లో వివరాలు ఇవ్వబడ్డాయి.కథ - 'దొంగ' :మసక మసకగా వుంది వెన్నెల. చెట్లకిందవున్న చీకటిలోంచి నడుస్తున్నాడు గోపాలం. మోకాళ్ళపైకి ఎగకట్టిన పంచెకట్టూ, ఛాతీకి బిగుతుగా అంటుకొనిపోయిన బనీనూ, మొలలో చిన్న కత్తి - ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో ఉన్నాడు గోపాలం...మధ్య మధ్య త్రేన్పులు వస్తున్నాయి పుల్లపుల్లగా - ఒకే ఒక గ్లాసుడు నాటుసారా పుచ్చుకున్నాడు బలానికీ, హుషారుకీ. చదువురానివాడైనా, ప్రతీదీ ఒక ప్లానుప్రకారం నడవాలి గోపాలానికి. ఏ పని చేసినా ముందూ వెనకా చూసి ఆలోచించి బేరీజువేసే అలవాటు వుంది అతనికి. ఒక స్వాభావికమైన వివేకం వుంది. అందుకే రత్తయ్యా, సోములూ ఎంతో నమ్మకంవుంచి అతనిమీద యీ బాధ్యత వేశారు. వాళ్ళిద్దరూ లేకుండా వుంటే, పనులు సవ్యంగా జరుగుతాయి. వాళ్ళిద్దరికీ నిదానం లేదు. ఉత్త కంగారు. ఉత్తి ఆశ తప్ప.రాత్రి ఒంటిగంట దాటితేకాని ఆవిడ మొగుడింటికి రాడు, రెండు వారాలు పరిశీలనగా చూసి యీ విషయం గ్రహించాడు. ఆ క్లబ్ లో కూర్చుని ఖరీదైన మందు తాగుతూ పేకాడుతూ డబ్బయిపోయేవరకూ అక్కడే వుంటాడు. ఈలోగా అతని భార్యవొంటరిగా యింట్లో వంటగదికి పక్కగా వున్న గదిలో పడుకుని నిద్రపోతుంది. వంటగదికి దొడ్లో నుంచి వెళ్ళాలి. దొడ్డి చాలా పెద్దది. ఎన్నో మొక్కలూ చెట్లూ వున్నాయి. వాటి నీడలో తాను కనుపించడు. మరీ మంచిది. వంటగది కిటికీ వానకి తడిసి ఎండకి ఎండి కమ్ములు పట్టుతప్పివున్నాయి. బలంగా తెలివిగా పనిచేస్తే మూడు నాలుగు ఊచల్ని తీసెయ్యవచ్చును. ఇంక ఒకసారి వంటగదిలో ప్రవేశించాక పనిచాలా సులభం. తాను అవతల గదితలుపు కొడతాడు మెల్లగా, ఆవిడ ఏ ఎలకో. పిల్లో అనుకుని తలుపు తీస్తుంది. అంతే, తాను కత్తి చూపించి భయపెడతాడు. మెళ్ళో వున్న నాలుగు పేటలగొలుసు ఒడుపుగా తాపీగా తీసుకుంటాడు. ఆమె తెప్పరిల్లే లోపల. కేకవేసేలోపల తోటలోకి చీకట్లోకి అదృశ్యుడైపోతాడు.గోపాలం యిలాగ తన ప్లానంతా ఆలోచించుకుంటూ నిబ్బరంగా నడుస్తున్నాడు. రోడ్లు నిర్మానుష్యంగా వున్నాయి - అక్కడక్కడ ఒకరిద్దరు రాత్రించరుల్ని తప్పించి, ఊరికి దూరంగా ఉన్న కొత్తపేట యిది. ఊళ్ళోవున్న జనసంచారమూ, అలజడి ఇక్కడ ఉండవుమొదట ఆట అయిపోగానే మొగలోవున్న కిళ్ళీకొట్లూ, చిన్న కాఫీ హోటలూ మూసేస్తారు. చాలా ఇళ్ళు నిద్రలో మునిగిపోయాయి. కొన్ని ఇళ్ళలోంచి మాత్రం విద్యుద్దీప కాంతి కిటికీలోంచి వస్తోంది. మొత్తమ్మీద వీధులూ, ఇళ్ళూ ఆ మసక వెన్నెలలో ఒంటరిగా గోపాలంకోసం యెదురు చూస్తోన్నట్లు వున్నాయి.గోపాలానికి తనుచేసే పనిమీద నైతిక సందేహాలు ఏమీలేవు. దొంగతనం తప్పనీ, పాపమనీ అతను అనుకోలేదు. ఎందరో తమ తమ అవసరాలకి ఎన్నో వృత్తులూ , ఉద్యోగాలు చేసినట్టుగా అతనూ యిది చేస్తున్నాడే తప్ప మంచి చెడ్డల సూక్ష్మ విచారణచేసే పిరికితనం కాని, అసలటువంటి ఆలోచనకి అవసరంకాని అతనికి కనిపించలేదు. అందువలన అతనికి అంతరాత్మని నొక్కివేయడమూ ఒప్పించడమూ లాంటి బాధలు కలుగలేదు. తనపనిలో దొరికిపోతే జైలుకి వెళ్ళాలన్న భయమూ జ్ఞానమూ వున్నాయి అతనికి. అందుకే జాగ్రత్తగా ప్లానువేసుకుంటాడు. ఎంతో అవసరమైతేకాని రత్తయ్యనీ, సోముల్నీ వెంటతీసుకుని వెళ్ళడు. వాళ్ళిప్పుడు తనకోసం ఆశగా ఎదురు చూస్తూంటారన్న ఆలోచన అతనికి మరింత ఉత్సాహం ఇచ్చింది.ఆ యిల్లు మసక వెన్నెల్లో ముడుచుకున్న తాబేలులా వుంది. ప్లాను ప్రకారం...