సత్యం - చంద్ర కన్నెగంటి గారి రచన

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

హర్షణీయానికి స్వాగతం.ఈ ఎపిసోడ్ లోని కథ 'సత్యం' శ్రీ చంద్ర కన్నెగంటి గారి రచన.ఇది వారి 'మూడో ముద్రణ' అనే కథా సంకలనం లోనిది.ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో ఇవ్వడం జరిగింది.గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ చంద్ర కన్నెగంటి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగ నిపుణులుగా యూఎస్ ఏ లో పని చేస్తున్నారు.తానా పత్రికకు సంపాదకులుగా కూడా వారు ఇంతకు మునుపు , బాధ్యతలు నిర్వహించారు.గత మూడు దశాబ్దాలుగా వారి రాసిన కథలు, ఎన్నో పత్రికలలో ప్రచురింపబడ్డాయి."రచయితగా నేనేమీ పాఠకుడికంటే నైతికంగానూ , బౌద్ధికంగానూ ఉన్నతస్థాయిలో లేను " అని నమ్రత తో చెప్పే చంద్ర గారు, ఉత్తమమైన కథా వస్తువులను ఎంచుకుంటూ , పాఠకులను ఆలోంచింపజేసే చాలా మంచి రచనలను చేస్తూ వస్తున్నారు.కథను హర్షణీయం ద్వారా అందించడానికి తమ అనుమతినిచ్చిన శ్రీ చంద్ర గారికి కృతజ్ఞతలు.సత్యం:ఆ శుక్రవారం సాయంత్రం అతడు ఇల్లు చేరేసరికి ఆలస్య మయింది. నెరిసిన జుట్టు అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఒకటే ఇబ్బంది పెడుతుండడం చేత దారిలో ఆగి షాప్ లో జుట్టుకు వేసుకునే నల్లరంగు కొనుక్కున్నాడు. దానికితోడు ఒకటే వాన కావడంతో ట్రాఫిక్ గొడవ.ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్కడ వాతావరణం బిగుసు కుని ఉన్నట్లు తెలిసిపోయింది. రణగొణ ధ్వనులు చేసే టీవీ కట్టేసి ఉంది. పుస్తకం ముందేసుకుని కళ్ళు తుడుచుకుంటూ కూచుని ఉన్నాడు బాబు. పాప బిక్కచిక్కిన మొహంతో వాడివే పే చూస్తూ ఉంది ఆడటం మానేసి.“ఏమిటీ ఏమయింది?” ఆమెని అడిగాడు దగ్గరకొచ్చి కాళ్ళకు చుట్టుకున్న పాపను ఎత్తుకుని ముద్దాడుతూనే.“పోయినవారం వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ రావలసింది, ఇంకా రాలేదు. ఏదిరా అంటే వాడి టీచర్ ఇవ్వలేదంటాడు.”“ఇవ్వలేదేమోలే! అప్పుడప్పుడూ ఆలస్యమవుతుంది కదా!”“ఇన్ని రోజులు ఎప్పుడూ ఆలస్యం కాలేదు. వాడు చెప్పే తీరు చూస్తుంటే ఏదో దాస్తున్నట్టనిపిస్తుంది!”“మర్చిపోయాడేమో వాడి బ్యాగ్ లో వెతక్కపోయావా?” “వెతికాను. లేదు!”“నేనేమీ అబద్ధం చెప్పటం లేదు.” వెక్కి వెక్కి ఏడుస్తూనే అంటున్నాడు బాబు.“నువ్వు ఏడవటం ఆపు ముందు. పోనీ సోమవారం వాడి టీచర్ని కనుక్కుంటే పోతుంది కదా!”“వాడు నిజం చెప్పడం లేదని నాకు తెలుసు. మళ్ళీ వీడి సంగతి స్కూల్లో అందరికీ తెలియాలా? అయినా సోమవారం దాకా ఎందుకు. ఇప్పుడే వాడి నోటితోటే నిజం చెప్పించాలి.”“వాడు అట్లా అబద్దమెందుకాడుతాడు? బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చని పిస్తూంది నాకయితే!” ఆమెకి దగ్గరగా వచ్చి నెమ్మదిగా చెప్పాడు వాడికి వినపడకుండా.“ఏమో ఏం తెలుసు? మనం నమ్మేం కనక అన్నీ నిజాలే. అయినా వాడి సంగతి నాకు తెలుసు. మీరు వాడి చేత నిజం చెప్పించగలిగితే చెప్పించండి, లేకపోతే నాకు వదిలేయండి.”ఎర్రటి కళ్ళూ, పసిబుగ్గల మీద కన్నీటి చారికలూ, మధ్య మధ్య చొక్కా చేతు లతో తుడుచుకుంటూ వాడి ఏడుపు చూస్తుంటే అబద్దమాడుతున్నట్టు అనిపించడం లేదు. అట్లాగని అమెకి నచ్చచెప్పనూ లేడు.పిల్లలకెదురుగా వాదులాడుకోకూడదని వాళ్ళ మధ్య ఓ వొప్పందం. వాడు రక్షించమన్నట్టు తనవేపే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్. అయినా తల్లినుంచి కొడుకుని కాపాడేదేమిటి అని సర్దిచెప్పుకుంటూ పాపను తీసుకుని బెడ్ రూమ్ లోకి నడిచాడు.మామూలుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన రోజు గొడవ వేరేగా ఉండేది. వాడి ఖర్మ కాలి అన్నిట్లోకీ వాడికి సైన్స్ లో తక్కువ మార్కులు వస్తాయి ఎప్పుడూ. ఇక వాడిని కూచోబెట్టి ముందు కోపంగానూ, చివరికి అనునయంగానూ వాడికి నూరిపోసేది సైన్సులో తొంభయి అయిదు శాతం కంటే మార్కులు తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో. తర్వాత వాడికి వారం రోజులు టీవీ కట్.రాత్రిళ్ళు వాడి దగ్గరే కూచుని కదలకుండా, కదలనీయకుండా చదివించేది.చాలాసార్లు చెప్పాడామెకి. వాడినట్లా భయ పెట్టటం వల్లా, దండించటం వల్లా ఉపయోగమేమీ ఉండదనీ. వాడికి తక్కువ మార్కులు వచ్చినప్పుడు వాడికే పాఠం అర్థంకాలేదో, ఏ జవాబులు రాయటంలో తప్పులు చేశాడో కనుక్కుని వాడికి సాయం చేయాలనీ.పాపను కాస్త ముద్దు చేసి టీవీ ముందు కూచోబెట్టి స్నానం చేసి వచ్చేసరికి ఇంకా పరిస్థితిలో మార్పేమీ లేదు. వాడు అట్లాగే ముక్కు ఎగబీలుస్తూ, కళ్ళు తుడుచు కుంటూ ఉన్నాడు. ఆమె భోజనం వడ్డించి ఎదురు చూస్తూ ఉంది.“ముందా ఏడుపు ఆపి హోమ్ వర్క్ చేయి!" వాడిని కసిరాడు. వాడు బదులేమీ చెప్పలేదు.“ఇంతకీ వాడు తిన్నాడా?” ఆమెతో పాటు తింటూ అడిగాడు. “తిన్నాడు,” పొడిగా చెప్పింది, అంతకంటే మాట్లాడటం ఇష్టం లేనట్టు. అతనూ మాట్లాడకుండానే భోజనం కానిచ్చాడు. ఆమె గిన్నెలు సర్దుతుంటే వాడి దగ్గరకొచ్చి కూచున్నాడు.“ఏరా నీకు నాన్నా పులి కథ చెప్పాను గుర్తుందా?" వాడు తల నిలువుగా వూగించాడు ఎత్తి చూడకుండానే.“నువ్వు ఒకసారి అబద్ధం