తాత రాత

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

"చిన్నయ్య! ఈ రోజు నువ్వు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్లి రావాలి. నీతో పాటు, మీ అక్క, బావ, మా చిన్నమ్మ వస్తారు"ఆ రోజు ఉదయమే, మా అన్న పెళ్లి అయ్యింది. మేము ఇవ్వాల్సిన రిసెప్షన్ కూడా అదే రోజు రాత్రి, పక్కరోజు వినాయక చవితి అవటం తో,డిన్నర్ కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూసుకొని, సాయంత్రం నాలుగప్పుడు ఇంటికి చేరుకున్నా, వళ్ళంతా నొప్పులు , పులిసిపొయ్యినట్టుంది ఎడ తెగని తిరుగుళ్ల వల్ల.కాస్త నడుము వాలుద్దామని ఇంటికొచ్చా, లేక పోతే వంట వాళ్ళ దగ్గరే సరిపోయుండేది నాకు ఆ సాయంత్రమంతా.అంత అలసట లో కూడా, నాకు పెళ్లి చూపులు అంటే ఎదో తెలియని ఉత్సుకత, ఉత్సాహం. అమ్మాయి ఫోటో ఉందా, నా ఫోటో అమ్మాయి చూసిందా అనే జ్ఞానం కూడా లేదు మరి. ముంజేతి కంకణానికి అద్దం ఏల అన్నట్టు. "సరే నాన్న, ఒక గంట నడుము వాలుస్తా, ఐదున్నర పైన బయల్దేరి వెళ్తాము" అన్నా.అలా ఆరుగంటలకు వాళ్ళ ఇల్లు చేరుకున్నాము, సదరు అమ్మాయి వాళ్ళ అక్క గారింటికి, పెళ్లి చూపుల బాధ్యత ఆవిడ తీసుకోవటం తో.మేము వెళ్లే సరికి, వాళ్ళ తరపున కొందరు పెద్ద మనుషులు, అమ్మాయి తాత గారు కూర్చొని వున్నారు హాల్లోవాళ్ళ అక్క పిల్లలు అనుకుంటా, ఒక రెండేళ్ల పాపా ఒక నాలుగేళ్ళ బాబూ అక్కడ వేసిన కుర్చీలు, టేబుళ్ల మధ్య పరిగెడుతూ ఆడుకుంటున్నారు.వాళ్ళ ఆటలు గమనిస్తూ, వాళ్ళని దగ్గరకి రమ్మంటూ బతిమాలుకుంటూ, పెద్ద వాళ్ళు అడిగే చదువు, ఉద్యోగం, ఉద్యోగం వెలగబెట్టే ఊరి గురించి ప్రశ్నలు కొన్నిటికి మనస్కం గాను కొన్నిటికి అన్యమనస్కం గాను సమాధానాలు ఇస్తూ వున్నా.ఈ లోపల కొన్ని బిస్కట్స్ , తాగడానికి కొబ్బరి నీళ్లు వచ్చాయి."బానేవుంది ఈ కొబ్బరి నీళ్ల ఏర్పాటు, రొటీన్ గా ఇచ్చే టీలు కాఫీలు కాకుండా " అనుకుంటుండంగానే, అమ్మాయి వాళ్ళ అమ్మ అనుకుంటా, "కొబ్బిరి నీళ్లు తీసుకో నాయన! అవి మన ఊరి నుండి వచ్చినవే", అంటూ పలకరించేశారు.ఈ లోపల, నా చేతుల్లోని ఆడుకుంటున్న, ఆ రెండేళ్ల బుడ్డది, గబుక్కున దూకి, అక్కడే మా మధ్యన వున్న టేబుల్ మీద నున్న, ఓ క్రీం బిస్కట్ ను రెండు చక్రాలు గా విడ గొట్టి, వాటి మధ్యన వున్న క్రీం నాలుక పెట్టి నాక్కొని, ఆ చక్రాలు నా చేతిలో పెట్టి, "నువ్వు తిను బాబాయ్", అనేసింది.ఆ బుడ్డ దానికి మాటలకు చేతలకు, అప్పటికే మైమరిచిపోయి వున్న నేను ఏమాత్రం సందేహించకుండా వాటిల్ని తినేసాను.ఆ లోపల అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చోపెట్టారు. చిన్న పాప తో ఆడుకుంటూనే , అమ్మాయిని గమనించడం మొదలు పెట్టాను. తాను బహు పొడగరి, బాగా కళగా వుంది అమ్మాయి, ఇదిగాక ఆమె కళ్ళల్లో ప్రశాంతత, సౌమ్యత నాకు చాలా ప్రత్యేక మనిపించింది.ఎప్పుడు మా ఎక్సప్రెస్ పెళ్లి చూపులు ముగిసాయి కూడా నాకు తెలియదు.లేచి వాళ్ళ ఇంటి ముందున్న ఆరు బయల్లో నిలబడ్డాము.వాళ్ళ తాత గారు, దగ్గర కొచ్చారు, "అబ్బయ్య! నా మనవరాలు అని చెప్పుకోవటం కాదు కానీ, బాగా మెతకయ్యా! అందుకే ఓ మంచి అయ్య చేతిలో పెట్టాలని ఈ వయస్సులో నా తాపత్రయం నువ్వు నాకైతే నచ్చావయ్యా! అమ్మాయి గురుంచి ఏమంటావు" అంటూ."మీ మనవరాలుకేమి తాతా ! వంకలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికైనా నచ్చుతుంది""నీకు నచ్చిందా! అయ్యా" అన్నారాయన."అదే కదా తాతా నేను కూడా చెప్పేది" అన్నా నేను, డొంకతిరుగుడు గా. వెంటనే నచ్చేసింది అని చెప్పొచ్చో లేదో అన్న సందేహంతో."నేను ఉదయం, అమ్మాయి వాళ్ళ అన్నయ్యని, మీ అన్న పెళ్ళికి పంపిచ్చానయ్యా ! నిన్ను చూసి ఎలా వున్నావో వచ్చి చెప్పమని". "...""పిల్లగాడు బాగున్నాడు. కాక పోతే మన అమ్మాయికి పొట్టి అవుతాడు అన్నాడయ్యా.""...""కానీ నేను నా కళ్ళతో చూసిన దాకా నమ్మను. అందుకే ఈ ఏర్పాట్లు. మా అమ్మాయికన్నా నువ్వే రెండు అంగుళాలు హెచ్చు గున్నావు" అంటూ నవ్వారు ఆయన."మా అన్న పెళ్లి గురించి వీళ్లకు ఎలా తెలిసిందబ్బా " అనుకుంటున్న నాకు, ఆయనే, అక్కడ వున్న ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తూ, "ఇదిగోనయ్యా ఈయన మా బంధువు, ఇప్పుడు మీ అన్నకి బంధువు, మీ వదిన తరపున" అంటూ నా...