'గోమెజ్ ఎప్పుడొస్తాడో'
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
'గోమెజ్ ఎప్పుడొస్తాడో' అనే ఈ కథకు రచయిత శ్రీ. వేలూరి వెంకటేశ్వర రావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో జన్మించిన శ్రీ వెంకటేశ్వర రావు , తన విద్యాభ్యాసం అనంతరం, అమెరికా వెళ్లి సైంటిస్ట్ గా పనిచేసి , ప్రస్తుతం అట్లాంటా లో నివాసం వుంటున్నారు. వీరు ఇప్పటిదాకా రెండు కథ సంపుటాలను వెలువరించారు. 1980 దశకంలో 'తెలుగు వెలుగు' పత్రికను అమెరికా నించి నిర్వహించారు. కొంతకాలం 'ఈమాట' అంతర్జాల పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కథ వెంకటేశ్వర రావు గారి "ఆ నెల ఆ నీరు ఆ గాలి' అనే కథాసంకలనం నించి సేకరించబడింది. పుస్తకం కొనేటందుకు మరిన్ని వివరాలు 'వెబ్ పేజీ ' చివరలో ఇవ్వడం జరిగింది. ఈ కథలో ఆయన అమెరికాకు వచ్చే మెక్సికన్ ఇమిగ్రెంట్ లేబర్ అవస్థల గురించి చాల హృద్యంగా చిత్రీకరించారు. తానా వారు 2013 వ సంవత్సరం లో ముద్రించిన ' కథ - నేపధ్యం' అనే అనే ప్రత్యేక సంకలనం లో ఈ కథ ఎంపిక కాబడింది. కథను హర్షణీయం ద్వారా మీ కందించడానికి అనుమతినిచ్చిన శ్రీ వెకంకటేశ్వర రావు గారికి మా కృతజ్ఞతలు.గోమెజ్ ఇవాళా రాలేదు. పోయిన శనివారమే రావా ల్సినవాడు. పదు హేను రోజులకోసారి, శనివారం పొద్దున్నే వచ్చి లాస్ చెయ్యమని ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కాదు. ప్రతీసారీ 'యస్ యస్, సీ సీ,' అంటూ నవ్వుతూ తలకాయ ఊపుతాడు. అంతే. వాడికి తీరికైనప్పుడే వస్తాడు. వచ్చినప్పుడు ప్రతిసారీ శ్రద్ధగా గడ్డికోసి, ఇంటి ముందు, వెనకా పెరిగిన పొదలన్నింటినీ అందంగా కత్తిరిస్తాడు. అదేం ఖర్మమో మరి! ఎప్పుడూ మధ్యాన్నం ఒంటిగంటకి వస్తాడు. కనీసం రెండు గంటలు మండు టెండలో పనిచేస్తాడు. రోడ్డు మీద ఎవరిని చూసినా చెయ్యి ఊపుతూ నవ్వుతూనే ఉంటాడు. అందుకనే కాబోలు, వాడు రావలసిన రోజున టైముకి రాలేదని సుజాత ఎంత చిరాకుపడినా గోమెజ్ చేతే లాన్ పను లన్నీ దగ్గిర ఉండి చేయిస్తుంది. తను మంచినీళ్లు తాగుతూ వాడికి కోక్ బాటిల్ ఇస్తుంది.గోమెజ్ కి ఇంగ్లీషు రాదు, యస్ యస్, అనడంతప్ప! ఇంగ్లీషు నేర్చు కుందామన్న కుతూహలం కూడా ఉన్నట్టు కనిపించదు. సుజాతకి స్పానిష్ రాదు. నేర్చుకుందామని అనుకోవడమే కాని, పనికట్టుకొని ఈ వయస్సులో కొత్త భాష నేర్చు కోవడానికి కావలసిన ఓపికా లేదు. అయితేనేం, వాళ్ళిద్దరూ చేతులతో సైగలు చేస్తూ సంభాషణ చెయ్యడం మూకీ సినిమాలని మరిపిస్తుంది. నిజం చెప్పొద్దూ! వీళ్ళ ముందు మార్సెల్ మార్సో ఎందుకూ పనికి రాడనిపిస్తుంది. గుబురుగా పెరిగిన పొదలు ఎంత ఎత్తు ఉంచాలో, ఎంత కిందకి కత్తిరించాలో, ఏ పూలమొక్కలు ఎప్పుడు ఎక్కడ తిరిగి పాతాలో, ఈ వివరాలన్నీ సుజాత చేతులు తిప్పుకుంటూ సైగలు చేస్తూ చెప్పడం, వాడు యస్ యస్! అని తలకాయ ఊపడం చూడముచ్చటగా ఉంటుంది. ఈ రెండేళ్ళన్నరలో వాడు సుజాతతో మాట్లాడుతూ నేర్చుకున్న తెలుగు మాటలు ముత్యంగా మూడు- ఆగు, ఇలారా, కాదు. సుజాత నానాయాతనా పడి వాడితో మాట్లాడుతూ నేర్చుకున్న స్పానిష్ మాటలు- అమీగో, సబాదో, దొమింగో.రెండున్నర సంవత్సరాల పైనే అయ్యింది సుజాత, మోహన్లు ఆ వీధిలో ఒక పెద్ద పాత ఇల్లు కొనుక్కొని. ఇంటి ముందు, వెనక ఖాళీస్థలం అర ఎకరం పైనే ఉంటుంది. ముందు పెద్ద లాను, రకరకాల పూల పొదలు. వెనక అటూ ఇటూ రెండు వీపింగ్ విల్లో చెట్లు ఉన్నాయి. వెనకాల సరిహద్దులో పెద్ద బర్మ్.దాని కింద ఆరడుగు లెత్తున హెడ్డింగ్ పొదలూ ఉన్నాయి. వాళ్ళు కొత్త ఇంట్లోకి చేరిన రోజునే ఎదురింట్లోకి కేథరీన్, ఫ్రాంక్ కూడా వచ్చారు. ఇద్దరికీ సంసార బాధ్యతలు, ఇతర బాదరబందీలు ఏవీలేవు. దానికి తోడు ఒకే వయసు వాళ్ళవడంతో సుజాతకి, కేథరీన్ కీ ఇట్టే స్నేహం కుదిరింది. రోజూ పొద్దున్నే లేచి సబ్ డివిజన్ లో వీధులన్నీ కొలుచు కుంటూ మెల్లిగా నడవడం, అమ్మకానికున్న ప్రతి ఇంటి మీదా కామెంట్లు చెయ్యడం, సాయంత్రం పూట ఎవరి డ్రైవ్ వేలో వాళ్ళు నిలబడి గంటల తరబడి పిచ్చాపాటీ చెయ్యడం అలవాటయ్యింది. సుజాత అమెరికా వచ్చి ము ప్ఫై ఏళ్ళయ్యింది. ఇన్ని ఏళ్ళున్నా ఫలానా తెల్లవాళ్ళు స్నేహితులు అని చెప్పుకోవటానికి ఎవరూ ఉన్నట్టులేదు. అలాగని నల్లవాళ్ళూ కూడా లేరు. ఇంతకుముందు వాళ్ళున్న ఇంటి సంగతి సరేసరి! తను పెరట్లోకి వెళ్ళితే చాలు, తను చెయ్యి ఊపుతూ పలకరిద్దామనుకున్నా ఆవెనకింటి ఆవిడ హాయ్ అని కూడా అనేది కాదు! ఈ సబ్ డివిజన్ లోకి రావడం, వచ్చిన రోజే కేథరీతో స్నేహం కుదరడం కలిసివచ్చింది.ఒక శనివారం సాయంత్రం సుజాత, కేథరీన్ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ట్రక్ నిండా పైన్ స్ట్రా బేళ్ళు పెట్టుకొని ఒక పాతికేళ్ళ కుర్రాడు వచ్చాడు. ఒక కట్ట పైన్ స్ట్రా చేత్తో పట్టుకొని, ఇంటిముందు చెట్లకుదుళ్ళకి స్ట్రా వేస్తానని సైగ చేస్తూస్పానిష్ లో వటవట వాగడం మొదలెట్టాడు. కాథెరీన్ మాట్లాడద్దని తర్జని తన పెదాల పై పెట్టుకొని సైగ చేస్తూ, 'హౌ మచ్?' అని అడిగింది. వాడు మూడు వేళ్ళు చూపించాడు. అంతే! కేథరీన్ ఇంటి ముందు, సుజాత ఇంటి ముందూ చెట్లకి, పొదలకీ ఓపిగ్గా కుదుళ్ళు చేసి పై' వేశాడు. బహుశా ఒక్కొక్క ఇంటికి పాతికబేళ్ళు పట్టి...