'నాన్నతో ఒక్క రోజు' - తమిళ మూలం - సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
‘నాన్న తో ఒక్క రోజు’ తమిళ మూలం: సుప్రసిద్ధ కథా రచయిత సుందర రామస్వామి గారు నాన్నతో ఒక్కరోజు అనే కథకు తమిళ మూలం సుప్రసిద్ధ కథారచయిత సుందర రామస్వామి గారు. కథను మీ కందించడానికి అనుమతినిచ్చిన కణ్ణన్ గారికి, సహకరించిన గీతారామస్వామి గారికి కృతజ్ఞతలు. నాన్నకున్న ఒకే ఒక దాయాది రాజు పెదనాన్న. పేరుకు దాయాదులన్న మాటే గానీ , ఇద్దరూ, ఒకే కడుపున, పుట్టిన వాళ్ళ కంటే కూడా, ప్రేమగా సఖ్యంగా వుంటారు. నాన్న అమ్మలకు పెళ్ళైన కొన్నాళ్ళకే , ఆస్తులన్నీ కరిగిపోయాయి. బతకడానికి ఏ ఆధారమూ లేక, నిస్సహాయంగా మా కుటుంబం నిలబడుంటే, రాజు పెద్ద నాన్నే చెయ్యందించాడు. తనకు బాగా డబ్బులు తెచ్చిపెడుతున్న ఒక వ్యాపారాన్ని, నాన్నకిచ్చేసాడు, రాజు పెదనాన్న. ‘అప్పట్నుంచే, డబ్బు సంపాదన అంటూ, ఒకటి మొదలై, నలుగురిలో తలెత్తుకు తిరిగే స్థితికి చేరుకోగలిగాను. ఏమిచ్చినా ఆ ఋణం తీర్చుకునేది కాదు’ అంటారు నాన్న . అమ్మగూడా అదే అంటుంది. ఎప్పుడు రాజు పెదనాన్న గురించి మాట్లాడుకున్నా, ఇద్దరికీ కళ్ళు తడవుతాయి. నాతో, రమణి అక్కతో అమ్మ రాజు పెదనాన్న గురించి ఎంతలా చెప్పిందంటే, మేమిద్దరం ఆయన ‘దేవుడి’ అంశ అనుకోడం మొదలెట్టాం. సంవత్సరానికి ఒక సారి, పెదనాన్న, మా ఇంటికి వచ్చేవాడు. ఆయన వస్తున్నట్టు ఉత్తరం అందగానే, ఇల్లంతా సందడి మొదలయ్యేది. పెదనాన్నకి, నులక మంచం మీద పడుకోడం అంటే ఇష్టం. మొదట, ఆ మంచాన్ని పెరట్లోకి తీసుకెళ్ళి, మరిగే నీళ్ళు పోసి, నల్లులు లేకుండా, శుభ్రంగా, కడిగే కార్యక్రమం ప్రారంభం అయ్యేది. అమ్మ, ఆయన కిష్టమైన పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు తయారు చెయ్యడం మొదలెట్టేది. నాన్న బంగారు అంచుతో వుండే కొత్త విసనకర్రలు కొనుక్కొచ్చేవాడు. మధ్యాహ్నం పూట, భోజనం ఐన తర్వాత, పెదనాన్న పడుకునుంటే, చెరో వైపు నిలబడి, విసరడం రమణీ కి, నాకూ అలవాటు. రమణి ఎప్పుడూ నన్ను ఆయన కాళ్ళ వైపు నిలబడి విసరమనేది. ‘పెదనాన్న తల వైపు నిలబడి, ఆయన మొహానికి తగలకుండా, విసరడం నీకు చేతకాదు’ అని చెప్పేది. ఎప్పుడైనా అమ్మ పిలిస్తే, రమణి అక్కడినించి వెళ్ళిపోయినప్పుడు, నేను పెదనాన్న మీదకి, బాగా ముందుకు వంగి, విపరీతంగా విసిరేవాణ్ణి. అప్పుడు, రాజు పెదనాన్న, నీ సంగతి నాకు తెలిసిపోయిందన్నట్టుగా, మూసిన కళ్ళు తెరవకుండానే, నవ్వేవాడు. ఆ నవ్వులో, తమలపాకులతో పండిన అందమైన ఎరుపు, లీలగా మెరిసేది. వడసేరి తనుమాలయన్ నేసిన పంచెలు మాత్రమే, తన ఒడ్డూ పొడుగుకి సరిపోతాయనే వాడు, రాజు పెదనాన్న. ఆయన కోసమని, ప్రత్యేకంగా, నాణ్యమైన నూరో నంబరు నూలు పంచెలు కావాలని, దుకాణానికి కబురు పంపించేవాడు నాన్న. అమ్మ, ఆనందత్త కల్సి పెరట్లోకి వెళ్ళి, ఏ అరటిచెట్టు నించి, ఏ ఏ ఆకులు కోసి, భోజనాలకు వాడాలో, నిర్ణయించే వాళ్ళు. ఎందుకోగానీ, ఎప్పుడూ రాజు పెదనాన్న రావడం, మా ఆవు ఈనడం ఒకే సారి జరిగేవి. ‘ఇలాటి జున్ను తినాలంటే, రాజు లాగా పెట్టి పుట్టాలి,’ అనేవాడు గర్వంగా నాన్న. రాజు పెదనాన్న కుటుంబం చాలా పెద్దది. ‘మా ఇంట్లో పన్నెండున్నర మందిమి మేము!’ అనేవారు పెదనాన, తమాషాగా. అది కొంచెం అతిశయోక్తి. నిజానికి ఆయనకు పద్నాలుగు మంది పిల్లలు. దాదాపు, ముప్పయి మంది మనవళ్ళు, మనవరాళ్ళూ. ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి వంటిల్లు . కొన్నిరోజులైనా సరే, ఆ సందడంతా వదిలేసి వచ్చి, మా ఇంట్లో ఉండడం పెదనాన్నకి ఎంత కష్టమో, మా అమ్మానాన్నలకి తెలుసు. ఆయనకు ఇంటికి వెళ్లిపోదామనే ఆలోచన వచ్చినట్టు గమనించగానే, ’ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దానికి తొందరేముంది?’ అని అంటూ, ఇంకొన్ని రోజులు, ఉండమని బలవంతం చేసేవారు నాన్న. ఇద్దరూ కూచుని, వాళ్ళ చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకుంటూ, ‘ఇంతకు ముందు రోజులా ఇవి ? అన్నీ నాశనం అయిపోతున్నాయి’ అని ముక్తాయించే వాళ్ళు. రాత్రంతా మేలుకుని అలా మాట్లాడుకుంటూనే వుండే వాళ్ళు. అయినా, మరుసటి రోజు పొద్దున్న లేచింతర్వాత గూడా, మాట్లాడుకోడానికి, వాళ్ళకు మాటలు ఇంకా మిగిలుండేవి. ప్రతిరోజూ పొద్దున్న, షాపు తెరవడానికి వెడుతూ , ‘నాలుగు గింజలకోసం, పెదనాన్న తో సమయం గడపకుండా, వెళ్ళాల్సివస్తోందే’, అన్న బాధ కనపరుస్తూ, నెమ్మదిగా బయలుదేరేవాడు నాన్న. ఆ రోజుల్లో ఇంట్లో ఫోన్ ఉండడం అనేది చాలా అరుదు. ఓ రోజు తెల్లవారు ఝామున, ఫోన్ ఆఫీసునించి ఒకతను హడావుడిగా వచ్చాడు. నాన్నకు, కొచ్చిన్ నించీ ఏదో ఫోన్ వచ్చిందనుకుంటా. విషయం విని అమ్మా నాన్నలకు నోట్లో మాట రాలేదు. కొచ్చిన్ లో ఉండేది రాజు పెదనాన్న. నాన్న మొహాన్ని గమనిస్తూ , విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆతృత పడ్డాను....