నవ్వితే నవ్వండి
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
హర్షణీయం మొదలు పెట్టి 3 మాసాలు అయ్యింది. ఈ కొద్దికాలంలోనే ఐదు వేల మంది పాఠకులు మా బ్లాగ్ ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా 'హర్షాతిధ్యం' అనే కొత్త శీర్షిక మేము మొదలుపెడ్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశ్యం, తెలుగు బ్లాగ్ ప్రపంచంలో వుండే చక్కటి కథల్ని, హర్షణీయం పాఠకులకు ప్రతి నెలా మొదటి వారంలో పరిచయం చెయ్యడం. ఈ శీర్షికన, మా ప్రథమ అతిధి గా విచ్చేసిన , శ్రీయుతులు బులుసు సుబ్రహ్మణ్యం గారి మా హార్దిక స్వాగతం. ఆయన రాసిన ' వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి' అనే హాస్య రచన తెలుగు బ్లాగ్ ప్రపంచపు అభిమానులకు సుపరిచితం. ఆ రచనతో, మా 'హర్షాతిధ్యం' ను మొదలు పెట్టడం జరుగుతోంది. పైకి ఒక చక్కటి హాస్య రచన అనిపించినా , కథ లోపలి పొరల్లో, ప్రతి మనిషి తన జీవితంలోని వేర్వేరు దశల్లో, తనకొక ప్రత్యేకమైన గుర్తింపు కోసం పడే సంఘర్షణను దాచివుంచడంలో రచయిత అత్యుత్తమ ప్రతిభ పాటవాలు మనకు దర్శితం అవుతాయి. రచయిత పరిచయం : పేరు: డాక్టర్ బులుసు సుబ్రహ్మణ్యం విద్య : డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ స్వస్థలం : భీమవరం , పశ్చిమ గోదావరి జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ నివాసం: హైదరాబాద్ , తెలంగాణ. ఉద్యోగం: Rtd. Sr. సైంటిస్ట్ శైలి : హ్యూమనిజం తో కూడిన హ్యూమరిజం బ్లాగ్ యుఆర్ఎల్ : https://bulususubrahmanyam.blogspot.com పుస్తక ప్రచురణ : 'బులుసు సుబ్రహ్మణ్యం కథలు' : https://kinige.com/book/Bulusu+Subrahmanyam+Kathalu శ్రీ సుబ్రహ్మణ్యం గారు తెలుగు బ్లాగ్ ప్రపంచంలో సుప్రసిద్ధులు. దాదాపు పదేళ్లుగా ఆయన రచనా వ్యాసంగం కొనసాగుతోంది. ఆరోగ్యకరమైన హాస్యాన్ని, దైనందిన జీవితంలో జరిగే సంఘటనల్లోనుంచి, పుట్టించడం లో వీరిది అందెవేసిన చెయ్యి. మా హర్షణీయం లో , 'హర్షాతిధ్యం' శీర్షిక పై వచ్చే మొదటి రచన, వీరిదవ్వడం మాకెంతో హర్షణీయం, గర్వకారణం. మేము మా బ్లాగ్ లో ఆయన రచనను ప్రచురిస్తామని అడగడమే తరువాయి, వారు మా అభ్యర్ధన ను మన్నించడం జరిగింది. వారి రచనలన్నీ మాకు ప్రియాలైనా, వారు వారి పేరు మీద వేసుకున్న వ్యంగాస్త్రం, 'వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి' అనే రచన మా ఉద్దేశ్యంలో వారి కథా శిల్ప చాతుర్యానికి అత్యుత్తమ ఉదాహరణ. మరోసారి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ , వారికి సదా ఆ వేంకటేశుని అనుగ్రహ ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తున్నాం. ఆయన చేసిన చేస్తున్న, రచనల సమాహారం, ఆయన బ్లాగ్ యుఆర్ఎల్ లో ( https://bulususubrahmanyam.blogspot.com/) పొందుపరచడం జరిగింది. ప్రతి తెలుగు హాస్య ప్రియుడికి, ఆ బ్లాగ్ సందర్శన ఒక గొప్ప అనుభూతి మిగులుస్తుందనడం లో సందేహం లేదు.