కథా సరిత్సాగరం!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
మా అమ్మమ్మ చెప్పే కథల గురించి ఇంతకుముందు చెప్పా కదా! మాకు కథలు చెప్పటం అనేది, తన రోజూ వారీ దినచర్యలో ఆవిడకి అన్నిటికంటే ఇష్టమైన ప్రక్రియ. కానీ మేము అడిగిన ప్రతీసారీ ఆవిడ, తన దగ్గరినించీ ఈ కథలు, అంత తేలిగ్గా బయటకి తీసేది కాదు. ఒక్కోసారి ముందుగా పొడుపు కథలు చెప్పేది. అంటే, పొడుపు కథ మేము విప్పితే గానీ అసలు కథ బయటకి రాదన్నమాట. ఇదంతా అయ్యిన తర్వాత, ఆమె కథ చెప్పడానికి రెడీ అయితే బోనస్, లేక పోతే ఆవిడ, ఆ పొడుపు కథనే ఆరోజుకి పొదుపుగా వాడేసుకుంది , అని మేము అర్థం చేసుకోవాలి. అలా ఆవిడ తన అమ్ముల పొదిలో వున్న కథలను, విరివిగా వాడకుండా, విడతల వారీగా మాత్రమే, బయటకి తీసేది. మేము కూడా ఆవిడ చేత కథ చెప్పిచ్చుకోవడానికి, వంకర టింకర శొ…వాని తమ్ముడు అ…నల్ల గుడ్ల మి…నాలుగు కాళ్ళ మే… తోకలేని పిట్ట తొంబై మైళ్ళు…తొడిమలేని పండు, ఎన్నటికీ వుండు… లాటి పొడుపు కథలు రాగయుక్తంగా పాడుకుంటూ సమాధానాలకు తెగ ఆలోచించేసి, మా చిన్న బుర్రల్ని సాన పెట్టేసి, నానా కష్టాలూ పడే వాళ్ళం. కథల కోసమని చెప్పి, పగలంతా ఆవిడ పనుల్లో సహాయం చేస్తూనో, ఆవిడకి కావాల్సి వస్తువులు అంగడికి వెళ్లి వెంటనే తెచ్చి పెట్టడమో ……… ఇట్టా పొద్దస్తమానం ఆవిడ చుట్టూనే తిరిగేవాళ్ళం. 'లలిత' గుండాయన చెప్పినట్టు జీవితంలో ఏదీ వూరికే రాదనీ, మాకప్పుడే అర్థమయ్యేట్టు చేసింది మా అమ్మమ్మ. ఆఖరికి, సాయంకాలం ఆటలకి వెళ్లిన మేము, మేతకెళ్లిన పశువులు ఊర్లో అడుగెట్టక ముందే, వెన్కక్కొచ్చేసి, తద్వారా ఆవిడని సంతోషపెట్టి, కథలు సాధించుకునేవాళ్ళం. ఈ సందర్భంగా చెప్పాలంటే, ఆవిడ కి మా గురించి చాలా భయాలు ఉండేవి, పశువులు తిరిగి ఇళ్లకు వచ్చే వేళ, మేము వాటి మధ్యలో పడి నలిగి పోతామనో, మేము ఆటల్లో పడి, పశువుల కోసం ఉంచిన కుడితి తొట్లల్లో పడి పోతామనో ఇలా రక రకాలుగా. మేము ఆటల్నించి రావడం ఒక పది నిముషాలు లేట్ అయినా, మమ్మల్ని, వెతుక్కుంటూ ఆవిడే ఊర్లోకి వచ్చేసేది. అలా వచ్చినప్పుడు మేము కానీ కనపడక పోతే వెళ్లి అమాంతం గా అన్నీ కుడితి తొట్లల్లో చేతులు పెట్టి దేవేసేది. ఆవిడ మా ఊర్లో జనాల్ని అయ్యా, మా చిన్నోడిని ఎక్కడన్నా చూశారా, మా బేబమ్మ (మా అక్క ముద్దు పేరు) ఎక్కడన్నా కనపడిందా అని అడుగుతూ వెతుక్కుంటూ రావటం ………. ఎక్కడి పోతాం అమ్మమ్మా! మేము ఏమన్నా చిన్నపిల్లలమా , అని మేము ఆవిణ్ణి విసుక్కోవటం నాకు యింకా గుర్తే. మా దోస్తులు కూడా, ఇంకా మీ అమ్మమ్మ రాలేదేమిటా అనుకుంటా వున్నాము, అనుకోంగానే దిగిపోయిందావిడ, ఇంక ఆటలు ఆపెయ్యాలి అని, మా మొహం మీదే, నిరాశతో కలిపిన వెట - కారాలు చల్లేవాళ్ళు . మా అమ్మమ్మ చెప్పే కథలు చాలక, ఒక్కోసారి మేము మా చిన్నమ్మమ్మ దగ్గర చేరేవాళ్ళం. మాకు కథలు చెప్పడానికి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక తెలియని పోటీ ఉండేది. మేము మా చిన్నమ్మమ్మ చేత చెప్పించు కోవాలంటే, ప్రీ కండీషనూ, ఆవిడ కుండే తెల్లని వెంట్రుకలు మేం లాగి తీసేయటం. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి మా చిన్న అమ్మమ్మ, కథలు చెప్పటంలో మా అమ్మమ్మకి ఏమాత్రం తీసిపొయ్యేది కాదు. రామాయణ, భారత కథలతో పాటు, కాశీ మజిలీ, భోజరాజు-సాలభంజికలు, బట్టి విక్రమార్కులు, మిత్ర లాభాలు, మిత్ర బేధాలు, అక్బర్ బీర్బల్, ముల్లా నసీరుద్దీన్, అలీబాబా నలభై దొంగల వంటి - కథలన్నీ, సంభాషణల తో సహా అన్నీ రకాల కథలూ - మా చిన్నమ్మమ్మ కి కొట్టిన పిండి. ఆ కథలన్నీ వినడానికి, మాకు ఆవిడకి వుండే తెల్ల జుట్టుతో పాటు అప్పుడే నెరవడం మొదలు పెట్టిన వాటిల్ని కూడా అనవసరంగా లాగేసే వాళ్ళం. మా చిన్నమ్మమ్మ, కథలు, వాటిలోని సంభాషణలు, చేతులు తిప్పుతూ, కళ్ళతో హావభావ