లక్ష్మి, లేకపోవటం చాలా చేదు నిజం!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
నాన్న వాళ్ళది ఉలవపాళ్ళ. నేషనల్ హైవే లో నెల్లూరు నుండి కావలికి వెళ్తుంటే సున్నబ్బట్టి , అల్లూరు గేట్ దాటిన తర్వాత హైవే నుండి ఒక కిలో మీటర్ లోపలి కెళ్ళాలి. ఒకప్పుడు బిట్రగుంట లోకో ఇంజిన్ మైంటెనెన్సు కి ఫేమస్. ఆ చుట్టు పక్కల ఊర్లలో సగం మంది రైల్వే ఎంప్లాయిస్. డ్రైవర్స్, ఫిట్టర్స్, గ్యాంగ్ మెన్ ఎవరి అర్హతల్ని బట్టి వారు ఆ చుట్టుపక్కల గ్రామాలనుండి బాగా సర్వీసెస్ లో వుండే వారు. మా తాత గారు కూడా అక్కడ ఫిట్టర్ . పక్కా కమ్యూనిస్ట్. ప్రజాశక్తి న్యూస్ పేపర్ చదవటమే కాక పది మందికి రోజూ చదివి వినిపించనిదే ఆయనకు నిద్ర రాదు. పుచ్చలపల్లి సుందరయ్య కి అనుంగు శిష్యుడు. ఆయనంత పెద్ద లీడర్ కావాలని మా నాన్న పేరు కూడా సుందర రామయ్య అని పెట్టారు. మా ఊర్లో పిల్లకాయలకి పేర్లు కూడా కొంత వింతగా పెట్టేవారు. రాజమ్మ హాస్పిటల్ లో పుట్టాడని మా తమ్ముడి పేరు రాజా రామయ్య , మా మా మేనత్త కొడుకుల పేర్లు భాస్కరయ్య , గోపాలయ్య. ఎందుకంటే వాళ్ళు మా మేనత్త కడుపు తో వున్నప్పుడు చూసిన వైద్యులు . ఆలా ఉండేవి వాళ్ళ కృతజ్ఞతలు అలాగే వైద్యులను దేవుళ్ళలాగా చూసే విధానం. మా వూరు లో చాలా మంది రైల్వే ఉద్యోగులు, రైతులు అలాగే బిట్రగుంటలో వ్యాపారాలు చేసుకొనే వారు. చాలా మటుకు బొంతరాయి గోడలమీద పెంకులతో ఇళ్ళు కళ కళ లాడుతూ ఉండేవి. మా ఊరి చెరువు రామన్న చెరువు , చేపలకి చాల ప్రసిద్ధి . ఊరులో బలిజ వీధి, రెడ్ల వీధి , గొల్ల వీధి , సాలె వీధి. వూరికి కొంత దూరంగా మాలాడ, మాదిగ వాడ. ఒకప్పటి టిపికల్ విలేజ్ స్ట్రక్చర్. ఎవరి వృత్తులు వారివే. మా తాత కమ్యూనిస్ట్ అన్నాను కదా అందుకే మా నివాసం రెడ్ల వీధిలో కాదు, బలిజలందరి మధ్య. ఇక్కడ నేను కాస్ట్ డివిజన్ గురుంచి మాటలాడటం లేదు. వాళ్ళ మధ్య వున్న యూనిటీ గురించి చెప్తున్నా. మా అమ్మ పిల్లలందరికీ చదువు చెప్పేది మాతో పాటు. పిల్లలకు మా గేదె పాలు ఒక గ్లాస్ ఫ్రీ. మాకు ఒక ఐదు ఎకరాల తోట ఉండేది. వేరుసెనగ మరియు మిరప ఎక్కువగా పండించేవాళ్ళము. ఇతర పంటలుగా గోంగూర, వంగ, బెండ మొదలగునవి వేసే వాళ్ళము. ఈ ఇతర పంటలు అమ్మకానికి కాదు. కోసి ఇంటికి తీసుకొస్తే ఎవరైనా తీసుకెళ్లొచ్చు. అమ్మ ఎవరికీ అడ్డు చెప్పేది కాదు. అందుకే చుట్టుపక్కల వాళ్లందరికీ మా అమ్మ అంటే చదువుకున్నది, పిల్లలకి నాలుగు చదువు ముక్కలొస్తున్నాయని, తన దగ్గర ఉంటే సహాయం అడగ కుండానే వస్తుందని వాళ్ళ ఇంట్లో మనిషిగానే వుండే వారు. మా ఇంటి పక్కలంతా మామిడాల వాళ్ళు, కేశాని వాళ్ళు, అక్కిశెట్టి గారు, పూలశెట్టి వాళ్ళు. మా వూర్లో ముందు ఇంటిపేర్లే చెప్పాలి. ఎవరబ్బాయివిరా అంటే మామిడాల వాళ్ళ అబ్బాయిననో, అక్కిశెట్టి గార్ల పిల్లోడిననో చెప్పాలి దాన్ని బట్టి ఏ కులమో కనిపెట్టేస్తారు. నేను ఆదిరెడ్డి మనవడిని అంతే. ఎవరన్నా ఎవర్రా నువ్వు అంటే నా దోస్తులు ఆదిరెడ్డి మనవడు అని చెప్పేవారు. మా వూర్లో గుడులకు కూడా కొదవ లేదు. ఒక రామాలయం , ఒక కామాక్షమ్మ గుడి, ఒక ఆంజనేయస్వామి గుడి. వూరికి ముందు ఒక వాగు వూరికి వెనుక రామన్న చెరువు. ఆ వూర్లో మా పిల్లకాయలు ఆడిందే ఆట పాడిందే పాత. ఎక్కడ నీళ్లుంటే అక్కడే మా ముడ్లు కడగటం, ఆడటం. వాగులో నీళ్లుంటే వాగు పక్క, చెరువులో నీళ్లుంటే చెరువు పక్క. ఛాయస్ మాదే. నాకు ముగ్గురు దోస్తులు. మామిడేలా కిష్ట, అక్కిశెట్టి శేషగిరి, గుడిపూజారి కొడుకు స్వామి. కిష్టకి అమ్మ లేదు చనిపోయింది. నాన్న వెళ్ళిపోయాడు ముగ్గురు పిల్లల్ని వాళ్ళ తాత కి వదిలేసి. తాతేమో అమ్మమ్మ చనిపోతే ఇంకో ఆవిడని చేసుకున్నాడు. ఆవిడ పేరు పద్మావతమ్మ . ఆవిడే వీళ్ళ ముగ్గురుని చూసుకొనే వారు. ఆవిడకి కిష్ట వాళ్ళ తాత వలన లక్ష్మి అని ఒక పాప . మాకన్నా రెండేళ్లు చిన్న. మాకు ఆరేళ్ళు ఉంటే ఆ పాపకి నాలుగేళ్లు. లక్ష్మి , మా తమ్ముడు రాజా ఐకే వయస్సు. ఆటలు పాటలు వాళ్లొక బ్యాచ్. ఒక రోజు కిష్ట, స్వామి సాయంత్రం మూడు అప్పుడు వచ్చారు తోపులోకి వెళదామని అంటే చెరువు వైపు. నాకెందుకు తోపులో చింత చెట్లు దెయ్యాల్లా ఉంటాయి, అందుకని నేను వాగుకి వెళ్ళడానికి ఇష్టపడతా. నేను రాను అన్నా, కానీ వాళ్ళు ఇద్దరు నేను ఒకడిని. అందులో చెరువు లోకి నీళ్లు అప్పుడే వస్తున్నాయి. నీళ్ళల్లో ఆడొచ్చు అని. ఎప్పుడూ మాతో రాని లక్ష్మి ఆ రోజు వెంటబడింది నేను వస్తా అని. వొద్దని రానివ్వలేదు. ఐనా వెంటబడితే వాళ్ళింట్లో దింపొచ్చాము. కానీ ఇంట్లో కళ్లుకప్పి మా వెంట వచ్చేసింది. తీసుకెళ్ళాం. అక్కడ నీళ్లను చూస్తే మాకు పూనకం వచ్చేసింది. అక్కడ అప్పటికే ఓ పది నుండి పదిహేను వరకూ చిన్న చితక పిల్లలున్నారు. వాళ్ళల్లో కలిసిపోయాం. అసలు లక్ష్మి మా వెంట వచ్చిందనే స్పృహే లేదు మాకు. ఆడాం ఆడాం అలిసిపోయే వరకు. వచ్చేస