చిన్నప్పుడే చితికిపోయిన నా చిన్నమెదటి, భేతాళ ప్రశ్న

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, ఎప్పటిలా చెట్టుపైనుంచి శవాన్ని దించి, భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, "ఓ! రాజా ఇంత అర్థరాత్రివేళ, భీతిగొలిపే ఈ స్మశాన వాతావరణం లో, ఎదో సాధించాలన్న నీ పట్టుదల కారణంగా, నీవు చేస్తున్న ఈ పని నీకు అత్యంత సహజంగా కనపడుతున్నట్టు నా కనిపిస్తుంది. నాకెందుకలా అనిపిస్తుందో, ఉదాహరణగా నీకు అచ్చు నీలాటి పట్టుదల చూపిన భగీరథుని కథ చెపుతాను శ్రమ తెలీయకుండా విను", అంటూ ఇలా చెప్పసాగాడు. "భగీరధుడు మహాజ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరు, దీక్షకు, సహనానికి ప్రతిరూపం. ఎంతటి కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించే వారిని భగీరథునితో పోలుస్తారు . భగీరథుడు, తన తల్లి ద్వారా తన పూర్వీకులైన, సగరుని కుమారుల శాపాన్ని విని, వారి చితా భస్మాల మీద పవిత్ర ఆకాశ గంగను ప్రవహింప చేసి, వారికి సత్గతులు ప్రసాదించాడు", అని భగీరథ కథ పూర్తిగా చెప్పాడు. అలా చెప్పి, "రాజా నాకు ఈ కథలో కొన్ని సందేహాలున్నాయి, ఆ సందేహాలకు నువ్వు సమాధానం తెలిసి చెప్పకపోతే, నీ తల వేయి వ్రక్కలవుతుంది", అని హెచ్చరించాడు. దానికి విక్రమార్కుడు చిన్నగా నవ్వి , "బేతాళా ! ముందు మీ ప్రశ్నని అడగండి" అన్నాడు. ' విక్రమార్కా, మహోధృతంగా భూమికి దుమికిన ఆకాశగంగను భూమి తట్టుకోలేదని , పరమ శివుఁడు, తన జటాజటంలో బంధించి , గంగాధరుడయ్యాడు కదా ! మన పండిత పామరులు కూడా ఆ విధంగా గంగాదేవిని ఆయనకు భార్యను మరియు మహాదేవికి సవతని చేశారు కదా! మరి అదే పండితులు మహాభారత కాలమానంలో గంగాదేవిని శాంతన మహారాజు భార్యని చేసి , ఆయన ద్వారా అష్ట వసువులకు తల్లిని కూడా చేశారు ! ఆ వసువులలో చివరివాడే భీష్ముడని కూడా మీకు తెలుసు కదా! అంతటి మహాదేవుని సఖిని ఒక మానవ మాత్రునికి భార్యనెలా చేశారు ఈ పండిత పామరులు? సమాధానం తెలిసీ చెప్పక పోయావో నీ తల వేయి వ్రక్కలగుగాక " అని తన బేతాళ ప్రశ్నను విక్రమార్కుని ముందుంచాడు. తరువాత విక్రమార్కుడేమయ్యాడో భేతాళుడిమయ్యాడో నాకు తెలీదు . ఈ ప్రశ్న నన్ను భేతాళ ప్రశ్నలా చితికి పోయిన నా చిన్న మెదడుని చిన్న నాటి నుండీ వెంటాడుతూనే వుంది.