ఖదీర్ బాబు గారి ‘గేట్’!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
‘గేట్’ ఖదీర్ బాబు గారి రచన. ‘ గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయితగా మనల్ని అలరిస్తున్న శ్రీ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా కావలి లో జన్మించారు. బి.ఎస్. సీ కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రులు. పత్రికా రంగంలో, సినీ రంగంలో తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. . వారు రాసిన పుస్తకాలలో కొన్ని ‘ దర్గామిట్ట కథలు ‘ , ‘ న్యూ బాంబే టైలర్స్ ‘ , ‘ పోలేరమ్మ బండ కథలు’ , ‘ కథలు ఇలా కూడా రాస్తారు’.వీరు రాసిన ‘ న్యూ బాంబే టైలర్స్’ ప్రతిష్టాత్మకమైన ‘కథ’ అవార్డు ను గెలుచుకోవడమే కాక, నాటకంగా రూపాంతరం చెంది అనేక ప్రశంసలందుకుంది.కృతజ్ఞతలు ఖదీర్ గారూ హర్షణీయం ద్వారా ఈ కథను పరిచయం చెయ్యడానికి అనుమతినిచ్చినందుకు.గేట్ :గొణుక్కుంటున్నారు ఇద్దరూ.‘లాగండి’ అంటోంది.లాగితే రావడం లేదు. మూడు మెట్లు ఎక్కితే ఉంది గేటు. పైన చిలుకు తీసి ముందుకు లాగుతుంటే కదలడం లేదు. ఇద్దరు పిల్లలూ ఊరికే చూస్తున్నారు. టక్ చేసి ఉన్న అతడు బెల్ట్ సర్దుకుంటూ మళ్లీ లాగాడు.‘రావడం లేదు’ అన్నాడు.అలికిడి లోపలి వరకూ వినిపించినట్టుంది…‘ఎవరూ’ అంటూ వచ్చి అవతలి నుంచే మునిగాళ్ళు ఎత్తి గేటు బయటకు చూస్తూ ‘ఏంటి.. ఏంటి… నిజమే.. సుదా.. నువ్వేనా’ అందామె అతణ్ణి చూస్తూ.‘గేటు ఇంటి వైపుకు నెట్టాలి. వీధి వైపుకు కాదు. ఏం మారలేదు నువ్వు’ అంటూ ఇంటి వైపుకు లాగింది.గేటు తెరుచుకుంది. కిరకిరమని కఠినమైన శబ్దం చేసింది.‘గ్రీజు పూయాలి దీనికి. ఎప్పట్నించో. అలాగే పోతా ఉంది. ఓహో… అమ్మాయి వచ్చిందా… అరెరె… ఈ చిన్న మినిస్టర్లు ఎవరమ్మా’ అంటూ పిల్లల్ని జవురుకుంది. మొదటిసారి చూస్తున్న పిల్లలు. బెదరలేదు. అలాగని సంబర పడలేదు. కొత్త చేసి చూస్తున్నారు.‘ఇదిగో.. ఎవరొచ్చారో చూశారా’ పెద్దగానే అరిచింది.‘అచ్చు సినిమాల్లోలాగే చేస్తున్నావు అమ్మీ’ అన్నాడు నవ్వుతూ.‘ఓహో.. అమ్మీ అనే అన్నావు. టీచార్ అంటావేమో అనుకున్నా చాకు దీర్ఘం పెట్టి’ అని పిల్లల వీపు మీద ఇంకా గట్టిగా చేతులు అదిమింది.గేటు నుంచి ఇంటి వరకూ నాప పలకలు పరిచి ఉన్నాయి. ఎండ వాటి మీద పడి మెరుస్తూ ఉంది. నీడల్ని బట్టి పన్నెండు లోపే అయి ఉండవచ్చు టైము. పదిహేను ఇరవై నాప పలకలు పరిచేంత ముంగిలి ఉంది. తర్వాత గడప.హాలులోనే ఉన్నాడు సారు. వైరు మంచం మీద కూచుని. ఒక కాలు కిందకు జార్చి. ఒడి మొత్తం కప్పేలా టర్కీ టవల్ పరుచుకుని. ‘ఏమిటీ పిడుగు… సుదా’ అన్నాడు. తెల్లటి గడ్డంలోని లేత బూడిదరంగు పెదాలు విడివడి ఎప్పటిలాగే తెల్లటి పలువరుస మెరిసింది. చుబుకం నుంచి కంఠానికి రెండు తాళ్లు కట్టినట్టు ఉంటుంది చర్మం. ఆ తాళ్లు ఊగాయి నవ్వుకు.అతడు వొంగి ఆయన కాలుకు నమస్కారం పెట్టాడు. కళ్లు ఉబికాయి. ఆమె కూడా ఒంగి నమస్కారం పెట్టింది.‘ఏమిట్రా సుదా.. ఊ’ అన్నాడు సారు.‘పిల్లలు… మినీ.. బూ… ఇట్రండి. తాతకు నమస్కారం పెట్టండి’పెద్దది– తొమ్మిదేళ్లు ఉంటాయి… దళసరి కళ్లద్దాలు… రెండు చేతులు జోడించి పెట్టింది. చిన్నాడు– ఆరుంటాయి– వంకర్లు తిరిగాడు. సారు టవల్ అంచు తీసుకుని కళ్లు వొత్తుకుని, ఏమి ఇద్దునా అని చొక్కా జేబు తడుముకున్నాడు. ఇంకు పెన్ను ఉంది. దానిని తీసి, ఆగి, భార్య వైపు చూస్తూ ‘ఇంకో పెన్ను ఏదైనా ఉంటే చూడు. చెరొకటి ఇవ్వకపోతే అదొక గలభా’ అన్నాడు.‘ఇప్పుడు మీ పాతకాలపు పెన్నులే వీళ్లక్కావాల్సింది. రూములో టీవీ ముందు కూచోబెట్టి బూస్టేదైనా ఇస్తాగాని… మీరు మాట్లాడుకోండి’ అందామె నవ్వుతూ.‘అహ్మద్‌కు ఫోన్ చేసి నాటు తెమ్మను. ఫారమ్ తెస్తే పడతాయ్ అని చెప్పు. కుర్మా చేసి వేపుడు కూడా చెయ్. గుడ్లు ఉడకెయ్’… పిల్లల్ని వెంటబెట్టుకు వెళుతుంటే గట్టిగా చెప్పాడు.‘ఇప్పుడవన్నీ ఎందుకు మావయ్యా’ అందామె.‘నువ్వూర్కోమ్మా. ఇప్పటికి తీరి వచ్చారు. ఏరా… తినే దాకా ఉండవా? పరిగెత్తి పోతావా? ఇన్నాళ్లూ పరిగెత్తి పోయావుగా’ అన్నాడు సారు.అతడు మాట్లాడలేదు. గతంలో మల్లే స్టూడెంట్ మొహం పెట్టాడు.‘కూచో’ అన్నాడు సారు. ఆమె కూడా ప్లాస్టిక్ కుర్చీలో కూచుని హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి మడిచి ఉన్న పాలిథిన్ కవర్ తీసింది. అందులో సాధారణంగా అమెరికా నుంచి వచ్చేవాళ్లు తెచ్చే చాక్లెట్లు, ఏవో చిన్న చిన్న కానుకలు ఉన్నట్టున్నాయి. ఇద్దునా అన్నట్టు భర్త వైపు చూసింది. ఇప్పుడు కాదు అన్నట్టు వారించాడు.సారు అదంతా పట్టక శిష్యుణ్ణే చూస్తున్నాడు.‘ఏమ్మా… వీడు బాగానే ఉంటున్నాడా నీతో. చెప్పు. గల్తీ గిల్తీ ఉంటే బయట ఎండలో రెండు రౌండ్లు ఫ్రంట్ రోల్ చేయిస్తా’ అన్నాడు.భర్త వైపు చూసి సారు వైపు చూస్తూ ‘మీ స్టూడెంట్ కదా మావయ్య’ అంది.‘ఏరా… డేగిశా సుమారుగా పెంచావు. అమ్మాయి చేత రోజూ రెండేసి ప్లేట్ల టిఫిన్ పెట్టించుకుని తింటున్నావా’… నవ్వాడు.ఆ మాటకు అతడు నవ్వాడు. దాని అర్థం ఆమెకు తెలుసులా ఉంది… ఆమె కూడా నవ్వింది.హైస్కూల్లో చేరినప్పుడు...