'పేరులోనేమున్నది' - హర్ష

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

"రేయ్! గిరి బావా! నువ్వూ, మీ తమ్ముడు వంశీ గాడు దేవళం దగ్గరకు రండిరా, ఆడుకుందాం" అని కేక వేశా నేను.మా బ్యాచ్ లో ఏ రోజు ఏ ఆట ఆడాలో డిసైడ్ చేసేది వాడే. ఒక్కో రోజు గుడ్లు ఆట లేక గోళీలాట, లేక బొంగరాలాట, లేక కుందుడు గుమ్మ, పల్లంచి ఇవన్నీ కుదరక పోతే ఒక గదికి అంతా దుప్పట్లు కట్టేసి చీకటి చేసేసి బూతద్దం ఉపయోగించి ఫిలిం గోడమీద ఫోకస్ చేసి చూడటం. ఈ ఆటలకి పిల్లకాయల్ని తోలుకురావటం, పనిలో పనిగా పెద్దోళ్ల చేత అక్షింతలు వేయించుకోవటం మా ఇద్దరికీ అలవాటే. "ఈ రోజు ఉప్పు ఆట ఆడుకుందాం రా కిరణు! నేను రఘు గాడిని వాడి తమ్ముడు రమేష్ గాడిని పిల్చుకొస్తా! నువ్వెళ్లి మురళి, సుధీర్, మధు, శీనడి ని కేకేసుకు రా" అని ఉత్సాహపడిపోయాడు వాడు. నేను లగెత్తా. ముందు మురళిని వాడి తమ్ముడి సుధీర్ గాడి ని దేవళం దగ్గరకు తరిమి, మధూ, శీనళ్ల ను పిలచక రావడానికి వాళ్ళింటికి దౌడు తీశా !వాళ్ళింటి ముందు ఆగి, గస తీర్చుకుంటూ, "ఒరేయ్! శీనా! ఇంట్లో ఉండావా" అని కేకేశా!. మధు గాడు బయటకి వచ్చాడు. నాకు విషయం అర్థమయ్యింది. "ఒరేయ్! మధూ, ఉప్పాట ఆడుకుందాం బయటకురారా!" అని ఇంట్లోకి చూస్తూ మళ్ళీ గట్టిగా అరిచా. వస్తున్నా! వస్తున్నా! అంటూ శీనడు బయటకొచ్చాడు. "వీళ్ళ పాసుగూల! వీళ్ళతో మాకు ఈ రోజు గూడా సావు తప్పదు" అనుకుంటా తోలుకు పోయా వాళ్ళని. ఆటకి కావల్సిన పదిమంది పిల్లకాయలు పోగవ్వటం తో, ఆట మొదలు పెట్టాము. ఆటలో భాగం గా ఒరేయ్ మధు, లగెత్తరా! అంటే శీనడు పరుగెత్తటం, ఒరేయ్ శీనా, ఉప్పు అందుకోరా, అంటే మధూ గాడు దిక్కులు చూడటం జరగిపోతున్నాయి. మా వాళ్ళందరూ, చూశారు, చూశారు, యిక తట్టుకోలేక, అంబాలీస్ అని అరిచారు. ఆట ఆగిపోయింది. నా మీదకి యుద్ధానికి వచ్చారు, "ఒరేయ్! కిరణ్ గా, ఈ రోజు వాళ్ళింటికెళ్లి శీనా అంటే ఎవరొచ్చార్రా! మధు గాడేనా, ఆ సంగతి మాకు ఎందుకు చెప్పలేదురా" అని. నాకు ఉక్రోషం ఎక్కువయ్యింది. ఏమైనా ఈ కన్ఫ్యూషన్ కి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టెయ్యాలిరా, ఈ సంగతేందో వాళ్ళ అమ్మతోనే తేల్చేద్దామ్ అని పిల్లకాయల్ని కూడగట్టి వాళ్ళింటికి తీసుకెళ్లా. ఎంత వేగం గా అక్కడికి వెళ్ళామో, అక్కడ జరిగేది చూసేసరికి మేము అంతే వేగం గా బిక్క చచ్చిపోయాము. మధూ, శీనయ్య వాళ్ళ అమ్మ అయిన జయక్క మరియు మురళి, సుధీర్ వాళ్ళ అమ్మ అయినా సరోజనక్క హోరా హోరీ గా పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ చేలో ఉమ్మడి గెనం (కట్ట) మీద గడ్డి ఎవరు కోశారు అనే విషయం మీద. మాకర్థమయిపోయింది ఇది ఇప్పట్లో తేలే విషయం కాదు అని. అయినా వీళ్ళ మొగుళ్ళు అన్నతమ్ముళ్లే కదా, ఈ తోడికోడళ్లు ఎందుకు రోజూ ఎదో విషయం మీద ఇలా పోట్లాడుతూనే వుంటారో మా చిన్న బుర్రలు అర్థమయ్యేది కాదు. ఇక చేసేది ఏమీ లేక ఈసురో మంటూ ఎవరి ఇళ్ల దారి వాళ్ళం పట్టాము ఆ రోజుటి. మా ఆటలకి వాళ్ళు ఇద్దరూ కావాలి. వాళ్ళు వస్తే అంతా కన్ఫ్యూషన్. కన్ఫ్యూషన్ తెలుసుకోవడానికి వాళ్ళ అమ్మలు మాకు సందు ఇవ్వటం లేదు. ఒకరోజు గడ్డి మీద ఇంకో రోజు ఇక్కడ కోడి అక్కడ గుడ్డు పెడితే గుడ్డు మాయం అయ్యిందనో లేక ఒకరి పసరం ఇంకొకరి చేలో పడి మేసేసిందనో మాకు సందు ఇవ్వకూడదని వాళ్ళ మానాన వాళ్ళు బిజీ గా ఉంటుంన్నారు. మా ప్రాబ్లెమ్ వినాయకుడి పెళ్లి లా మారిపోయింది. ఇలా జరుగుతుండగా, ఒకరోజు మా మధు గాడు అలియాస్ శీను గాడు (ఆ రోజు వాడి పేరు శీనయ్య), వాళ్ళ అమ్మ ని మా మూలకడ దగ్గర బస్సు ఎక్కిచ్చి వస్తూ కనపడ్డాడు. "ఏరా! ఎక్కడికిరా" మీ అమ్మ వెళ్తుంది అంటే, "అల్లూరికి! మా అమ్మమ్మ కి బాగా లేదు. నాలుగు రోజులుండి వస్తుందట" అని చెప్పాడు వాడు. "అరే! ఎలాగ రా ఈ నాలుగు రోజులు మీ అమ్మా పెద్దమ్మ ల తగవులుండవు. మనకి కాలక్షేపం వుండదే" అంటూ వాడు కోపం గా చూడటం తో ఆగిపోయా. ఆ మాట సరదాకి అన్నా, మాకు ఆ నాలుగురోజుల కాలక్షేపం నిజం గానే కరువు అయ్యి తెగ విసుగొచ్చేసింది. ఎలాగో ఒకలా గా ఆ నాలుగు రోజులు గడిపేశాము. అలా కాలక్షేపం లేకుండా నిస్సారం గా రోజులు గడవకుండా వున్న మాకు మా జయక్క రాక ఒక్కా సారి తెలిసిపోయింది, దిగటము దిగటమే మా సరోజనక్కతో, వాళ్ళింటి మునక్కాయలు ఆమె లేనప్పుడు ఎందుకు మాయం అయ్యాయి అనే సాకు మీద. ఇక మాకు పండగే పండగ. నాలుగైదు రోజుల తర్వాత ఆ సందడి కి మరలా బ్రేక్ పడింది ఈ సారి సరోజనక్క ఊరెళ్ళటం తో. మా అమ్మనడిగా నేను, " సరోజినక్క ఎక్కడికెళ్లిందమ్మా! అని. "అల్లూరుకి...