మరవ కూడని వారు!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
నేను మన సూరి కథ రాశాక, ఇప్పుడల్లా అనారోగ్యాల మీద రాయకూడదు అని అనుకున్నా, కానీ ఆ నియమం వెంటనే పక్కన పెట్టి ఈ కథ రాస్తున్నా. ఎందుకు రాశానో ఈ కథ చివరలో రెండు మాటలుగా చెప్పాలనుకున్నా. నేను 2012 న ఉద్యోగ నిమిత్తం చెన్నై నుండి హైద్రాబాదుకు బదిలీ అయ్యాను. ఇంకా విద్యాసంవత్సరం పూర్తి కాకపోవటంతో కుటుంబం చెన్నై లోనే ఉండిపోయింది. నా మకాం మా అన్న దగ్గర. ఏవో సెలవులు ఉండటంతో సుప్రియ, పిల్లలు మరియు అమ్మ కూడా హైదరాబాద్ వచ్చి వున్నారు. ఒక శనివారం ఉదయం లేచి, మా అన్నా వాళ్ళ బాల్కనీలో వేప చెట్టు నీడలో కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా, అమ్మ నాకు తేనీరు ఇచ్చి, నన్ను ఒక్కసారి డాక్టర్ కి చూపించరా అని అడిగారు. నాకైతే ఒక్కసారి చాలా సిగ్గుగా అనిపించింది, ఎంత నలతగా వున్నా, డాక్టర్ దగ్గరకి ఎంతో బలవంతం చేస్తే కానీ రాని అమ్మ, తనకై తాను వచ్చి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళరా అని అడిగేదాకా నేను స్పృహలో లేనా అని. తాను కొంత కాలం నుండి మతిమరుపుతో బాధపడుతూ వున్నారు. ఉదాహరణకు అందరం భోజనాలకు కూర్చున్నాక, తనకు పెరుగు కావాలంటే, నాకు అది అందించరా అనే వారు, అది అంటే ఏమిటి దానికి పేరు లేదా అంటే, ఎంతో ఆలోచించి మరలా అది ఇవ్వరా అనే వారు పెరుగు చూపిస్తూ, పెరుగు పేరు స్ఫురించక. అలా తాను మనుషులు మరియు వస్తువుల పేరుల కోసం తడుముకోవటమా చాలా ఎక్కువగా జరిగేది అప్పట్లో. మా అమ్మకి మొదటి నుండి జ్ఞాపశక్తి అమోఘం. అప్పటికప్పుడు కనీసం ఒక శత పద్యాలు చెప్పగలరు, వేమన, భాస్కర, సుమతి శతకాలు నుండి మరియు భర్తృహరి సుభాషితాలు, చాటువులు మొదలగు వాటినుండి. తెలుగు పదహేళిలు, పద వినోదాలు పూర్తి చేయాలంటే నేను మా అమ్మ సహాయం తీసుకోవాల్సిందే. నేను ఎప్పటికప్పుడు నా కథలలో మా అనీల్గాడి ప్రసక్తి తీసుకు రాకూడదు అని అనుకున్నా వాడు నాకు తెలియకుండానే వచ్చేస్తుంటాడు. వెంటనే వాడికి చేశా, ఇలా ఉందిరా అమ్మకి, ఒక మంచి డాక్టర్ పేరు చెప్పు, నేను వెంటనే తీసుకెళ్లాలి అని. వాడు పదినిమిషాలు అయ్యాక చెప్పాడు, అమిత్ అని మా ఇంటి దగ్గర ఒక యూ.కే నుండి తిరుగు ముఖం పట్టిన డాక్టర్ వున్నాడు, చాలా మంచి డాక్టర్, వెళ్లి చూపించు అని. ప్రస్తుతం అదే డాక్టర్ మా వాడికి చాలా చెడ్డ అయి యున్నాడు అది వేరే విషయం. మా వాడికి ఏదొచ్చినా పట్టలేమని మీకిప్పటికే అర్థమయ్యుండాలి. సరే అని మా అమ్మని, వాడు చెప్పిన అప్పటి చాలా మంచి డాక్టర్ అయిన అమిత్ దగ్గరకు హుటా హుటిన తీసుకెళ్లిపోయాను. ఆయన బి.పి వగైరాలు చూసి, ఆవిడ రిఫ్లెక్స్ లు టెస్ట్ చేసి, పలు ప్రశ్నలు సంధించి, ఇదంతా వయసుతో వచ్చిన మతిమరుపు అని తేల్చేసి, కొన్ని ఆయన పెట్టిన షాపులోనే దొరికే మందులు రాసి, ఎందుకైనా మంచిదని సి.టి స్కాన్ చేయించమని చెప్పి, అది కూకట్పల్లి లోని భద్రం డయాగ్నోస్టిక్స్ లోనే చేయించమని పదే పదే చెప్పి పంపాడు. అబ్బా ఈరోజు చాలా కష్టపడ్డావురా, ఇప్పటికి ఇంటికెళ్లి నువ్వు రెస్ట్ తీసుకున్నాక రేపు స్కాన్ తీయించుకకుందామని మా అమ్మ స్కాన్ ని ఎగ్గొట్టాలని చూసినా, నేను వినకుండా నేరుగా భద్రానికి తీసుకెళ్లిపోయా మా అమ్మని. స్కాన్ ఫలితం వెంటనే ఇచ్చేసారు. ఫ్రంటల్ టెంపోరల్ రీజియన్ లో ఓ కార్క్ బాల్ సైజు లో ట్యూమర్ కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఆ స్కాన్లో. అటు పిమ్మట తనని కలిసిన మాతో చెప్పారు అమిత్, సర్జరీ వెంటనే చేయించమని, ఎస్.ఆర్ నగర్ లో ఒక న్యూరోసర్జన్ కి కూడా రెఫర్ చేసేశాడు. అప్పుడు మొదలయ్యింది మా అసలు కష్టమైన సంధికాలం. అభిప్రాయం, రెండవ అభిప్రాయం, రెండవ అభిప్రాయం మీద మరల అభిప్రాయాల పేరున ఎక్కని హాస్పిటల్ గుమ్మం లేదు. ఇక్కడ వింత ఏమిటంటే కొందరు డాక్టర్స్, అడ్మిట్ కానిదే అభిప్రాయం కూడా చెప్పము అనటం. మెడ్విన్ లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్ మరునాడే అని చెప్పటం తో మేము సన్నిద్ధంగా లేము అని, మా రిస్క్ మీదే డిశ్చార్జ్ అవుతున్నామని రాసిచ్చి మరీ పారిపోయి వచ్చాము కూడా. యశోదలో పని చేసే ఇద్దరు డాక్టర్ దంపతులు మా స్నేహితుడైన నరేంద్రుడి అపార్ట్మెంట్ నివాసులవ్వటంతో,