రామేశ్వరం కాకులు: కథ - ప్రతిస్పందన.
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
ఈ కథ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘ రామేశ్వరం కాకులు’ పుస్తకం లోనిది.పుస్తకం కొనాలంటే – https://amzn.to/3rDN1YMరామేశ్వరం కాకులు :వెనకవైపు రెండు వేపచెట్లు పెరడంతా నీడ పెడతాయి. ఆ రెండు చెట్లనీడలో వానల్లో, ఎండల్లో, చలిలో క్షేమంగా ఉంటుంది పోలీసు స్టేషను. పెరటిగోడ పక్కభాగంలో లోపలికి రావడానికి చిన్న గేటుంది. సామాన్యంగా తెరవరు. వేపనీడలో ఒకవైపు రెండు స్నానాల గదులూ, ఒక పాయఖానా, వీటికి దూరంగా నాలుగు నీలం ప్లాస్టిక్ కుర్చీలు పడుంటాయి. స్టేషనుకి వెనక వరండా ఉంది. వరండాలో అనేకమంది నేరస్థులు, అమాయకులు, అనుమానితులు కూర్చుని కూర్చుని నున్న బరిచిన రెండు పొడవాటి బెంచీలుంటాయి. రెండుకాళ్లూ ఎదుట కుర్చీలో పడేసి, టీ తాగిన కప్పు పక్కకుర్చీలో పెట్టి, తీరిగ్గా సిగరెట్టు వెలిగించి, పొగ వదులుతూ, కానిస్టేబులు వేపు చూశాడు రెడ్డి. దరిదాపు ఒంటిగంటవుతోంది – వేప కింద మంచం వేసుకుని హాయిగా పడుకోవాలనుంది అతనికి.“ఊ. ముండలకి అన్నం పెట్టారా?” కానిస్టేబులు నవ్వాడు. “తిన్నారు సార్. బేబీ వచ్చి డబ్బులిచ్చింది.”“ఎలాగైనా వాళ్లని బానే చూసుకుంటారా మీరు.” ఎస్సైగారి మాటలకి మళ్లీ నవ్వాడు పీసీ.“ఎంతమందీళ్లు.” “నలుగురు సార్. ముగ్గురు పాతోళ్లే. నాలుగోది ఈడది కాదు సార్.” “అవునే, ఈళ్లకి మన్లాగే ట్రాన్స్ ఫర్లుంటాయి గదా!” మళ్లీ నవ్వేడు పీసీ.“దాని గుంటూరు యాసండి. అదేదో పల్లెటూరు సార్. మాణ్నెల్లయిందంట దీనికాడికొచ్చి. ఇంటర్ చదివిందంట సార్.”“ఆ. ఉష్ణోగాలు జేసే వోళ్లీ సెల్ ఫోన్లు అడ్డుపెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. నే వైజాగులో మెడిసిన్ చదివే అమ్మాయిల్ని పట్టుకున్నాను. అంటే డబ్బు కోసం కాదనుకో. ఈ డ్రగ్స్ ఉంటయి గదా, వాటికి అలవాటుపడి.”కాసేపాగి పీసీ వెళ్లిపోయాడు. రెడ్డి భోజనం చేసి వచ్చాడేమో చల్లటి వేపగాలికి కునుకు తీయాలనుంది. తల వెనక్కి వాల్చి కళ్లు మూసుకున్నాడుగానీ ఎందుకో నిద్ర రాలేదు. మరో పది నిమిషాల్లో పీసీ వచ్చి దగ్గ నుంచున్నాడు. కళ్లు తెరిచి చూశాడు రెడ్డి.“తినేత్తందండి. కాళ్లట్టేసుకుంది. మీతో మాటాడాలట సార్. కాళ్లిదలట్లేదు సార్.” ఒక క్షణంపాటు రెడ్డి కేవీ అర్థం కాలేదు.“గుంటూరుదండి సార్. మీతో మాట్లాడాలంట సార్.” ప్లాస్టిక కుర్చీ ఎత్తి విసిరేస్తాడనుకున్నాడు పీసీ. “ఎవత్తిరా అది? రాజకీయాలుగానీ మాటాడుతుందా?”“పద్మ సార్ దాని పేరు.” “సరే, రమ్మను.” తల ఊపి వెళిపోయాడు పీసీ.రెండు నిమిషాల్లో ఆమె వచ్చింది. వరండాలోంచి మెట్లుదిగి రావడం అతను చూస్తూనే ఉన్నాడు. ఆమె అతన్ని అక్కణ్ణించే చూస్తూ నడిచి వచ్చింది.“నీ పేరేంటి?” “పద్మ సార్.”“అసలు పేరు.” “పద్మావతి సార్.” “ఏ ఊరు నీది?” “సత్తెనపల్లి దగ్గర సార్.”“ఇక్కడి కొచ్చి ఎన్నాళ్లయింది!”“మూడు నెలలైంది సార్.”“ఊం పర్సనల్ గా మాటాడాలన్నావంట?” తల ఊపిందామె. రెడ్డి సిగరెట్టు వెలిగించాడు. పద్మ అతనివైపే చూస్తోంది. జుట్టు బిగువుగా వెనక్కిలాగి జడ వేసుకుందామె. రెండు కనుబొమల మధ్య కొంచెం పైన దోసగింజ తిలకం. సన్నటి కాటుక గీత. నీలంరంగు చీర, అదే రంగు జాకెట్టు భుజాల మీంచి కొంగు కప్పుకుని చేతులు కట్టుకు నిల్చుంది. “నన్ను చూడ్డానిగ్గాని వచ్చేవా, మాటాడతావా?” ఆమెవేపుచూస్తూ అన్నాడు రెడ్డి. పద్మ పెదాలు ఒంపు తిరిగాయి. అంతవరకూ ఎస్సైని కన్నార్పకుండా చూస్తున్న ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. దణ్ణం పెడుతూ అందామె.“సార్. నన్ను కోర్టుకి తీసికెళ్లవాకండి సార్. ప్లీజ్.” ,“కోర్టుకి రావా? బావుంది. ఏం కొత్తా? ఆళ్ల మొహాన ఫైను పారేస్తే మళ్లీ మామూలే. ఏం, కోర్టుకి పోలా ఎప్పుడూ?” అడ్డంగా తల ఊపిందామె. “కోర్టుకి పోలేదా, నిజవే?”“నిజవే సార్,” ఆమె కళ్లు తుడుచుకుని చటుక్కున అతని కాళ్లు పట్టుకుంది.“సార్. నాకు బయెం సార్. మీ ఇష్టం ఏదేనా చెయ్యండి. కోర్టుకి పంపమాకండి సార్,” కాళ్ల మీద పడ్డ నీలంకుప్పలా ఉందామె. ఏడుపుతో ఆమె భుజాలు ఎగిరిపడు తున్నాయి.రెడ్డికి కాసేపు నోటమాట రాలేదు. “హ్. లెగెహె. ముందు లెగు. లే!” ఓ చేత్తో బలంగా ఆమె భుజం పట్టుకుని లేపేడతను. “ముందు ఆ ఏడుపాపు.” మరో దమ్ములాగి అన్నాడు రెడ్డి. “అంతేనా ఇంకా ఉందా?” ఆమె కళ్లు తుడుచుకుని చేతులు జోడించి నుంచుంది. ఎస్సై రెడ్డి అనేకమంది పద్మల్ని, సావిత్రుల్ని, సుజాతల్నీ చూసాడు. వాళ్ల ముఖాల్లో, పోలికల్లో అతనికి తేడా కనిపించదు. రుమాలో ముఖం తుడుచుకుని...