'ఎండమావుల్లో తిమింగలాల వేట'
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా , నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.కథను మీకందించడానికి సహకరించిన శ్రీమతి రమణ గారికి కృతజ్ఞతలు. ముక్కంటి సీమలో పెద్ద కాటకం వచ్చింది. క్షామ దేవత విలయతాండవంలో జన పదాలన్నీ అల్లల్లాడి పోయినవి. దప్పిక చల్లార్చుకోవడానికి చుక్కనీరు కూడా లభించని అసహాయ స్థితిలో కొంపాగోడూ వదలి దేశం ఎల్లలు దాటిపోతున్న కూలీల గోడు అవర్ణనీయమై పోయింది.రోజూ పత్రికల్లో ఈ వార్తలే అచ్చు కావడం వల్లా మంత్రి వర్గం, అత్యవసర సమావేశంలో కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకొన్నది. మండలానికొక మంత్రి వెళ్లి అప్పటికప్పుడే కరువు నివారణ కార్యక్రమాలను ప్రారంభించాలని ఎన్ని కోట్లనైనా వెచ్చించి ప్రజలను కాపాడి తీరాలని అమాత్యులందరూ కంకణం కట్టు కొన్నారు.మత్స్య శాఖామాత్యులు రాజాసుందర ప్రకాశ గోవర్ధన శతపధిగారు, కనకాచలం జిల్లా పర్యటనకు బయలుదేరారు. మంత్రిగారి పర్యటన కార్యక్రమాన్నంతా స్థానిక పత్రికలు ప్రముఖంగానే ప్రచురించాలనుకొన్నందున ఆ జిల్లా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అవసరమైన ముందు జాగ్రత్తలన్నీ తీసు కొన్నాడు. దిన వార పత్రికల విలేఖరులనే కాక మాసపత్రికల విలేఖరులను కూడా పిలిపించి కనకాచలంలో ప్రెస్సు కాన్ఫరెన్సును యేర్పాటు చేశాడు.ఆరోజు కనకాచలం ట్రావెలర్సు బంగళాలో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో మత్స్యశాఖామాత్యులు రాజా సుందర ప్రకాశ గోవర్థన శతపధి గారనేక కొత్త విషయాలను వెల్లడించారు.డైనమెట్ పత్రిక విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ మత్స్య శాఖామాత్యులు యిలా అన్నారు. –‘మనం సామ్యవాద యుగంలో ఉన్నాము. రుచిలో బేడిసెలే బాగుంటాయి. నీ బుడ్డపక్కెలు బాగుండవనీ భేదాలుంచుకోరాదు. మనకు కొరదైనా ఒకటే కొరమేనైనా ఒకటే. పూజేపను పెంచుతూ మావురాయిని మరచిపోరాదు. మన నేతల వలె పీతలను కూడా సంరక్షించుకోవాలి. జపానులో నేను గమనించాను. వాళ్లు సీఫుడ్ ను బాగా ఉపయోగించుకొంటారు. ఈ కరువులో ప్రతి చెరువులో జెల్ల లనో ఇసుక దొందులనో పెంచుకోకుంటే దేశం దెబ్బతింటుంది,“మన చెరువుల్లో నీళ్లుంటే గదసార్?” మధ్యలో ప్రశ్నించాడు, సౌదామిని విలేఖరి.“ డోన్ట్ డిస్టర్బ్ మి, దటీజ్ అనదర్ ప్రాబ్లం” అంటూ అమాత్యులు సిగరెట్ ముట్టించి –‘యుసీ … ఈ నత్తలున్నాయే వీటిని పుష్కలంగా పెంచాలి. వాటిలో కొవ్వు పదార్థం యెక్కువ. ప్రతి గుంటలోనూ పెంచే వీలుంది. అన్నట్టు మరచాను. నేను ఇండో చైనా వెళ్లినపుడు అక్కడొక మ్యూజి యంలో నాయెత్తు తాబేలును చూశాను. కాదూ కూడదంటే కొంత మసాలా ఎక్కు వవుతుంది. కాని అది బలే రుచిగా కూడా ఉంటుందని నా నాన్ వెజిటేరియన్ ఫ్రండొ కాయన చెప్పాడు. అతడిపుడు చికాగోలో ఉన్నాడనుకోండి. ఇక్కడ చెరువు లెక్కువేగా?’ ప్రశ్నించాడు గౌరవనీయులైన మత్స్య శాఖామాత్యులు.అందరూ కాకున్నా ఇంచుమించు సగం మంది ఎక్కువనే చెప్పారు. కాని జాజిమల్లె పత్రిక కరస్పాండెంటు మాత్రం ‘అర్థం చెరువులకు పైగా కట్టలు తెగిపోయినవే’ అన్నాడు.“ డజన్ట్ మేటర్. ఆ పని మనది కాదనుకోండి. ఇరిగేషన్ మినిస్టర్ చూస్తారు. మన చెరువుల్లోనే కాదు. ప్రతి బావిలోనూ చేపల్ని పెంచాలి. కరువులో చేపల్ని పెంచే కార్యక్రమం క్రింద కనీసం పది కోట్ల రూపాయలసైనా ప్రత్యేకించమని నేను సి.యం. తో గట్టిగా చెప్పాను. కానీ మా ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పుకొంటేగా. చివరికి యాభై లక్ష లిచ్చాడు. కడకు నేను మొండిగా పేచీ పెడితే రెండుకోట్లు చేపలు పట్టే వలల్ని కొనడానికి అలాట్ చేశారు.” “ పెంచకనే పడే పశ్న ఎక్కడుంటుందండీ ?” చిన్నగా నసిగాడు సిగ్నల్ పత్రిక విలేఖరి.“మీ కదే అర్థం కాదు. ఒక్కసారిగా వలల్ని కొంటే, పెంచే చేపలనంతా పదుతూ ఉండవచ్చు. జాలర్లు వీకర్ సెక్షన్ కు చెందిన నాళ్ళు. అసలు మైనారిటీ...