'పేపర్ టైగర్' - ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచన

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు. ముందుగా ఈ కథ గురించి ‘ కథా’ నవీన్ గారు మాట్లాడతారు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి, ముందు మాటనందించిన నవీన్ గారికి కృతజ్ఞతలు. “ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నారు నరసింహం గారు, కిటికీలోంచి బయటికి చూస్తూ. ఆయనకి చాలా చిరాగ్గా వుంది.‘నువ్వు ఇప్పుడిప్పుడే నన్ను వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నట్టు విన్పించింది ‘అబ్బాయ్’కి. అబ్బాయ్ పేరు వరప్రసాదరావు, అతనా గదిలో ఒక సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడనడం కంటే సోఫాని ఆనుకొని ‘గోడ కుర్చీ’ వేసేడనడం సబవు. తను కూర్చుంటే సోఫాకి ఏం నొప్పెడుతుందో, ఏ కుళ్ళు అంటుకుంటే నరసింహంగారు, ఏం చేసేస్తారో అని భయపడుతున్నవాడిలా వున్నాడతను. .ఆ సాయంకాలం అతను నరసింహం గారింటికి వస్తూ వుంటే, అల్లంత దూరంలో వుండగానే టపటపా చినుకులు పడ్డం ఆరంభించాయి. వాళ్ళింటికి వచ్చేసరికి అతని చొక్కా వొంటికి అతుక్కుపోయింది. ఎత్తుగా దువ్విన జాత్తు అణగారిపోయి బుర్రకి అంటుకుపోయింది. నీళ్ళతో కలిపి, నూనె తలమీంచి కారి మొహమంతా జిడ్డులా తయారయింది. నరసింహంగారి ఇంటికి వచ్చాక మెట్లెక్కి, వరండాలో నుంచుని రుమాలుతో – తల తుడుచుకోవాలో, మొహం తుడుచుకోవాలో తేల్చుకోలేక మోచేతులు తుడుచుకుంటూ కాలింగ్ బెల్ నొక్కేడతను.ఆ సమయంలో నరసింహం గారొక్కరే ఇంట్లో వున్నాడు. ఆయన కొడుకూ, కోడలూ, మనవలూ అంతా ఏదో పార్టీకి వెళ్ళేరు. –కాలింగ్ బెల్ విని ఆయనే తలుపు తీసేడు. తలుపు తియ్యగానే – చామనచాయవాడు, జిడ్డుమోమువాడు, రెండుపదుల వయసువాడు, బక్క పలుచనివాడు – వర ప్రసాదుడు కనిపించాడు. అతని రూపురేఖా విలాసాలు చూసేక, లోపలకు రమ్మనాలో, బైటవుంచి ‘ఏవరికోసవని’ అడగాలో తేల్చుకోలేక డోర్ నాబ్ పట్టుకొని ఒక్క క్షణం ఆలా నిల్చుండిపోయేడాయన..నరసింహంగారిని చూడగానే వరప్రసాదరావు నోరు పెగల్లేదు. పెద్దపులిని చూచినట్టు ఒక్కసారి జడుసుకున్నాడు. కనిపించగానే వినయంగా నమస్కారం చెయ్యమని మరీ మరి చెప్పి పంపించిన తాతగారి మాటే మర్చిపోయేడు. నరసింహంగారి మొహం చూసూనే ఎందుకోగాని గాభరాపడిపోయేడా కుర్రవాడు.నరసింహంగారికి ముఖంలో రంగులు మార్చడంలో ఒక ప్రాక్టీసు వుంది. ఆయన తన చిన్న మనవడితో ఆడుకుంటున్నప్పుడు ఎంతగా బోసి నవ్వులు చిందిస్తాడో, అదే సమయంలో పని కుర్రాడితో మాట్లాడవలసొస్తే అంత కటువుగానూ వుండగలడు. పూర్వంకూడా తన క్లయింట్లతోనూ, జడీలతోనూ ఎంత మృదు మధురంగా మాట్లాడేవాడో తమ వూళ్ళో రైతులతోటి, కూలీలతోటీ అంత కర్కశంగా మాట్లాడేవాడాయన. ఎవరెనా కొత్తవాళ్ళను చూసీ చూడ్డంతోపే, విధిగా ఆయన ముఖంలో రంగులు మారతాయి. అవతలవాణ్ణి చూస్తూనే ఒక అంచనా వేసుకొంటాడు. దాంతో ముఖం ప్రసన్నంగా పెట్టడం ‘గంభీరంగా పెట్టడవా’ ‘ప్రసన్న గంభీరంగా పెట్టడవాఁ’ అన్నది తేల్చుకొంటాడు.కాని వరప్రసాదరావుని చూసి ఎలా ముఖం పెట్టాలో ఆయనకి వెంటనే తెలియక తటపటాయించాడు.ఇంతలో ఆ కుర్రవాడు జేబులోంచి ఓ వుత్తరం తీసి ఇచ్చేడు. అది చూస్తూనే, అయోమయపు రంగులోంచి కొంచెం ప్రసన్నపు రంగులోకి మొహాన్ని మార్చుకొన్నాడు నరసింహంగారు.“రా లోపలికి” అన్నాడాయన.తను వచ్చిన పని సగం అయిపోయినట్టేననిపించి, చిన్న పొంగు పొంగిపోయేడు. వరప్రసాదరావు,కాని,వెంటనే నరసింహంగారు జోళ్ళు ………. అంటూ అర్థాంతరంగా ఆగిపోవడంతో ఒక్కసారి కుంగిపోయాడా అబ్బాయి.ఆ కుర్రవాడి జోళ్ళు చిరు బురదతో వున్నాయి. “ఆయన చెప్పబట్టి సరిపోయింది కాని, అమ్మబాబోయ్! ఆ జోళ్ళతో లోపలికి వచ్చేస్తే ఇంకేదన్నా వుందా?” అనుకొని మనసులోనే ఫెడీ ఫెడీమని లెంపలు వాయించేసుకొన్నాడు వరప్రసాద రావు.జోళ్ళు బైటే వదిలి, లోపలికి వచ్చి సోఫాముందు ‘గోడ కుర్చీ’ వేసేడా కుర్రవాడు. “సరిగా కూర్చో పరవాలేదు’ అందామని నోటిదాకా వచ్చింది కాని మరెంచేతో నరసింహం గారు అనలేదు.ఆ కుర్రవాడి తాతగారూ, నరసింహం గారూ, చిన్నప్పుడు క్లాసుమేట్సు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ – ‘చదువు లేకపోతే మన బతుక్కి మరో దారీ తెన్నూ లేదు. చదువుకోకపోతే మట్టి కొట్టుకు పోతాం సుమా – అనుకొని కష్టపడి చదువుకొన్న వాళ్లే కానీ , పెద్దలు చెప్పినట్టు రోజులు అందరికీ ఒక్కేలా వుండవు కదా!నరసింహంగారికి రోజులు మారేయి. దశ మళ్ళింది. ఆ రోజుల్లో కుర్ర నరసింహాన్ని చూసి – తన బాగుకోసం, అవసరం వస్తే – ‘అమ్మ లేదు, నాన్న లేడు, అన్న, చెలి ఎవరూ లేరు లేరంటే లేరు’ అని ఈ కుర్రవాడు అనుకోగలడని ఎలా పసిగట్టారో గాని, పసిగట్టేరొక పెద్ద ప్లీడరుగారు. అంత చిన్న వయసులోనే ఆ కుర్రవాడికి ‘జ్ఞానోదయం’ కలిగినందుకు తెగ...