'నేతి గారెలు' కథ , కథానేపధ్యం - ఆచార్య కొలకలూరి ఇనాక్
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
హర్షణీయంలో ఈ ఎపిసోడ్లో మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘నేతి గారెలు ’. ఇది వారి ‘మనూళ్ళల్లో మా కథలు ’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది.ఈ ఎపిసోడ్లో ప్రత్యేకత, ఆడియో చివరన కథా నేపధ్యాన్ని ఆచార్య ఇనాక్ గారు స్వయంగా మనకు వివరించటం.సంకలనంలోని కథలన్నీ ఆయన బాల్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా, వారు రాసినవి.కథలన్నీ కూడా డెబ్బయి ఏళ్ల క్రిందటి గ్రామీణ జీవితాన్ని వివరిస్తూ, అప్పుడున్న సామాజిక పరిస్థితిని మనకు కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తాయి.తమ రచనను హర్షణీయం ద్వారా అందించడానికి అనుమతినిచ్చినందుకు, కథా నేపధ్యం , హర్షణీయం శ్రోతలకు అందించినందుకు ఆచార్య ఇనాక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.డిసెంబర్ నెలలో వారి ఇంటర్వ్యూ ‘హర్షణీయం’ ద్వారామీరు వినవచ్చు. అప్పుడు మరిన్ని వివరాలు వారి రచనా జీవితాన్ని గురించి తెలుసుకోవచ్చు.‘మన ఊళ్ళల్లో మా కథలు’ కథాసంపుటి ప్రతులకు సంప్రదించండి -జ్యోతి గ్రంథమాల4-282, యన్ యస్ నగర్మీర్ పేట్, హైదరాబాద్ - 500 097.ఫోన్: 94402 43433నేతి గారెలు:మా వూరు వేజండ్ల. అప్పట్లో గుంటూరు తాలూకాలో, ఇప్పుడు చేబ్రోలు మండలంలో ఉంది. మా వూరు రెండు భాగాలు. రైలు కట్టకవతల ఊరు, ఇవతల పల్లె. పల్లె వాళ్ళల్లో కొందరు, ఊరివాళ్ళ ఇళ్ళల్లో జీతగాళ్ళు.గమిని శ్రీరామయ్య గారింట్లో మా నాయన పెద్ద జీతగాడు. పొద్దు పొడవక ముందు ఇల్లొదిలి వెళ్ళేవాడు. పొద్దుమునిగాకే వచ్చేవాడు.నాకప్పుడు ఎనిమిదేళ్ళు, చెల్లెలికి నాలుగు, తమ్ముడికి కొన్ని నెలలు. మా నాయన్ని చూసిన రోజు మాకు పండగ..నేనప్పుడు మాపల్లె బడిలో మూళ్ళోకొచ్చా. తెలుగు వాచకం కొత్త వాసనింకా పోలా. అప్పుడు శ్రీరామయ్యగారి చిన్నజీతగాడు పెదోడై, పెళ్ళె వెళ్ళిపోయేడు. గొడ్డుగాసే బుడ్డో డొకడు, మా దొరగారికి కావలసి వచ్చేడు. 'మీ బుడ్డాణ్ణి మా గొడ్డకాడ బెట్టరా' అని దొరగారు మా నాయనతో అన్నాడు. మా నాయన 'సరే' నన్నాడుమన పెద్దోణ్ణి దొరగారి గొడ్డ గాయటానికి పంపుదా'మన్నాడు మా నాయన మా అమ్మతో.మా అమ్మ వద్దంది. 'సదూకోనీయ్' అని అంది. అట్టా కాదన్నాడు మా నాయన. మా అమ్మ 'అదిగాదు' అంది. మా నాయన మొండికి తిరిగాడు. మా అమ్మ తండుకేసి కూసుంది. 'నా మాటపోద్ది” అన్నాడు మా నాయన. “ఆడి సదూ సెడుద్ది” అంది మా అమ్మ. ఆళ్ళూ ఈళ్ళూ పోగయ్యారు, సర్దుబాటు చేశారు.ఎప్పటికయినా కూలో నాలో చేసుకు బతకాల్సినోళ్ళమేగా. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే సేరనీ' అన్నారు.ఆడగూతురు, అమ్మ ఏం జేసుద్ది? పెనిమిటిని కాదంటదా? అన్నలమాట పెడచెవిని పెడతదా? ఏడుస్తూ కళ్ళు తుడుసుకొంది.నన్ను పొద్దున్నే నిద్రలేసి, రెక్క పట్టుకొని లాక్కెళ్ళేడు మా నాయన ఊళ్ళోకి, దొరగారి సావిట్లోకి, గొడ్లకాడికి. నాకేడుపు ఆగలేదు.సదూకుంటా' నన్నాను. 'ఏడిసేవులే!” అన్నాడు మా నాయన. ఏడుస్తానే ఉన్నాను. పలకా బలపం, తెలుగువాచకం, ఎక్కాల పుస్తకం, సంచీ ఏడుస్తున్నట్టు అనిపించింది.పొదున్నే లేవాలి. ఊళ్ళోకి పోవాలి. గొడ్డకాడి కసువు పేడ వేరువేరుగా తీయాలి. అవన్నీ ఊడవాలి అప్పుడు బూసిమ్మ బువ్వ బెట్టుద్ది. ఆనక గొడ్డు దోలుకు పోవాలి. బూసిమ్మకూ, నాకూ, మంచిమాలిమిఆమె మాట్లాడకుండా బువ్వ పెట్టదు. నేను మాట్లాడకుండా తినకూడదు. బూసిమ్మ అంటే శ్రీరామయ్యగారి భార్య. దొడ్డ ఇల్లాలు. పెట్టు పోతల్లో పెద్దసేయి. ఎముకల్లేని సేయి. ఆమెకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు రాధాకృష్ణయ్య. కమ్యూనిష్టని పెద్ద పేరు. పెళ్ళయింది.రెండో దొర రాఘవయ్య. పెళ్ళీడు కొచ్చేడు. పెద్ద పెడసరపు యవ్వారం. మంచోడే! మూడో ఆయన రాజయ్య. గుంటూరు బళ్ళో సదూలు సదువుతున్నాడని గొప్ప పేరు. ఆ ముగ్గురిలో ఎవురూ గొడ్డు గాయరు. రాజయ్య నాకంటే నాలుగేళ్ళు పెద్దాడు. సదూకొంటున్నాడు. ఉన్నోడుగా, గొడ్డుగాయడు. నేను బడికి పోతున్నా, లేనోణ్ణిగా గొడ్డుగాయాలి. అందుకే జీతానికి కుదిరా.బువ్వకాడ బూసిమ్మకూ, నాకూ ఒకటే తంతు. 'ఎందుకురా మొడ్డుకుమల్లె అట్టా నిలబడ్డా, గిన్నె దెచ్చుకోకా?” అనేది. గిన్నె దెచ్చుకొని కూసుంటే 'నోరు లేదా మూగ సన్నాసీ అడగవేం?” అనేది. 'బూసిమ్మా! బువ్వ బెట్టవమ్మా!” అనేవాణ్ణి. 'ఏందిరా సచ్చినోడా బూతులు దిడతన్నా?' అనేది.శ్రీరామయ్యగారు కలగజేసుకొని 'ఆడేడ బూతులు దిట్టేడు దొరసానీ!' అనేవాడు. 'మరి ఆడా కూత కూయడే?” అనేది.అప్పుడు, 'దొరసానీ! బువ్వబెట్టు' అనేవాణ్ణి. 'ఏందిరా ముదనష్టపోడా ఆ అరుపులు, ఆగలేవా?' అంటూ గిన్నెలో కూడు కుమ్మరించేది. 'తినూ! దిక్కులు జూతావేం?” అని కసిరేది. 'కూరెయ్యవా' అంటే ఎక్కళ్ళేని కూడా, కూరా, కుమ్మూ,నీ ఎదానే కొడతంటిని. ఎందుకెయ్యనూ?” అని ఏసేది. 'ఆవగాయో, ఊరగాయో, పప్పో, రసమో ఏసి ఏం కడుపురా నీది, ఎంత దిన్నా నిండదు. ఏమేసినా వొద్దనవూ' అని...