శ్రీరమణ గారు - బంగారు మురుగు

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

తెలుగు వారికి శ్రీ శ్రీ రమణ గారు కథా రచయిత గా , కాలమిస్ట్ గా , సంపాదకీయులుగా అత్యంత సుపరిచితులు.బంగారు మురుగు - శ్రీ రమణ గారి రచించిన 'మిధునం ' కథా సంకలనం లోనిది.ఒక బామ్మ గారు, మనవణ్ణి తన ప్రాణానికి ప్రాణంలా ఎలా చూసుకుంది? తన తదనంతరం అదే ప్రేమను అందించడానికి, తన బంగారాన్ని, ఇంకో యోగ్యురాలైన వ్యక్తి చేతికి ఎలా అందించిందీ ? అనేదే ఈ కథలో ముఖ్యాంశం.ఇప్పటిదాకా ఆయన కేవలం ఒక పాతిక కథలు మాత్రమే రాసారు. ఈ కథ చదివిన తర్వాత, సుప్రసిద్ధ రచయిత , సాహితీ వేత్త శ్రీ ఆరుద్ర గారు ఏవన్నారంటే , " కడిమి చెట్టు పన్నెండేళ్లకోసారి పూస్తుంది. ఇదిగో ఇప్పుడు శ్రీరమణ పూశాడు. ఆ కురింజి పేరు 'బంగారు మురుగు' "హర్షణీయంలో ఈ విజయదశమి రోజున ప్రసారం అయ్యే శ్రీ శ్రీరమణ గారి ఇంటర్వ్యూలో , ఈ కథ గురించి మరిన్ని వివరాలు మనం తెల్సుకోవచ్చు.ఇంటర్వ్యూ కు , వారి కథలు/వ్యాసాలూ ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ రమణ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఈ పుస్తకం మీరు కొనడానికి, కావాల్సిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో చివర ఇవ్వబడ్డాయి.బంగారు మురుగు:నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్లు.మా అమ్మానాన్న ఎప్పుడూ పూజలూ పునస్కారాలూ, మళ్ళూ దేవుళ్ళూ గొడవల్లో వుండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులూ ఎత్తే పల్లకీ, దింపే పల్లకీలతో మా ఇల్లు మరంలా వుండేది. అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ - నే దగ్గరకు వెళితే దూరం దూరం తాక్కూడదు అనేది.బామ్మకి యీ గొడవలేం పట్టేవి కావు. అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే. ఓకంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం.పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ వేధింపులూ బామ్మ దగ్గర లేవు. ఎవరేనా "ఈ ముసలమ్మకి భయమూ భక్తీ రెండూ లేవు..." అంటే - "దయకంటే పుణ్యంలేదు. నిర్దయకంటే పాపం లేదు. చెట్టుకి చెంబెడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టడం - నాకు తెలిసిందివే "అనేది.బామ్మకి పుట్టింటి వాళ్ళిచ్చిన భూమి నాలుగైదెకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది. మా ఊరికి పది కోసుల దూరం. ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించటానికి రైతులు వచ్చేవాళ్ళు . వచ్చీ రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది. పుట్టిన ఊరు విశేషాలన్నీ గుక్క తిప్పుకోకుండా అడిగేది. వాళ్ళు బదులుచెప్పకుండానే మళ్ళీ ప్రశ్న - ప్రశ్న మీద ప్రశ్న వర్షం కురిపించేది. రైతులేమొ పంట తెగుళ్ళగురించి, అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావలో బేడో చేతిలో పెట్టి వెళ్ళాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకు వచ్చే వాళ్ళు. ఆ మాట ఎత్తడానికి బామ్మ అవకాశం యిస్తేనా ?"ఎండన పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండరా" అనేసి వడ్డన ఏర్పాట్లలో పడిపోయేది. విస్తరి వేసిందగ్గర్నించి పెరుగు అన్నంలోకి వచ్చేదాకా వాళ్ళతో ఊరివాళ్ళ కబుర్లన్నీ వాగించేది.తీరా పెరుగన్నం చివర్లో "ఏరా అబ్బీ, యీ ఏడాది పంటలెలా వున్నాయిరా " అని అడిగేది.వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయేది. కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని, పైగా తిన్న విస్తరి ముందు కూచుని "పంటలు పోయాయి" అని చెప్పడానికి నోరాడక "ఫర్వాదేదమ్మా దేవుడి దయవల్ల" అనేవాళ్ళు. ఇంకేం చేస్తారు పాపం అణా పైసలతో శిస్తు అప్పగించి వెళ్ళేవాళ్లు. వెళ్లేప్పుడు "ఇదిగో బుల్లి పంతులూ! మీ అవ్వ గట్టి పిండమే !" అని ఎగతాళి చేసి వెళ్ళే వాళ్ళు.బడికి వెళ్ళనని మారాం చేసినపుడల్లా బామ్మ నాకు అండగా వుండేది. "పసి వెధవ, గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు- అయినా ఒక్కగానొక్కడు బతకలేక పోతాడా..." అంటూ నన్ను చంకన వేసుకు బయటకు నడిచేది.మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు వుండేది. అది మా స్థావరం. రోజులో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం. బాదంచెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు వుండేది. రాలిన పండు ఆకులు విస్తరి కుట్టుకుని బామ్మ భోజనం చేసేది. దాని చుట్టూ చిన్న మట్టిఅరుగు వుండేది. "దీన్ని కాపరానికొచ్చేప్పుడు మా పుట్టించినించి తెచ్చా... అప్పుడు జానాబెత్తెడుండేది... నువ్ నమ్మవ్... పిచ్చి ముండకి మూడే ఆకులు బుల్లి బుల్లివి వుండేవి..." రోజు ఒకసారైనా ఈ మాట నాకు చెప్పేది. నే కాపరానికొచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చి మొద్దుకి అన్నేళ్లు అంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా.ఇప్పటికీ బామ్మ చెంబెడు నీళ్ళు దానికి పోస్తూనే వుంటుంది. మానుకి రెండు తొర్రలుండేవి. పై తొర్రలో రెండు రామచిలకలు కిలకిలలాడుతూ కాపరం చేస్తుండేవి. ఇంకో తొర్రలో బామ్మ నాకోసం చిరుతిళ్ళు దాచేది. కొమ్మకి తాళ్ల ఉయ్యాల వుండేది. నీడన ఆవుదూడ కట్టేసి వుండేది. దానికి బామ్మ పచ్చి పరకలు వేస్తూ వుండేది. కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నాచేత బాదం పప్పులు తినిపించేది. - ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడూ నీడా - ఊరు...