మన జీవితాల నాయకా నాయకులు! రెండవ భాగం

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

నేను ఇంతవరకూ రాసిన కథల పాత్రల జీవితంలో ఎదో ఒక సంఘర్షణ ఉండేది. అలా సంఘర్షణ వున్న పాత్రల గురుంచి రాస్తేనే ఓ మంచి కథ అవుతుంది అని నమ్మేవాడిని. కానీ ఆర్ధిక పరమైన కొన్ని సంఘర్షణలు తప్ప వ్యక్తిగతమైన సంఘర్షణలు లేకుండా జీవితాన్ని గడిపి, ప్రేమలను మాత్రమే పంచిన మన పెద్దమ్మలు, పెద్ద నాన్నలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు మొదలగు వారి గురించి కూడా రాయాలి. వీళ్లంతా మనమెక్కడో వెతుక్కోవాల్సిన పనిలేకుండా మనపక్కనే వుంటూ వాళ్ళ జీవితాల్ని ఎంతో కొంత మనకు ధారపోసిన నాయకులూ లేక నాయికలు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇందరి సహాయ సహకారాలు, ప్రేమానురాగాల వల్లనే మనం పెద్దవారి మయ్యామన్న స్పృహ కలుగుతుంది. ఇక నేను ఇటువంటి కథలకు విక్రమాదిత్యుడు-బేతాళుడుల కథలకు మల్లె పైన రాసిన వాక్యాలు పరిచయ వాక్యాలుగా వస్తాయి. మా మేనత్తని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది మా నాయనమ్మ. మరలా మా మేనత్త తన కూతురిని తన తమ్ముడు అంటే మా చిన్నాన్న కిచ్చి పెళ్లి చేసింది. అలా మా పిన్నమ్మ మరియు చిన్నాన్నల పెళ్లి రెండవ తరపు మేనరికం. మా పిన్నితో మాకు చాలా మంచి అనుబంధం వుంది. ఆవిడ పని చేయటం లో మహా చురుకు, మాటల్లో మాత్రం మహా నిదానం. మా అమ్మ ముక్కీ మూలిగి ఇంటి వెనక ఉండే చిన్న లోగిలి ఊడ్చే లోపలే మా పిన్ని ముందున్న చాలా పెద్దదైన లోగిలి అంతా చిమ్మేసి, కళ్ళాపి చల్లేసి, ముగ్గులు కూడా పెట్టేసి వచ్చేసేది. మాతో రక రకాల ఆటలు ఆడటం అంటే తనకి చాలా ఇష్టం. చిన్నా చేయి చాపు తాయిలం పెడతా అని, అని నేను చేయి చాపగానే, బతికున్న కప్పనే చేతిలో పెట్టి పారిపోయేది, మా కేకలకు ఎక్కడ మా అమ్మ వచ్చి చీవాట్లు పెడుతుందో అని. అలాగే రబ్బరు బల్లిని అందరూ నడిచే చోట గోడలకి అంటించి అది వాళ్ళు నడిచేటప్పుడు సరిగ్గా వాళ్ళ నెత్తిన పడేలా చేయటం వాళ్ళు భయంతోనో అసహ్యం తోనో కేకలు పెడుతూ దులుపుకుంటుంటే పక పక లాడటం, వాళ్ల మీద బొద్దింకలేయటం లాటి ఆటలతో మా ఇల్లు సందడే సందడి. తాను మమ్మల్ని భయపెట్టడానికి తన కను రెప్పల్ని వెనక్కి ముడుచుకొని, గాలి నోటితో లోపలి పీల్చుకుంటూ బొంగురు గొంతుతో భయపెడితే నాకు దడుపుతో ఆ రాతిరికి జ్వరం కాసేది. దానికి తోడు మా చిన్నాన్న కూడా చాలా సరదా మనిషే. మా ముందు గోళీలను మాయం చేసి మా చెవుల్లోంచి, ముక్కుల్లోంచి తీయటం, మనసులో ఓ అంకెను అనుకొని, దాన్ని రెండుతో పెంచి, ఓ పది కలిపి లాటి కంగాళీ లెక్కలు చేసి మనసులో మేము అనుకున్న అంకెను ఆయన చెప్పటం లాటి సరదా లెక్కలు చేయించటం, మమ్మల్నివీపు మీద ఎక్కించు కొని బావిలో ఈదటం, మా వూరిలో వేసే నాటకాల్లో ఎప్పుడు పంతులు వేషం వేసినా మా చిన్నాన్నే వేశాడు అని మేము ఎప్పటికీ గుర్తుపట్టలేనట్టు మమ్మల్ని మాయ చేయటం, నేను ఒకటి రెండు మూడు అనే లోపల మీరు మంచం దిగుతారు అని పందెం కట్టి మేము పందేనికి ఒప్పుకోగానే, మూడు అని ఎప్పటికీ అనకుండా మమ్మల్ని విసిగించి మేమే దిగేలా చేయటం లాటి పనులతో మా చిన్నాన్న అంటే మేము ప్రాణం ఇచ్చేలా చేసుకున్నాడు ఆయన. అసలు ఆయన మమ్మల్ని ఎప్పుడు సందడిగా, ఉత్సాహం గా ఉంచడానికి చాలా చిట్కాలు, పాటలు మరియు పద్యాలు నేర్చుకున్నాడు అని అనుకుంటే ఆ ఇష్టం ఇంకా ఎక్కువయ్యేది. ఆయన బావిలో మమ్మల్ని వీపునెక్కించుకొని ఈతలు కొట్టే ఆటలకి మా అమ్మ తన అనుమతి ఇచ్చేస్తే మా పిన్ని మాత్రం తన కొడుకుని సంకనేసుకొని తోటలోంచి ఇంటికి పరిగెత్తేసేది వాడిని ఆయనకు దొరకనీయకుండా. వాడు రెండు తరాల మేనరికాల వలన పుట్టటమే కొంచెం బలహీనప్రాణి. వాడంటే మా ఇంటిల్లిపాదికీ గారాభమే. వాడికైతే స్నానం చేయించడం, అన్నం పెట్టడం, కథలు చెప్పడం లాటి అన్నీ పనులకి వాళ్ళ పెద్దమ్మ అంటే మా అమ్మే ఉండాలి. వాడు ఒకరోజు అత్యుత్సాహం తో నన్ను మా దొడ్లో వుండే నీళ్ల తొట్టిలో దించమన్నాడు, నేను ఉత్సాహం గా దించేసా, దిగాక వాడు నాకలివి గాలా, ఎంతకూ రాడు బయటకి, నేను వాడిని నా చేతులతో మునిగిపోకుండా అలాగే పట్టుకొని కేకలు వేస్తూనే వున్నా, ఎప్పటికో మా అమ్మా పిన్ని వాళ్ళు విని పరిగెత్తుకొచ్చారు, ఆ రోజు మా పిన్ని భయపడి ఏడ్చిన విధానం, ఇంక నేను వాడితో ఎప్పటికీ అలాటి ప్రయోగాలు చేయకుండా చేసింది. అలాగే వాడేమన్నా తులిపి పనులు చేసి ఆమె చేతిలో తన్నులు తిని, వాడు ఏడవటం, వాడితో పాటూ ఆమె ఏడవటం, అందరూ తిరిగి ఆమెని తిట్టేవరకు జరిగేది, అంతలా ఏడ్చేదానివి వాడిని కొట్టటం ఎందుకు మొదట అని. మా పిన్ని మా చిన్నప్పుడు తినడానికి వేరుసెనగ ముద్దలో, చలిమిడి ముద్దలో, నువ్వుల చిమ్మిరో చాలా క్రమం తప్పకుండా చేసేది. కానీ ఎప్పుడూ అన్నీ మా దగ్గర పెట్టేది కాదు, చాలా జాగ్రత్తగా దాచి రోజుకొక్కటే ఇచ్చేది. ఏరోజుకారోజు అయిపోయాయి, ఇదే చివరి ముద్ద అని చెప్పేది, ఆమె ఎక్కడ దాచుతుందో అని మేము ఎంత గూఢచర్యం చేసినా