అప్పుడప్పుడూ 'ఉదయించే' మా సుడిగాడు
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
“బాస్, ఏ బ్రాంచ్ నీది”, అడి గాడు రామారావు, నన్ను, నేను మా హాస్టల్ మెస్సు లోకి ఎంటర్ కాంగానే.“ఫౌండ్రి ఇంజనీరింగ్”“అదేంటి బాస్, పోయి పోయి, ఆ బూజు పట్టిన బ్రాంచ్ తీసుకున్నావా?, ఇక్కడ మెకానికల్ వాళ్లకి మెషీన్ టూల్స్ బ్రాంచి అన్నిటికంటే బెస్టు. నేనదే తీసుకున్నా!”నేను ఖరగ్పూర్లో పీజీ చేరిన ఐదు రోజుల్లోనే, నాకీ ఉపదేశం చేసిన పదో కృష్ణుడు – రామారావు.ప్రొడక్షన్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్లల్లో చేరిన ప్రతీ వాడూ నాకెదురైతే చెప్పేవాడు – “ఫౌండ్రి ఇంజనీరింగ్ ఓ బూజు పట్టిన కోర్స్” అని.అసలే నాకు తిక్క తిక్క గా వుంది, మంచి స్కోర్ వచ్చి కూడా ఆప్షన్స్ సరైన క్రమంలో పెట్టకుండా ఫౌండ్రి ఇంజనీరింగ్ లో పడ్డందుకు.ఈలోపల ఓ ఆజానుబాహుడొచ్చి వాడికి వాడే , “మామ, నా పేరు ఉదయ్, కడప దగ్గరున్న కమలాపురం నుంచి వచ్చా, బ్యాచలర్స్ మెకానికల్, ఎస్.వీ.యు లో చదివా, ఇక్కడ ఏరో నాటికల్ లో చేరా”, అంటూ మా టేబుల్ లో పైన కూర్చొని నన్ను పలకరించేసాడు.ఎందుకో వాణ్ని, వాడి వాలకాన్ని, చూస్తే నాలో ఏదో ఒక కొత్త ఉత్సాహం వొచ్చేసింది –రామారావులో మటుకు వీణ్ణి చూస్తే, ఏదో బెరుకు కన్పడతా వుంది.ఎత్తుకున్నాడు ఉదయ్ , రామారావు కళ్ళలోకి చూస్తూ సూటిగా,“ఏరా రామారావ్, అప్పుడే నీ బ్రాంచ్ మహత్తరమైందనిచెప్పి, సావ కొట్టేశావా! ఈ శాల్తీని. మనిషిలో వుండాలిరా మొగతనం, మడిచి ఆ మెషీన్ టూల్స్ ని తీస్కెళ్ళి జేబులో పెట్టుకో ! అంతకంటే ముందు, పప్పో సాంబారో అర్థం కాని ఆ సంకరజాతి సాధకాన్ని, నా ముందుకు నెట్టు” అంటూ రామారావుని తోమి పారేసాడు.ఆ రెండు నిమిషాల “గ్రాండ్ ఇంట్రో” తో ఉదయ్ గాడి తో, పెర్మనెంట్ గా కనెక్ట్ అయిపొయ్యా! నేను.క్యాంపస్ అంతా చెడ తిరిగేవాళ్ళం ఇద్దరం.కనపడ్డ క్లాస్ మేట్ లని, వాళ్ళ పేర్లకి ముందు ఒక బీప్ పదం, వెనక ఒక బీప్ పదం తో వీడు పలకరించడం,వాళ్ళు “వీడితో పెట్టుకోగూడదురా” నాయనా! అంటూ సణుక్కుంటూ పక్కకెళ్లి పోవడం, నాకైతే చాలా నచ్చేసేది.నన్ను కూడా అలాగే బీపులతో పలకరించే వాడుదేశం కానీ దేశంలో, నా పేరుకు ముందు వెనకా, ఆ అచ్చ తెలుగు బీపులు వింటుంటే, ఒళ్ళంతా పులకరించిపొయ్యేది నాకు.ఇది గాక మా ఉదయ్ గాడు అభిమాన ధనుడు, సుయోధనుడు. మాట పడే వాడు కాదు.మాటకి మాట ఉండాల్సిందే – అవతల వాడు ఎవడైనా సరే.ఎందుకురా ఈ మొండి వాగుడంటే –దానికి వాడి సమాధానం –“అమ్మా, నాన్నలు బడిలో స్కూల్ మాస్టార్లు రా హర్షా! మా నాయన నేను పుట్టంగానే, నా ఫేసు చూసి, “ఈ నా యొక్క కొడుకు ఒక మొండి నా పుత్రుడు, నా పేరు విషయంలో, నీ జోక్యం ఏందీ? అని రేపొద్దున, నన్ను నిలదీసే లక్షణాలు వీడి మొహం లో బాగా కన్పడుతున్నాయి అనుకోని ఏం జేసాడో తెలుసా ” ?“చెప్పరా ! బాబూ , చాలా ఇంటరెస్టింగ్ గా వుంది” అన్నా !“నాకు ఐదో ఏడు వచ్చి, స్కూల్ లో వేసే ముందు దాకా అసలు పేరే పెట్టలా. స్కూల్లో వెయ్యబోయ్యే ముందు, నా ముందు ఓ పది పేర్లు పెట్టి, నువ్వే చెప్పరా! ఈ పేర్లల్లో నీకేది నచ్చిందో, రేపొద్దున చెత్త పేరు పెట్టావు అంటూ నన్ను సతాయించ కుండా” అన్నాడు మా బాబు.“అప్పుడు ఉదయ్ భాస్కర్ అని నాకు నేనే పేరు పెట్టేసుకున్నా ! కానీ నా ఫ్రెండ్సంతా, ఎందుకో ఉదయ్ లో, వై తీసేసి ఎక్స్ పెట్టేసి ఉడాక్స్ అంటార్రా, కావాలంటే నువ్వు కూడా పిలుచుకో”.“వద్దు లేరా, అంత మంచి పేరు నేను ఖూనీ చేయను, నాకు ఉదయ్ బాగుందిరా” అన్నా నేను.వాడెప్పుడూ మిగతా మా అందరిలాగ ఉద్యోగం కోసమే పీజీ చదివే వాడిలా కనపళ్ళా .ఎవరయినా ఏరోనాటిక్స్ చాలా నారో కోర్స్ కదా, ప్లేస్ మెంట్స్ వుండవు అంటే, తెలిసే కదా నేను, చేరింది. ఇక నువ్వు దొబ్బేయ్యొచ్చు అనే వాడు.“ఏరా నీకు ఉద్యోగం గురించి ధ్యాస లేదా!” అంటే.“ఎందుకు లేదురా!. బాచిలర్స్ అయితే కోటా మీద సీట్ తీసుకున్నా, ఆ తర్వాత కాంపిటీటివ్ గా చదివా. ఒక్క సారి వాడుకున్నాక ఇక కోటా వాడుకోకూడదు అనిచెప్పి, మెషీన్ టూల్స్ కి, జేజెమ్మ లాంటి, బ్రాంచ్ వచ్చే అవకాశం వున్నా, ఓపెన్ లో ఏరోనాటిక్స్ వచ్చింది చేరిపోయా! ప్రైవేట్ సెక్టార్ లోనే నాకు తగ్గ ఉద్యోగమే చేస్తా!”.అలా ఇంకా దగ్గరయ్యాడు వాడు నాకు.జనాలంతా వాడి రూమ్ కి వెళ్లాలని తెగ ఉబలాట పడే వాళ్ళు. కానీ పైకి మాత్రం, అదోలాగా మొహం పెట్టి, వాడి రూమ్ ని ట్రిపుల్ ఎక్స్ రూమ్ అని పిల్చుకునే వాళ్ళు. ఎందుకంటే...