నిర్మల మొగుడు - తిలక్ గారి కథ
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
నిర్మల మొగుడు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodayaకథను –‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1(Harshaneeyam on Gaana app)స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam(Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5(Harshaneeyam on Apple. Podcast)నిర్మల మొగుడు:ఖంగారు ఖంగారుగా భోజనం చేస్తున్న భర్త మానసిక పరిస్థితినీ, మొహంమీద పడుతున్న నల్లని వంకీల జుట్టునీ, అదో విధమైన ఆనందానీ అందాన్ని సూచించే అతని రూపాన్ని చూసేటప్పటికి జాలివేసింది నిర్మలకు. –– “తాపీగా తినండి. మీకిష్టమని ఈ గోంగూరపచ్చడి కూడా వేశాను. మీరలాగ కంగారుగా తిని వెళ్ళిపోతే నా మనసంతా ఎంతో బాధపడుతుంది.”“ఒళ్ళమ్ముకున్నాక తప్పుతుందా మరి! ఆ రావణాబ్రహ్మ ఈవేళ ఎలాగైనా నన్ను వదలడులే!”ఈ రావణాబ్రహ్మ అన్న బిరుదు ఎవరికి చెందుతుందో నిర్మలకి తెలుసు. ఆ పేరు చెప్పితే తన భర్త హోరని వర్షములో తడిసి వచ్చికూడా గడగడా మరచెంబుడు నీళ్ళు తాగుతాడన్న విషయం కూడా తెలుసును. కాని ఎదురుగా తన భర్త అంత కంగారుగా భోజనం సరిగా చేయకుండా వెళ్ళిపోతుంటే ఆమె భరించలేకపోయింది. అందులోనూ జరిగిన రాత్రి అతనసలు భోజనమే చేయలేదు. దానికి కారణమైన కలహమూ, ఆ కలహములో మొండిపట్టుపట్టిన తనపాత్ర నిర్వహణా, ఆ కోపములోనే యిద్దరూ భోజనం మానేసి, ఒకే పెద్ద మంచంమీద ఒకరికొకరు తగలకుండా, ఒకరివైపొకరు తిరగకుండా పడుకొని జరిపిన అసిధారా వ్రత నిర్వహణమూ ఇవన్నీ నిర్మలని పశ్చాత్తప్తురాలినిగా భర్తయెడ మరీ సుముఖురాలిగా, ప్రేమచేత కరుణచేత ఆర్ద్రహృదయగా చేసివేశాయి. అందులోనూ అందమైనవాడు, జుట్టు ఆ విధంగా మొహంమీద పడేవాడు. అటువంటివాడు తనకి భర్త అయి, తన సర్వస్వమూ అయినప్పుడు. –• “మీరు ఆ కూర మరోసారి కలుపుకుంటే కాని వీలులేదు. నా మీద ఒట్టే! బోడి ఉద్యోగం పోతేపోతుంది – దీని తాతలాంటిది వస్తుంది. ఊ, మరి కలపండి” అంది.ఈసారి విసనకర్ర పుచ్చుకొని విసురుతూ అతని ప్రక్కన కూర్చుంది. నవ్వుతూ పట్టుదల పట్టుతూ లాలిస్తూ అతనిచేత తిరిగి కూర కలిపించింది. “అయిన ఆలస్యం ఎల్లానూ అయిందిగా? ఇంకో పావుగంట లేటయితే పీకలు తీస్తారా ఏమిటి? సంసారాల్లో ఎవళ్ళకి మాత్రం ఏదో అవసరాలు రాకుండా వుంటాయా, ఆలస్యాలవకుండా వుంటాయా?” అంటూ నొక్కులు నొక్కుతూ సన్నగా దీర్ఘం తీసింది. అసలు ఈ ఆర్గ్యుమెంటుని ఏ కోర్టులోనూ ఒప్పుకోరని తెలుసు. కాని కలహానంతరం అందులోనూ ఒక రాత్రి రాత్రి మౌనంగా వుండి, తిరిగి సంధి కలుపుకొన్న తర్వాత భార్యా భర్త లనుభవించే ఆనందం సరిక్రొత్త ప్రేమలనూ ఉద్రేకాన్ని స్వచ్ఛ పరిమళాన్ని కలిగి వుంటుంది. అటువంటి పునర్నవమైన ఆప్యాయతలో భోజనం పెడుతూంటే, భార్య సన్నవి గాజుల చప్పుడుతో విసురుతూ లాలిస్తూ ఉంటే వేరే కాంక్షించే స్వర్గమే లేకపోయింది గంగాధరానికి. ఆఫీసులూ, బాధలూ, సమస్యలూ అన్నీ చప్పున ఫేడౌట్ అయిపోయాయి. ఆ కాస్సేపట్లోను అతనికి నిత్యమూ, సత్యమూనైన బ్రహ్మానందం గోచరించింది.ఈసారి వాళ్ళ కబుర్లు, ఒకసారి మనస్సులోంచి సమస్యా సందేహాలు దూరమైపోయిన తరువాత – ఏ అడ్డంకీలేని నదీ ప్రవాహంలాగా సాగిపోయాయి. వచ్చే సంక్రాంతి పండుగకి మామగారు ఏం బహుమతి యిస్తారో అన్న ప్రశ్ననుండీ, సినిమాలో ఫలానా నటి తాలూకు నటన విశేషమూ, కో – ఆపరేటివ్ స్కీములో తాము కట్టించబోయే చిన్న సైజు యింటికి యెన్ని గదులు ఉండాలి అన్నంతవరకు అనవసర అవసర సమాలోచనలన్నీ సాగిపోయాయి. అతను చెయ్యి కడుక్కొని లేచేటప్పటికి ఆమె వక్కపొడుం తీసుకొచ్చి ఇచ్చింది. అతను బనీను ధరించేటప్పటికి దువ్వెనతో వచ్చి అతని పాపిడితీసింది. అతను అమెరికన్ జాకెట్ వేసుకొనేటప్పటికి జోళ్ళు రడీగా ఎదురుగా పెట్టింది. అతను ఆమెను ముద్దు పెట్టుకొని “వస్తాను నిర్మలా” అని యధాలాపంగా అలవాటు చొప్పున గోడమీద టైము చూచేటప్పటికి అతనికి స్పృహవచ్చినట్టు – లేక తప్పినట్టు అయింది. కఠిన వాస్తవికత కొరడాతో కొట్టినట్లయింది. అతని నీడ అతని వెనకనే వచ్చి వెన్నుల్లో పొడిచినట్లయింది. ఉన్నపళంగా కుప్పగా కుర్చీలో కూలి “పదకొండుంబావు” అన్నాడు. అతని మొహంలో...