ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

హర్షణీయంలో ఇప్పుడు మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’. ఇది వారి ‘గుడి’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది.తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు. ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది. తమ రచనను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.డిసెంబర్ నెలలో వారి ఇంటర్వ్యూ ‘హర్షణీయం’ ద్వారా మీకందించబడుతుంది. ‘గుడి’ కథాసంపుటి ని కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీలో ఇవ్వబడ్డాయి.‘సిలారు సాయబు’:నాగడు సిలారు సాయిబును కొట్టాడు. సిలారు నవ్వాడు. నాగడికి ఏడుపు వచ్చింది. మళ్ళీ కొట్టాడు. సిలారు ఇంకా నవ్వాడు.వాడు కొట్టా . వీడు నవ్వా. ఇదే తంతు. వాడు బలవంతుడు. వీడు బల హీనుడు. వాడున్నవాడు. వీడు లేనివాడు. వాడు సంసారి. వీడు బికారి.నాగడికి తిక్క ముదిరింది. కర్రతో బాదాడు.'నన్ను తిట్టరా' అన్నాడు. సిలారు తిట్టలేదు. 'నన్నుకొట్టరా' అన్నాడు. సిలారు కొట్టలేదు. 'నన్ను వాటేసుకోరా' అన్నాడు. సిలారు వాటేసుకోలేదు.సిలారుసాయిబు తనను తిట్టాలని, కొట్టాలని, వాటేసుకోవాలని నాగడికి ఆశ, ఇష్టం, ఉబలాటం, ఆరాటం. అందుకే ఈ చావు.నాగడు తనకు వచ్చిన బూతులన్నీ తిట్టాడు. సిలారు నవ్వుతాడు కానీ తిట్టడు.సిలారుకు ఒక ప్రఖ్యాతి ఉంది. వీడు తిట్టినా కొట్టినా తాకినా మేలు జరుగు తుందని.అతడి ఊరూ పేరూ ఎవరికీ తెలియదు. ఎప్పుడో ఎవరితోనో సిలారుసాయిబు అని తన పేరు చెప్పాడని అందరూ అనుకొంటారు. అలా అతడికి ఆ పేరు స్థిర పడింది. ఆ పేరుతో పిలిస్తే తిరిగి చూస్తాడు కానీ 'ఏమీ?' అని అడగడు.మర్రిచెట్టు కింద పడుకొంటాడు. దేవుళ్ళ చెరువులో బుద్ది పుట్టినంత సేపుమునుగుతూ తేలుతూ ఉంటాడు. బర్రెలు, దున్నలు, పెయ్యలు, దూడలు నీళ్ళలో మునిగినట్లే సిలారు సాయిబూ మునుగుతూ తేలుతూ ఉంటాడు.  బరి గొడ్డు గట్టెక్కగానే తానూ ఒడ్డు కెక్కి వేప చెట్టు కింద కూర్చుంటాడు. బట్టలు ఒంటి మీదే ఆరి పోతాయి. ఎవర్నీ ఏమీ పెట్టమని అడగడు. ఏం పెట్టినా తీసుకోడు. ఇష్టమైంది ఎక్కడున్నా తీసుకుంటాడు. చలిలేదు, వానలేదు, ఎండలేదు. మర్రి చెట్టు కిందే మకాం. పగల్లేదు, రాత్రిలేదు, ఎప్పుడయినా నిద్రపోతాడు, నిద్రపో యినప్పుడు తప్ప చెట్టు కింద ఉండడు. ఎవరైనా చిరుగులబొంత ఇచ్చినా కప్పు కోడు. పక్కనేసుకోడు. బుద్ధి పుడితే దాని మీద పడుకొంటాడు. లేకపోతే అది అక్కడ ఉండగానే గడ్డి మీద పడి నిద్రపోతాడు. వాడికి దినచర్య లేదు. ఇప్పుడు నిద్రపోవాలని గానీ ఇప్పుడు నిద్ర లేవాలనిగాని నియమమేమీ లేదు.సిలారు సాయిబుకు ఏం తొందరో అంగలు పంగలు వేసుకుంటూ వస్తాడు. గబగబా పోతాడు. పరుగూ కాదు. నడకా కాదు. అడ్డదిడ్డంగా పడుతూ లేస్తూ వస్తూ పోతూ ఉంటాడు. మాదిగ పల్లెను వదిలి ఎక్కడికీ పోడు. పల్లె పెద్ద ఎక్క డిదో పాత నిక్కరుంటే సిలారు సాయిబును పట్టుకొని తొడిగాడు. అది జారి పోకుండా మోకులాంటి మొలతాడు కట్టాడు. మొలతాడు అదుపాజ్ఞల్లో నిక్కరు ఖైదు అయింది. నెలకో ఆర్నెల్లకో పల్లె పెద్దకు బుద్ధిపుడితే పై బట్టలు పీకేసి ఉతికి నవేవో తొడుగుతాడు. పల్లెమొత్తం మీద పెద్ద మాదిగకు మాత్రమే సిలారు సాయిబు దొరికేవాడు. ఏ బట్ట పీకి పారేసినా ఓర్చుకునేవాడు. ఏ ఉతికిన బట్టలు వేసినా ఒప్పుకొనేవాడు. ఇక పల్లెలో ఎవరి చేతికి దొరకడు. ఏం పనీ ఉండదు. పల్లె వీధు లన్నీ మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటాడు. ఎవురైనా ఎదురైతే అల్లంత దూరంగా తప్పు కొని తప్పించుకొని పోతాడు. ఎవరైనా వీధిలో కూర్చుని అన్నం తింటుంటే తినే గిన్నెలో నుంచి గుప్పెడు మెతుకులు...