మా జి.వి.ఎస్ మాస్టారు గారు!

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

జి.వి.ఎస్ మాస్టారు గారు ఒంగోలు P.V.R.మునిసిపల్ హై స్కూల్ లో నా టీచర్. పూర్తి పేరు గాలి వెంకట సుబ్బారావు గారు. ఆరడుగుల మనిషి, స్ఫురద్రూపి, లెక్కలు  మరియు సైన్స్ అయన స్పెషాలిటీ. ఇదికాక ఆయన అద్భుతమైన వక్త,  విషయం ఏదైనా తెలుగు లో చాలా అందంగా, అనర్గళంగా మాట్లాడగలరు. నాకున్న తెలుగు తెగులు ఆయన నుంచే తగులుకుంది అని నా అనుమానం. బడిలో విన్నది చాలక ఆయన గొంతు విందామని ఆయన దగ్గరకి ట్యూషన్ కూడా వెళ్ళేవాడిని. మొదటి నుండి ఆయనకు నేనంటే ఎందుకో ప్రత్యేకమైన అభిమానం. ఏరా, అబ్బాయి అంటూ ప్రేమగా పలకరించే వారు. ఒకసారి మా బడిలో వక్తృత్వం పోటీలు జరుగుతున్నాయి. నలుగురు జడ్జీలలో జి.వి.ఎస్ మాష్టారు గారు ఒకరు. నేను గది బయట వేచివుండగా చూసి, "ఏరా, నువ్వు కూడా పోటీ లో ఉన్నావా?" అని అడిగారు, అవునండి అన్నాను నేను. నా వంతు వచ్చేసరికి ఆయన ఆ పోటీలు జరిగే ప్రదేశంలో కనపడలా నాకు.  పోటీ అంతా అయిపోయాక టీచర్ల గదికి వెళ్లిన నాకు, ఆయన కాలు మీద కాలు వేసుకొని, బ్లిట్జ్ పేపర్ చదువుకుంటూ కనపడ్డారు. నేను రావటం గమనించి, ఆయన తల పైకెత్తి, కళ్ళద్దాల్లోంచి చూస్తూ, "ఏరా అబ్బాయీ బాగా చేశావా?" అని అడిగారు. ప్రధమ బహుమతి వచ్చిందండి అని చెప్పా, తల ఎగరేసి కాస్త ఉక్రోషంగా. ఆయన చిన్నగా నవ్వేసి, "నా ప్రశ్నకి సమాధానం అది కాదురా" అని అన్నాడు. కోపంగా వెను తిరిగిన నాకు వెనకనుండి , "చూడరా అబ్బాయీ, నీకు బహుమతి వస్తుందని నాకు తెలుసు. నేను అక్కడ వుండి వుంటే, నువ్వు ఎలా మాటలాడిన, నీకు ఎక్కువ మార్కులు వేసేవాడిని. అది ఇష్టం లేకే వచ్చేసాను" అని చెప్పటం వినిపించింది. ఇక్కడ ముళ్ళపూడి వారు చెప్పినట్టు ఓ చిన్న కోతి కొమ్మొచ్చి. మా ప్రశాంత్ గాడు, ఆ మధ్య ఏదో సందర్భములో మాటలాడుతూ, చాల స్టైల్ గా ఆంగ్లములో, "దేర్ ఈజ్ నో మీనింగ్ అఫ్ ఫ్రెండ్షిప్, ఇఫ్ దేర్ ఈజ్ నో ప్రిజుడిస్" అన్నాడు.  ఇది ఇక్కడ ఎందుకు చెబితున్నాను అంటే నా పట్ల ఆయన ప్రిజుడిస్ కి కారణం ఆయన పెంచుకున్న అభిమానం. పదవ తరగతిలో జరిగిన వార్షికోత్సవంలో నాకు చాల బహుమతులు వచ్చాయి. వాళ్ళ బంధువులలో ఒకాయనకు నన్ను పరిచయం చేస్తూ చెప్పారు ఆయన, "ఈ సారి పదవ తరగతిలో మా బడికి మొదటిస్థానం కూడా మనోడిదే" అంటూ. చిన్నప్పటినుండి తెలుగు అంటే ఎంత ఇష్టమో, హిందీ అంటే అంత చిరాకుగా ఉండేది నాకు. అదేదో సినిమాలో బ్రహ్మానందం, "ఆవిడని  ప్రేమించాల్సి వచ్చింది" అని చెప్పినట్టు, ఇప్పుడు నాకు నార్త్ కి వెళ్ళినప్పుడు తప్పనిసరియై హిందీ మాట్లాడాల్సి వస్తుంది, భాష అంటే ప్రేమ ఎక్కువై కాదు, వాళ్ళు ఆంగ్లము మాటలాడితే భరించలేక. పదవ తరగతి సంవత్సరాంతపు పరీక్షలలో హిందీ పరీక్షకు ముందు, మాకు మూడు రోజులు శెలవులు వచ్చాయి. అన్నీ సబ్జెక్ట్స్ ని ఒకటికి పది సార్లు చదివి, రివిషన్ చేసుకొనే అలవాటు వున్న నేను, హిందీని మాత్రం పూర్తిగా వదిలేశా. ఆ మూడు రోజులలో పరీక్ష మీద ఆందోళన మొదలయ్యింది, సరిగా చదవ లేక పోయా, రాయ లేక పోయా. ఒకటో స్థానం కాదు కదా, రెండు నుండి కూడా జారిపోయి, మూడవ స్థానానికి పడిపోయా నేను. పదిహేను  మార్కుల తేడా నాకు మరియు మొదటి స్థానం వచ్చిన వాడికి. ఈ లోపల మా నాన్నకి నంధ్యాలకి బదిలీ అయ్యింది. వెర్రి మొహమేసుకొని వెళ్ళాను ఆయన్ని కలవడానికి. "ఏరా! ఎందుకిలా అయ్యింది" అన్నారు ఆయన నా భుజం మీద చేయి వేస్తూ. విషయం వివరించాను ఆయనకు. "చూడరా అబ్బాయీ! పని ముఖ్యం అనుకుంటే, ముహుర్తాలు చూడకూడదురా. ముందే పూర్తి చేసేసుకోవాలి" అన్నారు. వచ్చేస్తూ చెప్పాను ఆయనకు, "మరల బాగా పైకి వచ్చాక వచ్చి కనపడతాను అండి" అని. నా పైకో లేక మీదకో రావొద్దురా, బాగా ప్రయోజకుడివై రారా అని దీవించి పంపారు. ఆ తర్వాత కళాశాల, ఉద్యోగం, పెళ్లి అన్నీ జరిగిపోయాయి కొన్ని నా ప్రమేయంతో కొన్ని అప్రమేయంగానే. ప్రయోజకుడయ్యానో లేదో అనే అనుమానం వున్నా, వెళ్లి ఆయన్ని కలిస్తే బాగుండు  అని చాల సార్లు అనిపించేది. పది దేశాలు, పదహారు రాష్ట్రాలు తిరిగినా, ఆయన్ను కలవడానికి సమయం దొరకలేదు నాకు ఎప్పుడు. సంవత్సరం క్రిందట, ఇన్స్టిట్యూట్ పని మీద ఒంగోలు వెళ్ళాను. అక్కడ వాకబు చేయగా, రాత్రి ఎనిమిది లేక ఎనిమిదిన్నర మధ్యలో సాయి బాబా గుడికి వచ్చి మంచి ఉపన్యాసాలు ఇస్తుంటారు అని ఎవరో చెప్పారు. ఆ స