పి.రామకృష్ణ గారి కథ - 'దయ్యం'

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

'భయాన్ని దాటడమే జ్ఞానం' అన్న గొప్ప విషయాన్ని , తేలికైన తేట తెలుగులో మనకు వివరిస్తారు ప్రసిద్ధ కథకులు , విమర్శకులు , పాత్రికేయులు శ్రీ. పీ. రామకృష్ణ గారు, తాను రచించిన 'దయ్యం అనే ఈ కథ ద్వారా.ఇంత చక్కటి కథను హర్షణీయం ద్వారా అందించడానికి, అనుమతిని ఇవ్వడమే కాక, కథ పై హర్షణీయం చేసిన వ్యాఖ్యకు స్పందిస్తూ , కథా నేపధ్యం గురించి, ఆడియో ద్వారా వివరించిన శ్రీ.రామకృష్ణ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.రామకృష్ణ గారి సమగ్ర సాహిత్యం కొనేటందుకు కావలసిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.ఉపోద్ఘాతం:‘భయం’ అనుభవించని మనిషిని , ఊహించడం కష్టం.మన భయానికి  కారణం - ఒక మనిషి కావచ్చు, ప్రత్యేకమైన వాతావరణం  కావచ్చు, ప్రదేశం  కావచ్చు, లేదా అప్పటి మన మానసిక స్థితి కావచ్చు.  భయపడుతున్న పరిస్థితుల్లో ,   తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి  మన  జీవితాలని విపరీతంగా ప్రభావితం చెయ్యవచ్చు. నెగటివ్ గా కానీ , పాజిటివ్ గా   కానీ. 'భయాన్ని దాటడమే జ్ఞానం' అన్న గొప్ప విషయాన్ని , తేలికైన తేట తెలుగులో మనకు వివరిస్తారు ప్రసిద్ధ కథకులు , విమర్శకులు , పాత్రికేయులు శ్రీ. పి. రామకృష్ణ గారు, తాను రచించిన 'దయ్యం అనే ఈ కథ ద్వారా.కథలో ముఖ్య పాత్రలు ఒక పల్లెటూరిలో ప్రభుత్వ పాఠశాల లో పని చేసే ఒక ఉపాధ్యాయుడు (ఆయనే కథకుడు) , ఆయన క్లాస్ లోనే చదువుకునే ఒక బీద విద్యార్ధి, ఆ విద్యార్ధి తల్లి .కథలోకొస్తే -ఒక రాత్రి,  కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో , కథకుడైన టీచరు గారు,  పక్కనున్న పట్టణం నుంచి , పల్లె కి నడిచి రావాల్సి వస్తుంది,  మధ్యలో వున్న పొలాల గుండా.  వాతావరణాన్ని , కథ మొదట్లో  అందంగా ఆహ్లాదంగా  ఉందని వర్ణిస్తారు రచయిత.ఆ నడిచే  దారి ఆయనకు కొత్తదేమీ కాదు. అలాగే రాత్రి పూట పొలాల వెంబడి నడక గూడా టీచరు గారికి  అలవాటు లేని విషయం కాదు.నడుస్తూ వున్నప్పుడే, అంతర్మధనం మొదలౌతుంది  ఆయనకు.  తన  జీవితంలో అప్పుడున్న పరిస్థితులూ, ఎదుర్కొంటున్న చికాకులూ , నిరాశ చెందే విషయాలూ అన్నీ గుర్తుకొస్తాయి.   కథకుడి మానసిక పరిస్థితి ,  పూర్తిగా  మనకు అవగతమౌతుంది. ఇట్లా  అతను నడుస్తూండగానే  , తన పాత్ర  మానసిక పరిస్థితిని, సూచిస్తున్నట్టుగా,  వాతావరణం మారిపోతుంది. చీకటి కమ్ముకుంటుంది . ఉరుములూ మెరుపులూ మొదలౌతాయి. వూరికి వెళ్లాలంటే 'దయ్యం మాను' అనబడే   ఒక చింత  చెట్టుని దాటుకు వెళ్ళాలి.  ఆ దయ్యం మాను గురించి వూళ్ళో వాళ్ళు చెప్పుకునే కథలూ....... ఆ చెట్టుని అంటి  పెట్టుకుని వుంది,  అని అందరూ అనుకునే, ,  చనిపోయిన అంకమ్మ, తన దగ్గర క్లాసులో చదువుకునే అంకమ్మ కొడుకు పది పన్నెండేళ్ల గొల్ల పాపయ్య, వాళ్ళ వికృతమైన రూపాలు   ఇవన్నీ గుర్తుకొస్తాయి.ఎన్నోసార్లు ఆ మానుని నిర్భయంగా దాటుకుంటూ వెళ్లిన,  ఆయనకు   మనసులో ఒక  చిన్న సందేహం మొదలౌతుంది. చెట్టువైపు నించి ఏడుపు వినబడడం మొదలౌతుంది.వింటున్నది చూస్తున్నది నిజమా , కాదా అనిపించి ఆ సందేహం ,  పెనుభూతంగా మారి మనసూ , వొళ్ళూ,  అంతా  ఆవరిస్తుంది. సరళమైన పదాలను  వాడుకొని  అద్భుతమైన   వాక్యాలను సృష్టించి,   కథా నిర్మాణం  చేశారు రామకృష్ణ గారు. ఈ రీతిలో , కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకువెళ్లి ఒక అద్భుతమైన ముగింపు ఇస్తారు రచయిత.కథ చివరలో టీచరుని,  స్టూడెంటుగా , స్టూడెంట్ ని టీచరుగా మార్చివేస్తారు రామకృష్ణగారు చాకచక్యంగా. నిస్సదేహంగా 'దెయ్యం' తెలుగు కథాసాహిత్యంలో మనకు లభించిన, అత్యుత్తమ కథల్లో ఒకటి.దయ్యం:నేను రోడ్డు దిగేటప్పుడు సూర్యుడు పడమటదిగిపోయినాడు. పొలాలదారి వెంటనడుస్తున్నాను. విశాలమైన, పైరులేని సేద్యం చేసిన పొలాలు ప్రశాంతంగా వున్నాయి. నీలం రంగు ఆకాశం కింద దూరానికి కనిపించే నిశ్చల సముద్రం మాదిరి కనిపిస్తున్నాయి. కాళ్ళ కింద బండ్ల జాడలు ఏర్పరచిన గోతులు ఎండి పెళ్ళలుగా మారి చెప్పుల్లేని పాదాలను నొప్పిస్తున్నాయి. వారం రోజుల కిందట పెద్ద వర్షం కురిసింది. తేమ ఆరీ ఆరక ముందే రైతులు పొలాలకు ఎరువుతోలుకున్నారు. ఇప్పుడు ఎరువుతోలి సేద్యం చేసుకుంటే, ఈసారి వర్షానికి విత్తనం వేసుకోవచ్చని వాళ్ళ తొందర. ఒక్కవర్షం వృధా అయితే, ఎంత నష్టమో అది మెట్ట రైతుకే తెలుసు.ఈ వేళ పట్టణంలో చెప్పులు కొనుక్కోవాలనే ఆలోచనతో చార్జీలకు గాక పదిరూపాయలు ఎక్కువే జేబులో వేసుకున్నాడు. కానీ, పదిరూపాయలకు చెప్పులు కొనగలిగిన పరిస్థితి నుంచి దేశం చాలా 'అభివృద్ధి'ని సాధించిందని అర్థమయింది....