నెల్లూరు ట్రంక్ రోడ్డు నందలి నా 'జాతక' కథ!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
ఆ రోజు, ఒంగోల్లో ఏదో పెళ్లి ఉందని, వారం రోజులు కని, మా ఆవిడ బయలు దేరుతూంటే, ఆవిణ్ణి, రైలు ఎక్కించి, ట్రంకు రోడ్డుకొచ్చాను. మా రోజు వారీ సమావేశానికి నేను ఓ అరగంట లేటు. అప్పటికే, మా వాళ్ళు, విశ్వనాధం, సుబ్బారాయుడు, వెంకటరామన్ సర్, ట్రంకు రోడ్డు, సదాశివ మెడికల్ హాల్ మెట్ల మీద, చేరి పోయి వున్నారు. మా విశ్వనాధం ఎదో విషయం సీరియస్ గా చెపుతూంటే, వెంకట రామన్ గారు, సుబ్బారాయుడు ఆసక్తిగా వింటున్నారు. నేను రావడం చూసి మా విశ్వనాథం సడన్ గా మాట్లాడ్డం ఆపేసాడు. "ఏవయ్యింది" అడిగాన్నేను విశ్వనాధాన్ని. సమాధానం లేదు మనిషి దగ్గర్నుంచి. సుబ్బారాయుడి, వైపు చూసాడు విశ్వనాధం . సుబ్బారాయుడు అన్నాడు, " ఏం లేదు గురూ, ఇప్పుడు విశ్వనాథం, జాతకాలు చూడ్డం నేర్చుకున్నాట్ట. దాని మీద ఒక చిన్న ఇంటరెస్టింగ్ డిస్కషన్." "జాతకాలు నమ్మొచ్చేమో అన్న అనుమానం వుంది గానీ, జాతకం చెప్పే వాళ్ళను చూస్తే, అంత తొందరగా నమ్మాలనిపించదు నాకు, అన్నాను నేను, విశ్వనాధాన్ని చూస్తూ. ఇంతలో వెంకటరామన్ గారు అందుకొని అన్నారు, "సుందరబాబు రాంగానే, చెప్పాలని, తహతహ లాడిపొయ్యావు గదా. చెప్పెయ్యరాదా !" అని విశ్వనాథం తో. ఇంక లాభం లేదనుకున్నట్టున్నాడు, విశ్వనాధం చెప్పడం మొదలు పెట్టాడు. " మొన్న మీ జాతకం వేసి స్టడీ చేసా సార్. దాని ప్రకారం, కొద్ది రోజుల్లో, ఎదో గొడవలో, మీరు కొంత సమయం జైలు లో ఉండాల్సి వస్తుందని, అనిపిస్తోంది. కాబట్టి, మీరు కొంచెం జాగర్తగా ఉంటే మంచిది ." ఎటూ మీరు తేలిగ్గా తీసేస్తారు అని తెలుసు గాబట్టి, చెప్పినా ప్రయోజనం లేదని నేను, ఇలాంటి విషయాలు, అనిపిస్తే , చెప్పకుండా ఉండగూడదని, సుబ్బారాయుడు, తర్జన భర్జనలు పడుతున్నాం అరగంట నించి " విశ్వనాథం చెప్పిందంతా విని, అడిగాన్నేను, "నువ్వు, ఇట్లా జాతకాలు చూడ్డం అని మొదలు పెట్టి ఎన్ని రోజులయ్యింది ?" "నేర్చుకోడం ఓ సంవత్సరం నించి, ప్రెడిక్షన్స్ మొదలు పెట్టి, ఓ నెల రోజులయింది, మా మేన మావ ఒకాయన బాగా చెప్తాడు. ఆయన దగ్గర నేర్చుకుంటున్నా " అన్నాడు విశ్వనాథం. కంటిన్యూ చేస్తూ చెప్పాడు, "మొన్న మా పక్కింటాయన, ఎప్పుడో చిన్నప్పుడు, జరిగినవన్నీ కూడా, చాల కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేసాను" అని "జరిగినవి, చెప్తే, ప్రెడిక్షన్, అనగూడదేమో, ప్రిపరేషన్ అనాలేమో " అన్నా , నేను అతని మొహంలోకి ఓరగా చూస్తూ. సుబ్బారాయుడు గూడ ఒక కొంటె నవ్వుతో, విశ్వనాధం ఏవంటాడా అని, అతని వైపు చూసాడు. మా వెంకట రామన్ గారు, ఇవన్నీ పట్టించుకోకుండా, మా సాయి కేఫ్, ప్రసాద్ పంపించే టీ కోసం రోడ్డు అవతలి వైపు చూస్తున్నారు. విశ్వనాధం మొహం ఎర్రబడింది, "ఏమోనండి, నాకూ ఆయనకీ పరిచయం అయ్యి వారం రోజులు కూడా కాలేదు. ఆయన చిన్నతనం లో జరిగిన సంఘటనలు నాకు తెలిసే అవకాశం లేదు" అన్నాడతను పక్క రోజు మధ్యాహ్నం, దర్గామిట్ట లో ఎదో పని చూసుకొని, ఇంటి కొచ్చా. ఇంటి తాళం తీసి లోపలికెళ్తుంటే, మా ఎదురింటాయన ఆదుర్దాగా వచ్చి, "సుందరబాబు గారూ, ఓ గంట క్రితం మీ గురించి ఒక పోలీసు వచ్చాడండి, కలుద్దామని" , అన్నాడు. "దేని గురించిట ?' అడిగాన్నేను. "విషయం అడిగినా , ఏం చెప్పలేదండి, మీ ఫోన్ నెంబర్ తీస్కొని వెళ్ళాడు. పేరు విష్ణు అని చెప్పి వెళ్ళాడు. వన్ టౌన్ స్టేషన్ నించి వచ్చాడట ." అన్నాడాయన . "వెళ్లి కలుస్తాలెండి. సాయంకా