అల్లం శేషగిరి రావు గారి 'మృగతృష్ణ'
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
*** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు.'మృగ తృష్ణ ' - అల్లం శేషగిరిరావు గారి 'అరణ్య ఘోష' కథాసంకలనం లోనిది.ఈ కథ ఆంధ్రజ్యోతి పత్రిక లో 1975 లో ప్రచురింపబడింది.పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం , భావుకత్వం మనల్ని కట్టి పడేస్తాయి.1981 లో ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది.పల్లవి పబ్లికేషన్స్ వెంకట నారాయణ గారు , ఫిబ్రవరి మొదటి వారంలో 'అల్లం శేషగిరిరావు సమగ్ర కథా సంకలనం' తీసుకవస్తున్నారు.మొబైల్ : '98661 15655' ద్వారా ఆయన్ను సంప్రదించి , మీ కాపీ రిజర్వు చేసుకోవచ్చు.కథ:ఎండలు | నిప్పులు చెరిగే ఎండలు!!అడవిలోని నీటిమాటులు, కొండ వాగులు, సెలలు ఎండిపోయాయి. కొండల్లో అగ్గి జంజలు. వడదెబ్బకి పిట్టలు సొమ్మసిల్లి నేలకు రాలిపోతున్నాయి. దాహం !వులులు, తోడేళ్ళు, జింకలు, దుప్పులు, పిట్టలు, పురుగులు- నీటి కోసం ఆర్చుకుపోతూ మందలు మందలుగా వలసపోతున్నాయి. పరుగులు, ఉరకలు- దాహం. రాత్రింబవళ్ళు ఒకటే పరుగులు, దాహం. అడవి పంది పడితే రెండు మూడు వందలు దాకా చెయ్యొచ్చు. అదృష్టం పండి కణుసుపడిందా, నాలుగువందలదాకా చెయ్యొచ్చు. దుప్పి పడినా కనీసం నూటఏభైకి తక్కువరాదు,సూరయ్య బాకీ తీరిపోతుంది. మూడు సంవత్సరాల నుంచి వర్షాలు లేక బీడు పడిన తన మెరక చెక్క మీద చేసిన అప్పు! అసలు, వడ్డీతో కలిసి మూడు వందలు దాటింది. ఈ సంవత్సరమైనా తీర్చకపోతే సూరయ్య, బాకీ క్రింద భూమి జమకట్టేసుకుంటాడు. అలా చాలామంది భూముల్ని పడేసుకుని పల్లం ప్రాంతంనుంచి వచ్చిన షావుకారు సూరయ్య లక్షాధికారయిపోయాడు. ఆ సంగతి బాగా తెలిసిన బైరిగాడు తన భూమిని ఎలాగైనా దక్కించు కోవాలనుకున్నాడు.బైరిగాడు నాటు తుపాకీని బైటికి తీసి బూజు దులిపాడు. చూరులో దాచిన పాత మందుగుండు సంచి తీసి అందులోని మందుగుండు కొంచెం నేలమీద పోసి అగ్గిపుల్ల గీశాడు. పేదవాడి ఆశలా భగ్గున మండింది. పాతదైనా మందు ఇంకా పవరు పోలేదనుకున్నాడు. తుపాకీ నల్లీలో మందు ఎక్కువ పోసి దట్టించాడు. సంచీలో పాతబడిన మేకుల్నీ, ఇనుప ముక్కల్ని ఏరి గుళ్ళకు బదులుగా తుపాకీలో నింపి వాటి మీద కాగితపు ముక్కల్ని, గుడ్డ పీలికల్ని దట్టించాడు.గోచి గట్టిగా బిగించి, గుడిసె తడక దగ్గరగా లాగి, తుపాకీని పట్టుకుని సంచి భుజానికి తగిలించి అడవి లోకి బయలు దేరాడు వేటకి.అరవై సంవత్సరాలు నిండిన బైరిగాడి ముడతలు దేరిన ముఖం బీటలు పడ్డ నేలలా వుంది. వయస్సుతోనూ, కష్టాలతోనూ జీర్ణించుకుపోయిన శరీరం తోలుతో కప్పిన బొమికల గూడులా వుంది. జీరలు దేరిన కళ్ళు మాత్రం నిప్పు కణికల్లా తీక్షణంగా ఉన్నాయి. ఆ చూపుల్లో పట్టుదల, ఓపిక ఇంకా చప్పబడిపోలేదు. మధ్యాహ్నం దాటిపోయినా ఎండ ఇంకా తీక్షణంగా వుంది.దూరాన గూడెంలో వర్షాల కోసం వన దేవతలను కొలుస్తూ డప్పులు వాయిస్తూ జాతర చేస్తున్నారు.చెట్లన్నీ ఆకులు రాల్చేసి మోడువా రిపోయాయి. అడవంతా ఎండుటాకులు పరుచు కొనున్నాయి.బైరిగాడు నడుస్తుంటే దిష్టిబొమ్మ తుపాకి పట్టుకొని అడవిలో నడుస్తున్నట్టుంది. బైరిగాడి కాళ్ళ క్రింద ఎండుటాకులు చిట్లుతూంటే ఆ సడికి వెదురు డొంకల్లో చిలకలు గోలచేస్తూ ఎగిరిపోతున్నాయి. కాకుల గుంపు బైరిగాడి వింత ఆకారానికి చెట్ల మీద నుంచి గోలచేస్తూ బైరి నెత్తిమీద వలయాకారంగా తిరుగుతూ మెడలు నిక్కించి చాలా దూరం వరకు వెంబడించాయి.బైరిగాడు పొద్దుగూకక ముందే నీటిమాటు దగ్గరకు చేరాలని వడివడిగా అంగలేసుకుంటూ నడుస్తున్నాడు. అడ్డతోవల మీదగా నడుస్తూ తుప్పల్ని, డొంకల్ని, రాళ్ళని దాటుకుంటూ, రొప్పుకుంటూ, రోజాకుంటూ రెండు కొండలు ఎక్కి దిగి సాయంకాలానికల్లా నీటి మాటు దగ్గరకు వచ్చాడు.ఆ కీకారణ్యం మద్య ఎండిపోయిన సెలయేటికి పక్కగా గుబురుగా బలిసిన తుప్పల నీడలో నేల చెమ్మగా వుంది. దాని మధ్యలో చిన్న నీటి గుంట. సన్నగా నీరు ఊరుతూ గుంటగా ఏర్పడింది. బైరిగాడు దగ్గరకు రాగానే నీటిమీద ముసిరిన దోమలు జామ్మున లేచాయి. అంత అడవిలోనూ మరెక్కడా నీటి చుక్క లేదు. చుట్టుపట్ల జంతువులు దాహం తీర్చుకోవడానికి అక్కడికే వచ్చి తీరాలి. గుంట చుట్టూ బైరిగాడు పరిశీలనగా