మా వాకాటి కథల్లో, సూరి గాడు!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
సూర్య ప్రసాద్ మా మెకానికల్ ఇంజనీరింగ్ తరగతి సల్మాన్ ఖాన్. కానీ ఆ ఖాన్ కన్నా మంచి పొడగరి, ఎప్పడూ ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కళ కళ లాడుతూ ఉండేవాడు. వాడి ఆ పిచ్చిని ఎక్కువ చేస్తూ మా భార్గవ్ గాడు, ప్రశాంత గాడు మరియు మా అనీల్గాడులు తరగతిలో వాడి వెనక వరుసలో కూర్చొని, ఏ ఇండియా టుడే మ్యాగజిన్ లాటి వాటిని తెరిచి, వీడు వినేలా అబ్బా! ఈ మోడల్ చూడరా! అచ్చు వీడు మన సూరిగాడిలా వున్నాడురా అని వాళ్లలో వాళ్లే వీడికి కితాబులిచ్చేలా మాటలాడుకోవటం, వాడు ఆ మ్యాగజిన్ లో మోడల్స్ వుండే పేజీలను కత్తిరించుకొని, వాళ్ళలా తయారయ్యి రావటం, మా అందరికీ కడు కాలక్షేపంగాను ఉండేది. రావటం కొడిగినహళ్లి పాఠశాల నుండి రావటంతో చదువుల విషయంలో తెలివితేటలతో పాటు క్రమశిక్షణ కలిగివుండే వాడు. నాకు తెలుసు వాడు ప్రతీ పరీక్షకి కనీసం అరడజను మార్కర్ పెన్స్ తో వచ్చేవాడు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్సామినర్స్ కి హత్తుకునేలా అండర్ లైన్ చేస్తూ, ముత్యాల్లాంటి చేతి రాతతో, అబ్బా! పేపర్ రాయటం అంటే ఇలా వుండాలిరా అనిపించేలా రాసేవాడు. నిత్యం శరీర ధారుడ్యాన్ని పెంచే కసరత్తులతోను మరియు బాస్కెట్ బాల్ ఆటతోను చురుగ్గా ఉండేవాడు. ఉండటం హాస్టల్ లో అయినా అందరు హాస్టల్ వాసుల్లాగే, మా రూమ్ ని తరచూ పావనం చేసేవాడు. నేను మరియు మా శ్రీధర గాడు అందరి వాళ్ళమవటంతో అటు డే స్కాలర్స్ తోను ఇటు హాస్టల్ వాళ్ళ దర్శనాలతో మా రూమ్ నిత్య కళ్ల్యాణం పచ్చ తోరణం లాగ ఉండేది. మీ సాఫ్ట్ వేర్ పరిభాషలో చెప్పాలంటే మా రూమ్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉన్నట్టు మా కాలేజీ మిత్రులకు. అన్నట్టు మా సూరికి ఒక ఏకదారి (వన్ వే కి నా తెనిగింపు ) ప్రేమ కథ ఉండేది. మాకు రెండు సంవత్సరాలు జూనియర్ ఆ అమ్మాయి. చూడ చక్కనిది. మా కళాశాల అందరు విద్యార్థులు లాగే మా సూరి గాడు ఆ అమ్మాయి ప్రేమలో నిండా పడిపోయాడు. ప్రతి గురువారం ఒక తెల్లటి లాల్చీ పైజామా ధరించి మా వాకాటి సాయి బాబా గుడికెళ్ళి, ఓ కొబ్బరికాయ కొట్టి, ఓ ముక్క అమ్మాయికోసం పట్టుకెళ్లి ఒక ముక్కతో మా రూమ్ కి వచ్చే వాడు. మేము తన ప్రేమని ఆటపట్టిస్తూనో లేక తెగ ఎంకరేజ్ చేస్తూనో పరోక్షంగా వాడిలో వాడి ప్రేమ పట్ల చాలా ఘాడమైన భావన కల్పించే వాళ్ళము. ఆ అమ్మాయి మాత్రం ఎవరినీ తన దరిదాపుల్లోకి రానీయటం మేము చూడలా. అలా మా సూరికి మరియు మాకు తెలియని విషయం ఏమిటంటే ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లి అయిపోయిందని, తనకి ఆ విషయం అందరికీ చెప్పుకోవటం ఇష్టం లేక దాచిందని. కానీ ఈ విషయం తెలియక మా సూరి గాడు, ఆ అమ్మాయి తిరస్కారం తో దేవదాసు అయిపోయాడు. వాడు అలా కావడానికి మేము కూడా కారణమే పరోక్షంగా అనే బాధ మాలో ఇప్పటికే వుంది. అయినా మావాడు తన చదువుని ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. ప్రతీ సంవత్సరం డిస్టింక్షన్ తోనే ఉత్తీర్ణుడయ్యాడు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా, మేము కళాశాల నుండి బయటపడిన తర్వాత కొందరం కొద్దిమందితోనే సంబంధ బాంధవ్యాలను కలిగి వున్నాము, అప్పటిలో కొందరికే ల్యాండ్ లైన్ సౌకర్యాలు ఉండటం మూలాన, ఇప్పటిలా చరవాణులు మరియు వాట్సాప్ సమూహాలు లేనందున. అలా సూరిగాడితో మాకు సంబంధాలు తెగిపోయాయి. మా స్నేహితులతో ఎవరికి వాడితో అటుపిమ్మట మాటలు ఉన్నాయో నాకు తెలియదు. మా అనీల్గాడో లేక మా ఈశ్వరుడో చెప్పాలి, ఎందుకంటే మా బ్యాచ్ లో చాలా మంది మధ్య వీళ్లిద్దరి అనుసంధాన కర్తలు. మా కళాశాల ప్రథముడైన మా సుబ్బూ గాడు వాడి రీసెర్చ్ నిమిత్తం ఢిల్లీ వచ్చి అక్కడే వున్న నన్ను కలిసినప్పుడు, సూరి అన్నా యూనివర్సిటీ లో సుబ్బూ ఉండగా, వాడి రూమ్ కి ఎదో ప్రవేశ పరీక్ష నిమిత్తం వచ్చాడని, వచ్చిన వాడు ఏ పరీక్షలకు వెళ్ళక ఊరంతా బలాదూర్ తిరుగుడు తిరిగి సాయంత్రానికి వచ్చే వాడని, మా సుబ్బూ అది చూసి ఓ నాలుగు రోజుల తర్వాత నిలదీయటంతో, "నన్ను సి.బి.ఐ వాళ్ళు వెంట పడి తరుముతున్నారు, వాళ్ళని తప్పించుకు తిరుగుతున్నాను", అని అర్థం పర్థం లేకుండా మాట్లాడాడని, సుబ్బూ మరీ ఎక్కువ ఇబ్బంది పెడితే సుబ్బూ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని, అందుకే సుబ్బు వాడిని మంచి మాటలు చెప్పి ఇంటికి పంపించాడని నాకు చెప్పాడు. అప్పుడు నాకు కలిగింది మా సూరి మానసిక పరిస్థితి మీద సంద