'కొత్త షూసు' - వీ మల్లికార్జున్ గారి 'నల్లగొండ కథలు' నుంచి.
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
ఇప్పుడు మీరు వినబోయ్యే ' కొత్త షూసు' కథ , వీ మల్లికార్జున్ గారు రాసిన 'నల్లగొండ కథలు' పుస్తకం లోనిది. ఇది ఆయన మూడవ కథాసంకలనం.2020 సంవత్సరంలో రిలీస్ అయిన పుస్తకాల్లో, ఇది ఒక ఆణిముత్యం లాంటి పుస్తకం అని మనం చెప్పుకోవచ్చు. ఇరవై ఎనిమిది ఏళ్ల యువ రచయిత మల్లికార్జున్ గారు రాసిన ఈ పుస్తకంలో, 21 కథలున్నాయి. అన్నీ కథలు , నల్లగొండలో గడిపిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ , అతి హృద్యంగా మనకందించినవి.ఈ పుస్తకాన్ని కొనడానికి కావలసిన వివరాలు ఈ లింకులో మీరు చూడొచ్చు. (http://bit.ly/nallagonda-kathalu) కథను మీకందించడానికి అనుమతినిచ్చిన మల్లికార్జున్ గారికి కృతజ్ఞతలు.చిన్నప్పుడు - అంటే చానా చిన్నప్పుడు నాకు రింగుల జుట్టు ఉండేటిదని మా అమ్మ చెప్తది. రింగుల జుట్టంటే అట్లాంటి ఇట్లాంటిది కాదు. పల్లగ ఇంతింత కుచ్చు లెక్క ముఖం నిండ ఉండేటిదంట. ఆబ్కారాయన ఇంటి ముందల ఒరండాల కూసొని ఎర్రటి అంగి మీద, ఇంతింత రింగుల జుట్టేసుకొని దిగిన ఫొటోల మటుకే నేను ఆ రింగుల జుట్టు చూసుకున్న గుర్తు. ఆ ఫొటో జూసి మురుస్తుంటి. చిన్నప్పుడు నాకు మా అమ్మోళ్లు తీశిన ఫొటోలు మూడుంటే అందుల ఇదొకటి. ఈ ఫొటో అటెన్క ఏడ్నో పోయింది. సూసుకుందామన్నా ఆ రింగుల జుట్టు సూస్కుంటానికి లేదిప్పుడు.అయితే ఆ ఫొటోల నాకు నా రింగుల జుట్టుకంటేగూడ, నేను తొడుక్కున్న ఎర్రటి బూట్లు ఎక్కువిష్టం.అవి ఎట్లాంటి షూసంటే కింద పీక ఒకటి ఉంటది. నడుస్తుంటే సౌండ్ చేస్తది. ఉరికినమంటే ఇంగంతే. నేనేసుకున్న ఫస్టు షూసు అదేనని నాకు గుర్తు. దాని తర్వాత స్కూల్లగూడ యూనిఫామ్ ఉండేటిదిగానీ, షూసు ఏస్కోవాలని ఏం లేదు. రబ్బరు చెప్పులే ఏస్కునేది.స్కూల్ కి అట్ల పోతుంటమా, వేరే స్కూలోళ్లని చూశి, ఆళ్లకు షూసుంటే మనగూడ ఉంటే బాగుండె కదా అనుకునేటోడి. ఎందుకో షూసంటే అంత పిచ్చి. . ఇంటికెవలన్న షూసేస్కొని వస్తే అటు దిక్కే చూస్తుండె. షూసేస్కొని ఫొటో దిగినట్లు, స్టయిలు పడ్డట్టు, ఎన్నో కలలు కంటుండేటోడ్ని.నేను పెద్దగయితున్న కొద్దీ కొద్దీ షూస్ పిచ్చి అట్ల పెరుగుతనే వచ్చింది. కొనియ్యమని అడుగుదామంటే భయం. మా సదువులు, తిండికే అప్పులు చేసేటంత పేదరికమాయె. ఏమని అడుగుతం?సినిమాలల్ల హీరోలను చూశి, “ఈళ్లు ఎన్నెన్ని షూసు మారుస్తున్నరో గదా!” అనుకునేటోడ్ని. ఒక్కో సినిమాల హీరో ఎన్ని షూసు ఏసుకున్నడో కూడా లెక్కబెట్టేది."అరెయ్, ఇన్ని షూస్ ఎట్ల కొంటున్నరో” అనుకునేది.అట్ల విచిత్రంగ నా షూసు పిచ్చి పెరుగుతనే ఉన్నదా, ఒకరోజు నేను స్కూల్ నించి ఇంటికొచ్చేసరికి మా నాన్న నాకోసం కొత్త షూసు తెచ్చిచ్చిండు. అయి మల్ల మామూలు షూసా? రన్నింగ్ షూసు.“ఎక్కడియే !” అనడిగిన. “ఎక్కడియయితేందిరా!” అన్నడు. ఏస్కొని చూసిన. కరెక్టుగ సరిపోయినయి. ఆహా! ఆ షూసు నేను ఎన్ని తీర్ల, ఎన్ని పండుగలకి ఏసుకున్ననో చెప్తే గూడ ఒకకథ అయితది. కానీ నేను ఆ షూసు మా నాన్నకి, మా నాన్ననించి నాకు ఎట్ల వచ్చినయో చెప్పాలి. దానికి మళ్లా మా నాన్న కథకాడికే పోవాలి.మా నాన్న ఊర్నించి పారిపోయొచ్చి నల్లగొండల ఆబ్కారాయన దగ్గర చేరిండుగదా! అటెన్క పెండ్లయింది. అమ్మ అదే ఇంట్ల ఆ పని ఈ పని సూస్కుంటుంటే, నాన్న కొండచెల్మ బాయిల నీళ్లు తోడే ఇంకో పని పెట్టుకున్నడు.కొండచెల్మ బాయంటే నల్లగొండల ఎవ్వల్ని అడిగినా చెప్తరు. తేటగ తియ్యగ ఉంటయి నీళ్లు. ఎక్కడెక్కడ్నించో జీపుల క్యాన్లు తెచ్చుకొని తీస్కపోయేటిది.ఆ బాయి నించి నీళ్లు తోడి క్యాన్లల్ల నింపి ఇండ్లల్ల పోసుడు మా నాన్న పని. పెద్ద క్యూ ఉండేటిదంట ఆ నీళ్లకోసం. తెల్లారుజామునే లేశిపోయి బాయికాడ నీళ్లు నింపుకొని సైకిల్ కి కట్టుకొని ఇంటింటికి తిరిగి పోసేటోడు మా నాన్న. అట్లజేస్తే నెలకు ఇంటికి ఇరవై రూపాయలు. రోజుకి రెండు క్యాన్ల నీళ్లు పొయ్యాలి. నల్లగొండల పెద్దపెద్దాళ్ల ఇండ్లల్ల మా నాన్నదే నీళ్లు పోసే పని.ఒకసారి ఎర్రటి ఎండాకాలంల బాయిల నీళ్లు ఎండుకపోయినయి. అడుగు మడుగున ఏవో ఉన్నయంట. లోపలికి దిగితేగానీ నీళ్లు అందవు. కొండచెల్మ బాయికి కొన్ని మెట్లుంటయి. మా నాన్న చిన్నగ ఆ మెట్లమీంచి లోపలికి దిగి నీళ్లు తోడుతున్నడంట. పాకురుబట్టిన మెట్లాయె. దమ్మనిజారి అందుల పడ్డడంట. ఏముంది? తుంటి బొక్క ఇరిగిందన్నరంట.అప్పటికి పెద్దక్క చిన్నది. పెద్దక్కని ఎవలో పాలోలింట్ల ఇడ్నిపెట్టి అమ్మ, నాన్న కల్ని ఓ ముప్పై కిలోమీటర్ల అవతల ఒక కాడ పసరు కట్టు కడ్తరంటే ఆడికి పోయిన్రంట. ఆ ఊరు కనుక్కొని, ఆడ ఉండి కట్టు కట్టిచ్చుకొని మళ్లా నల్లగొండల పడ్తానికి ముప్పు తిప్పలు పడ్డరంట.పసరు కట్టుతోటి ఊళ్ల దిగిండు. కొన్నిరోజులు ఇంట్లనే ఉన్నడుగానీ, పనిజెయ్యకుంట ఉండలేని మనిషాయె, ఇట్లనే నీళ్లు