'నా పేరు సొంబరా ' - మల్లిపురం జగదీష్ గారు

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

హర్షణీయంలో వినబోతున్న కథ శ్రీ మల్లిపురం జగదీష్ గారు రచించిన 'నా పేరు సొంబరా'ఇది వారు రచించిన 'గురి' కథాసంకలనం లోనిది. (ఈ పుస్తకం లభ్యత గురించిన వివరాలు ఇదే వెబ్ పేజీ క్రిందిభాగం లో ఇవ్వబడ్డాయి.)ఏజెన్సీ ప్రాంతాల్లోని జన జీవన సమస్యలపై సాధికారంగా రచనలు చేస్తున్న జగదీశ్వరరావు గారు, విజయనగరం జిల్లాలోని ఒక గిరిజన గ్రామంలో జన్మించి, 'టిక్కబాయి' ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.ఇంతకు మునుపు వారు రాసిన 'సిల కోల' కథాసంకలనంలో కానీ, 'గురి' అనే ఈ కథా సంకలనంలో కానీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన కథల రూపంలో విస్తృతంగా చర్చించడం జరిగింది.ఈ కథ ద్వారా రచయిత , గిరిజనుల జీవితాల్లో వస్తున్న కొన్ని సామాజిక మార్పుల గురించి , వాటి కారణంగా ఉనికిని పూర్తిగా కోల్పోతూ , వారు పడుతున్న వేదన గురించి మన మనసుకు హత్తుకునేలా నివేదిస్తారు.కథ ఆడియో చివరన , జగదీష్ గారు , కథానేపధ్యాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది. హర్షణీయం ద్వారా మీకు తన రచనను అందించడానికి అనుమతినిచ్చి, శ్రోతలకు కథ గురించి వివరించిన జగదీష్ గారికి కృతజ్ఞతలు.* కథలో బోల్డ్ ఫాంట్ లో వున్న పదాలకు , పేజీ చివరన అర్థాలు ఇవ్వడం జరిగింది. నా పేరు సొంబరాకలెక్టరు కార్యాలయం... గ్రీవెన్స్ రోజు. గుంపులు గుంపులుగా జనం. సమస్యలన్నీ సాయం కోరుతూ. వరండా నిండా వరుసల్లో. ఎదురు చెట్ల కింద చెల్లా చెదురుగా ఎవరి ఆతృత లో వాళ్ళు.ఊపిరాడని ఉక్క,  ఒళ్లంతా చెమట, చికాకు. క్షణ క్షణం నాలో అసహనం. ఎవరి మీదో చెప్పుకోలేని కోపం. వరండా చివర టాయిలెట్స్ లో దూరి ముఖమ్మీద నీళ్లు చల్లుకున్నాను. రిలాక్స్ అయ్యాను. ఎదర అద్దం. నన్ను నేను చూసుకున్నాను.వెడల్పాటి ముక్కు, విశాలమైన నుదురు, వంపులు తిరిగిన జుట్టు. నా వయసప్పుడు నాన్న ఇలాగే వుండి వుంటాడు.నాన్న ఇప్పుడు ఉండివుంటే, అన్నదమ్ముల్లా వుండే వాళ్ళం.నేను పుట్టగానే తాత, నాన్నని కౌగిలించుకొని ముద్దులాడేడట.“నిలబెట్టేవురా! జాతి కాపు కాసినోడివనిపించేవురా!!” అని , రెండు ఎడ్లని కొని కానుక గా యిచ్చేడట. పుట్టిన వెంటనే నన్ను చేతుల్లోకి తీసుకొని అడవి వైపు చూపిస్తూ 'ఇదిగో నా రాజు... అడివికే రారాజు" అని గర్వంగా తాతల్నందర్నీ స్మరించుకున్నాడట.నేను పుట్టడం ఇంటికే కాదు, ఊరికే పండుగట. ఎందుకంటే వూరికి పెద్ద అయిన తాత కి పుట్టిన ముగ్గురన్నదమ్ముల్లో అందరికీ ఆడపిల్లలే. చిన్నవాడైన నాన్నకి పుట్టిన ఏకైక మగ సంతానం నేను.నాకు గుర్తొస్తోంది....తాత భుజమ్మీద గుర్రంపండేసుకుంటే తాత వుంగరాల జుట్టు పట్టుకుని నేను రాజునై వీధులన్నీ ఊరేగేను. రెండు చేతుల్లోనూ కిన్నెర పట్టుకుని నన్ను పాటలు పాటలుగా తిప్పేవాడు తాత. అదే భుజాల మీద డప్పు దరువుల్లో కొత్త వూర్లు, కొత్త కొండలూ, వింత వింతల అడవీ చూసేను. ఆ భుజాల మీదే... తాత పెదాల మీద పలికిన పిన్ల కర్ర పాటల్లో ముత్తాతల గొంతులు విన్నాను. మా ఇద్దరి వైభవం చూసి వూరంతా ముచ్చట పడేది.నాకు పేరు పెట్టడానికి ఇంటికి ఆకుల తోరణం కట్టించేరట. ఎజ్జోడిని పిలిపించి ఇంటి దేవత మూల "కానికు” వేయించేరు. దీపం వెలుగులో అమ్మ ఒడిలో వున్న నన్ను తాత ఎత్తుకుని చేటలో బియ్యం నెరుపుతు గుగ్గిలం వేసి ధూపం పట్టేరట. ఎజ్జోడు ముంతలో నీళ్లను చిలకరిస్తూ రాగాలు తీసి దేవతలందరినీ స్మరించేరట. మా వంశం లోని అందరి పేర్లూ గొంతెత్తి పలుకుతున్నాడట. ఒక్కొక్క పేరుకీ ఒక్కొక్క బియ్యం గింజను నీటిలో వేస్తున్నాడట. చుట్టూ మూగిన చుట్టాలు. వూరి వాళ్లూ, బంధువులూ ఆతృతగా ఆ ముంతలోని బియ్యం గింజలు వైపే చూస్తున్నారట. ఏ పేరు పలికినపుడు గింజ నీటిలో మునుగుతుందో అదే నా పేరు.మంగడూ... బారికీ... ఆ లక్కాయీ... సన్నాయీ... సుక్కూ ... సొంబరా...చివరి పేరుకి బియ్యం గింజ నీట మునిగింది. ఒక్కసారిగా ఉల్లల ఉత్సవం... వూరంతా వెలుగు. తాత ఒక్కసారిగా ఎగిరి గెంతేసేడు. వీధుల వెంట నన్నెత్తుకుని ఊరేగించేడు. తుడుం కుండ నడుముకి కట్టి నడిరేయి దాకా వాయిస్తూ... ఏజామునో నిదుర పోయేడట. తాత కంత సంబరం. ఎందుకంటే... నాకు దేవతలిచ్చిన పేరు ఎవరిదో కాదు, మా తాతదే. “నా జాతిని నిలబెడతాడు... నా మనవడు” అనే కన్ను మూసేడు తాత.----------------------------------------------“రాబర్టూ! రాబర్టూ!!” ఎవరో పిలుస్తున్నారు. నన్నే... నన్నే.... నన్నే.నా పిడికిలి బిగుసుకుంది. బలంగా గాల్లోకి చేయి విసిరేను. ఎదురుగా వున్న అద్దం ముక్కలయ్యింది. నా గుండెలాగే.ఇప్పుడు నా పేరు రాబర్ట్ విల్సన్... ఔను రాబర్ట్ విల్సన్.నన్ను నా నుంచి దూరం చేసిన పేరు, నేను నేను కాకుండా పోయిన పేరు. గుండెలోని గాజు పెంకుల్ని కెలుకుతున్న...