అందగాడు, ధవళవర్ణము వాడు, మా పెద్దనాన్న!

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

మా అమ్మకి పెద్ద అక్క నాకు వరసకు పెద్దమ్మని మా ఉప్పలపాడు ప్రక్క గ్రామమైన రామలింగాపురంలో ఇచ్చాము. పెదనాన్నగారు వ్యవసాయదారుడు, మహా అందగాడు. ఆయన, ఎవరక్కడా! అని గంభీర స్వరంతో పిలిస్తే మా పెద్దమ్మ, గజ గజ వణుకుతూ ఎక్కడివక్కడ వదిలేసి పరిగెత్తడం నేను చాలా సార్లు చూసా. ఆలా వణుకుతూనే నాకు ఇద్దరన్నల్ని, ఇద్దరు అక్కల్ని ఇచ్చేసిందావిడ. నేను నాలుగవ తరగతి వరకూ మా ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలోను, ఆరు ఏడు తరగతులు పెదపుత్తేడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదుకున్న. నాకు అంకెలు బాగానే వొచ్చు, ఐదవ తరగతేమయిందనేగా మీ అనుమానం, చాలా ఎక్కువ చదివేసాననుకొని ఐదుని ఎత్తేసి ఆరులో చేరిపోయా. అది నాకు బాగా ఉపయోగ పడిందబ్బా! ఏడో  తరగతి వరకూ, సరిగ్గా చదవక పోయినా, వీడు బుడ్డోడులే అని మా అయ్యోర్లు, ఒంగో బెట్టి గుద్దకుండా. పెదపుత్తేడు మా వూరికి, పొలాల్లో అడ్డం పడిపోతే ఓ మూడు కిలోమీటర్లు, ఈ రెండూర్ల నడిమాయిన రామలింగాపురం. పొలాల్లో బడికి  పోయేటప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి మీదుగా వెళ్ళేవాళ్ళం. వాళ్ళు ఊర్లో వుండే వాళ్ళు కాదు, పొలాల్లో వుండే వాళ్ళు. అందుకే మా పెదనాయన వాళ్ళ ఇల్లు ఎక్కడా అని రామలింగాపురం వచ్చి మీరు అడిగారనుకో బీట్లో అంటారు. బీట్లో అంటే బీడు భూముల్లో అని అర్థం. అలా బడికి వస్తూ పోతూ, మధ్యలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో దాహం తీర్చుకోవడానికి ఆగుతూ, మా పెదనాయనని ఆసక్తి గా గమనించే వాడిని. ఆయన మాకు పెద్ద పులి లాగే కనపడే వాడు. బడినుండి ఇంటికి వెళ్లే క్రమంలో, వాళ్ళ ఇంట్లో ఆగినప్పుడు, ఎవరక్కడా! చిన్నోడు వచ్చాడు వాడికేమన్న తినటానికి పెట్టారా?, అని ఆయన అనగానే,  పరిగెత్తు కొచ్చేవాళ్ళు మా పెద్దమ్మ కానీ చిన్నక్క కానీ. నాకనుమానం వచ్చేది ఆ మాత్రం వాళ్లకు తట్టదా, లేక మా పెదనాన్న ఆజ్ఞ లేనిదే చీమ కూడా చిటుక్కు మనదా అని. ఆయన బట్ట నలక్కుండా, వొళ్ళు అలవకుండా, దర్జాగా రెండు పూటలా కోళ్లు, పొట్టేళ్లు, చేపల విందులతో జీవితాన్ని నడిపేసేవాడు. పొలాల మీద ఆదాయాలు తక్కువ, దర్జాలు ఎక్కువ వలన ఆస్తులు కరగటం మొదలయ్యాయి. కానీ ఇంట్లో మాత్రం మిలటరీ క్రమ శిక్షణ. ఉదాహరణకి  వాళ్ళ ఇల్లంతా ఇల్లంతా జామ చెట్లు దానిమ్మ చెట్లు, కానీ అవి పండి రాలే వరకూ తాక రాదు. మనకేమో పిందె కాయల్ని చూస్తేనే చేతులకు దురద. అప్పటికీ చేతివాటం చూపే వాడిని. ఆయనేమో మరలా నేను కనపడినప్పుడు, ఎరా చిన్నోడా! మొన్న నువ్వొచ్చి పోయాక నాలుగు పిందెలు కనపడ లేదురా అనే వాడు. ఆయన చందమామ కథలన్నీ వేటికవి విడిగా తీసి స్వయంగా దబ్బళముతో కుట్టి పుస్తకాలుగా చేసేవాడు. నేను ఆదివారం మా ఇంట్లో సద్దికూడు తిని, వాళ్ళింటికెళ్లి సాయంత్రం దాకా వీరహనుమాన్, బేతాళకథలు, జ్వాలాద్వీపం, విచిత్ర కవలలు అన్నీ చదువుకుని, ఇంటి దారి పట్టేవాడిని. చదుకునేంత సేపు మంచం పక్కన రెండు కుక్కలు తిరుగుతూ ఉండేవి, ఒంటి కెళ్లాలన్నా భయంతో పెదమ్మని తోడు పిలవాల్సిందే. మా వ్యవసాయ కుటుంబాలలో చదువులు మొదలయ్యింది మాతోనే. మా అన్నలిద్దరికి పెద్దగా చదువులు అబ్బలా. వ్యవసాయం మీద రాబడులు లేవు, మా పెద్ద నాయన ఖర్చులకి పొలాలు కరుగుతున్నాయి. ఈ కరిగే క్రమంలోనే పెద్ద అక్కకి మరియు ఇద్దరు అన్నలకీ పెళ్లిళ్లు అయ్యాయి. మా పెద్ద అన్న భార్య చనిపోవటం తో, ఆయన కొడుకుని మా పెద్దమ్మే పెంచి పెద్ద చేసింది. వాడు, మా పెద్దమ్మ పెద్దకూతురు కూతురు, మా అక్క మరియు నేను ఆరవ తరగతి నుండి సహాధ్యాయులము. నా చదువు ఓ పదిమంది దగ్గర బంధువుల పిల్లలు సహాధ్యాయులుగా జరగటం చాలా తీపి అనుబంధం. క్రమంగా ఆస్తులు కరిగిస్తున్నాడని పెదనాన్న మీద కోపం కొడుకులకి. తండ్రీ కొడుకుల మధ్య సయోధ్య లోపించింది. విడి పడ్డారు, మిగిలిన కొద్ది ఆస్తులు పంచుకున్నారు. ఒకరికొకరి మధ్య సంబంధాలు అస్సలకి లేవు, చూపులు కూడా లేవు. నాలుగేళ్ల క్రితం మా పెద్దమ్మ పెద్ద కొడుకు చనిపోయాడు. కొడుకుని ఆఖరి చూపు చూడడానికి, దశ దిన కర్మలకి కూడా మా పెద్ద నాన్న రాలేదు. దశ దిన కర్మల అనంతరం మా పెద్దమ్మని ఆత్మకూరు బస్సు స్టాండ్ లో దింపి, అడిగాను రామలింగాపురానికే కదా? అని. కాదురా! మధ్యలో రాజు పాలెం లో దిగి అక్కడ చిన్న పని చూసుకొని ఆటోలో వెళతానురా అంది. చిన్నగా నిట్టూర్చి అడిగా, వస్తూ వస్తూ పెదనాన్న చేపలు తెమ్మన్నాడా అని. ఆ గాజు కళ్ళల్లో నాకు అవుననే సమాధానం దొరికింది. ఓ సంవత్సరం క్రితం పెదనాన్న కూడా  పోయారు. కొరివి పెట్టడానికి మా అన్న అంటే ఆయన చిన్న కొడుక్కి పదివేలిప్పిస్తామని చెప్పి ఒప్పించారు ఆ వూరి పెద్ద మనుషులు.