రావిశాస్త్రి గారి 'వర్షం'
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
హర్షణీయానికి స్వాగతం.“ రచయిత ప్రతివాడు, తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో , ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను.” ఈ మాటలన్నది తెలుగు కథారచయితల్లో అగ్రగణ్యుడుగా కొనియాడబడే శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు.కవిత్వంలో శ్రీశ్రీ గారు చేసిన పని, కథల్లో రావిశాస్త్రి గారు చేశారని, 1993 లో ఆయన మరణించినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక తన సంపాదకీయంలో రాసింది.తన రచనలకు ప్రదానం చేసిన ‘సాహిత్య అకాడమీ’ పురస్కారాన్ని, ఆంధ్రా యూనివర్సిటీ వారి ‘ కళాప్రపూర్ణ’ బిరుదుని ఆయన తిరస్కరించడం గూడ జరిగింది.ఇప్పుడు మీరు వినబోయే ‘ వర్షం ‘ ఆయన రచించిన అనేక అత్యుత్తమ కథలలో ఒకటి. ఈ కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి, తన అనుమతిని ఇవ్వడమే కాక, ఆడియో రూపంలో రావడానికి ఎంతో సహకరించిన శ్రీ రాచకొండ ఉమాకుమార శాస్త్రి గారికి , మా కృతజ్ఞతలు.ఈ కథ అరసం వారు ప్రచురించిన, రావిశాస్త్రి గారి కథాసంకలనంలోనిది.ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు వెబ్ పేజీ చివరలో అందించడం జరిగింది.వర్షం: వర్షం దబాయించి జబర్దస్తీ చేస్తోంది. సాయంకాలం అవుతోంది. మబ్బులవల్ల, మామూలుకంటె, చీకటి ఎక్కువగా వుంది. రోడ్డుపక్క కమ్మలపాక - టీ దుకాణంలోచీకటి చికాగ్గా వుంది. అడివిపాలెంనుంచి వచ్చి తన దుకాణంలో చిక్కుకుపోయిన సిటీ బాబుని ఉద్దేశించి,“మూడ్రోజులక్కాని ఒగ్గ దీ ఒరసం” అన్నాడు దుకాణం తాత. ఒగ్గితే సెవి కదపాయిస్తానన్నాడు. బల్లమీద దిగులుబడి కూర్చుండిపోయేడు, సిటీబాబు అనబడే పురుషోత్తం. “టేసన్ కి కదు బాబూ ఎళ్ళాలన్నావు?” ఆకాశం మెరుపుతో చీల్చుకొంది. “అవును” “అబ్బో! ఎక్కడ, రొండుకోసులుందే!" అన్నాడు దుకాణం తాత. పిడుగు పడ్డట్టుగా ఉరిమింది. “ఏఁవిఁటీ?" “రొండుకోసు లుందయ్యా బాబూ! బొగ్గులకోసం కుట్టోణ్ని అక్కడికే తగిల్నాను. సదువుకోనేదుగాని నాకేరికే. రెండుకోసులుంది” అది రెండువేల మైళ్ళ దూరం అన్నట్టుగా చెప్పేడు దుకాణం తాత.“బస్సు దొరకదా?” అని హీనస్వరంతో అడిగేడు పురుషోత్తం.“ఈ ఒరసంలో బస్సు రాగల్గా? ఎర్రటి నీకు - ఉత్తప్పుడేరాదు. మా కుర్రాడు నడిసే ఎళ్ళేడు. " పురుషోత్తానికి కొంచెం గాభరా వేసింది. అత్యవసరమైన పనిమీద అతను కలకత్తా వెళ్ళవలసి వుంది. మూడు రోజుల లోపల అక్కడికి వెళ్ళాలీ అంటే మరో రెండుగంటల్లో అతను స్టేషన్ చేరుకోవాలి. బస్సు రాదట. బళ్ళు కనిపించవు. వర్షం చూస్తే పెను ప్రళయంలా ఉంది.“నేను కలకత్తా వెళ్ళాలే" అన్నాడు పురుషోత్తం “ఏ వూరూ?” “అబ్బో! శానా దూరఁవేఁ! అక్కడి కెళ్ళాలా నువ్వు?” “అవును” అన్నాడు పురుషోత్తం. “ఎళ్ళలేవు” చాలా ఖచ్చితంగా చెప్పేడు దుకాణంతాత. దిగులుపడి కూర్చుండిపోయేడు పురుషోత్తం. కత్తుల్లా మెరుపులు మెరుస్తున్నాయి. కొండలు బద్దలయినట్టు ఉరుములు ఉరుముతున్నాయి. శివాలెత్తి గాలి పరిగెడుతోంది. పగపట్టినట్టుగా వర్షం తెగపడుతోంది. చీకటి పట్టినపాకలో.... కొత్త పంట్లాం, కొత్త చొక్కా కొత్త జోళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఆ మూడు పురుషోత్తం వేసుకున్నాడు. అతన్ని బాగా చూడాలీ అంటే దీపం వెలిగించి చూడాలి. అతను చక్కనివాడా? ఒప్పుకొనేవాళ్ళు తక్కువ. అతని నడుం మాత్రం చక్కగా సన్నగా ఉంటుంది అతను సింహమధ్యముడే కాని సింహంలా ఉండడు. అతని పదిహేనోయేట “ఇరవయ్యేళ్ళుండవా?" అని చాలామంది అనుకొనేవారు. దుకాణం తాతని ఆ సమయంలో అడిగితే “నలభై దగ్గిరుండవా" అని అడగ్గలడు. పురుషోత్తం పాతిక సంవత్సరాల క్రితం పుట్టాడన్న సంగతి, ఆ పుట్టుక తెలిసిన వాళ్ళకి తప్ప మరొకరికి తెలియదు. అతను ఎదగని పడ్డలా వుండిపోయేడు.*******************ఆ సమయంలో ఆ దుకాణంలో దూరేందుకు అతగాడు ఆ ముందు రోజు బయల్దేరేడు. పయనమవడం కలకత్తాకనే పయనమయేడు. అంతలో అతని మేనమామ గాలీ ధూళిలా వచ్చిపడ్డాడు. ఆ మేనమామ అందరికీ ఉచితంగా సలహా లివ్వగలడు; అవలీలగా పనులు పురమాయించగలడు. అతగాడు వచ్చిపడి “నీకు పెళ్ళి కావాలనే సంగతి నీకేమైనా తెలుసా?” అని పురుషోత్తాన్ని ప్రశ్నించి టకాయించేడు. టకాయించి "వెళ్ళు వెళ్ళు మంచిది, వయసుది, డబ్బుది. అడివిపాలెంలో మున్సబుకూతురుంది,పిల్లని చూసేసి అలా కలకత్తా వెళ్ళిపోవచ్చు. వెళ్ళు వెళ్ళు వెళ్ళి చూడు” అని మేనల్లుణ్ణి వెంట తరిమేడు. దాన్తో చేతిలో పెదసంచీ వట్టుకొని అడివిపాలెంలో బంధువులింట్లో ప్రత్యక్షమై సాయంకాలం మున్సబుగారింట్లో కొత్త బట్టల్తో పెళ్ళికూతురి ముందు ప్రత్యక్షమయేడు పురుషోత్తం, ఆ పిల్ల తన చూపుతో అతనికొక చిక్కు ప్రశ్న వేసింది.“మునసబు"గారిది పాతకాలపు పెంకుటిల్లు, లోపల వరండాల్లో చాపమీద కూర్చోబెట్టేరు పెళ్ళికుమార్తెని. ఆ పిల్ల మఠం