నాది కాదు కానీ, మా అనీల్గాడి సోది!

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

ఎక్కడో మారు మూల పల్లెలో పుట్టాను. ఏకోపాధ్యాయ లేక ఆ పూటకి ఉపాధ్యాయుని రాక దైవాధీనాలు అనేలా వుండే ప్రాధమిక పాఠశాలలో పలకల మీద అక్షరాలూ దిద్దాను, నోటి లెక్కలు నేర్చాను, నాలుగవ తరగతి లోనో లేక ఆపై తరగతులలోనో ఆంగ్ల అక్షరమాలలు నేర్చుకున్నాను. అన్నీ పలకల మీదే, పుస్తకాల మీద రాయటమన్నదే ఎరుగను ఆరవ తరగతి వరకు. వానా కాలం చదువులంటారు ఎందుకో తెలియదు కానీ మా నావీ అట్టివే అనవచ్చు. అదేదో మేము అప్పటికే పొడిచేసి ఇంకా నవీన చదువులు చదవాలన్నట్టు మా బ్యాచ్ తోనే సిలబస్ మారటం మొదలవ్వటం మూలాన టెక్స్ట్ బుక్స్ అన్నీ ఆరు నెలల తర్వాతే లభ్యమయ్యేవి. కొనే స్తోమతు లేకనో లేక ఇక ఇంకో ఆరునెలలు కోసం కొనటం ఎందుకనో, నేనైతే టెక్స్ట్ బుక్ మొహం చూసి ఎరుగనబ్బా. మా అయ్యోర్లు ఏ నోట్స్ చెబితే అదే నాకు మార్గదర్శనం. అందుకే ఇప్పటికీ ఏదన్న టెక్నికల్ పుస్తకం చదవాలన్న అదేదో బ్రహ్మ విద్య లాగ మనస్సులో ఓ భయం. నా వల్ల కానే కాదబ్బా అనే అంతర్వాణి బలంగా వెనక్కి లాగుతుంది. లెక్కలు కూడా బట్టీయమే నేను. మిగతా సబ్జెక్టులు పరవాలేదు గాని, నాకు బడిలో లెక్కల రావు అని పేరు. రావు అంటే రావనే అర్థం. అలా లెక్కలంటే ఒక మానసిక భయం పెంచుకున్నా నేను. మా ముందు బ్యాచ్ వాళ్లకి ఎనిమిదో తరగతి నుండి లెక్కల్లో రెండు ఆప్షన్స్ ఉండేవి , ఒకటి కంపోజిట్ అని రెండోది జనరల్ అని. లెక్కల్లో మా శ్రీధర్గాడిలా వుండే మేధావులంతా కంపోజిట్ తీసుకొనే వారు, నా బోటి బట్టీయమ్ గాళ్ళంతా జనరల్ తీసుకొనే వాళ్ళు. నేను కూడా ఫిక్స్ అయిపోయా జనరల్ తీసేసుకుందామని. కానీ మన అకాడెమీ వాళ్ళు ఇలా లెక్కల్ని రెండు విధాలుగా డిస్క్రిమినేట్ చేయరాదని నిశ్చయించి రెండిటినీ కలిపి కలగూర గంప చేసి నా లాటి వాళ్లకు లెక్కల్ని ఓ జీవన్మరణ సమస్య చేసిపారేసారు. లెక్కలంటే ఇంత భయపడే నేను సామాన్య శాస్త్రము మరియు భౌతిక శాస్త్రము లాటి విషయాల్లో చురుకుగానే వుండే వాడిని. ఇప్పటికీ మైటోకాండ్రియా, హైడ్రా గమనము లాటివి పటము సహాయముతో వివరించగలను, ఏ మూలకముల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమిటో ఇప్పటికీ చెప్పగలను అబ్బా. పదవ తరగతి గట్టెక్కగానే వెళ్లి నా అన్నీ లెక్కల పుస్తకాలు కిలోల లెక్కన మా అంగటాయనకి తూకం కింద అమ్మేసి , ఆయన రెండు రూపాయలు తక్కువిచ్చినా గీకి బేరమాడకుండా, ఆ డబ్బుల్తో సినిమాకి కూడా వెళ్ళొచ్చా. అలాగే మన నెల్లూరు వి.ఆర్.కాలేజీ వాళ్ళిచ్చే ప్రవేశ పత్రం తెచ్చుకున్న బై .పి .సి కి. ప్రవేశ పత్రానికి మా నాయన సంతకం పెట్టలా అప్పట్లో. ఎంసెట్ లో 500 లోపలే ర్యాంకు రావాలి ఎం.బి.బి.ఎస్ లో సీట్ కావాలంటే, అదే ఇంజనీరింగ్ అయితే ఏ ఐదు వేలొచ్చినా పర్వాలేదు అనే అవగాహన ప్రతీ నాయనలకుంది ఆ రోజుల్లో. నేను బతిమాలా మా నాయన్ని , ఆయన కరగాలా. వెళ్లి మళ్ళి నాకు మరియు మా అక్కకి ఎం.పీ.సి ప్రవేశ పత్రం తెచ్చుకున్న. అక్కడ దొరికాడు మా అనీల్హాడు నా సహాధ్యాయుడిగా. మా వీ.ఆర్. కాలేజి చాలా ప్రజాతంత్య్ర కళాశాల. తరగతులెప్పుడూ జరగవు. భౌతిక శస్త్ర తరగతులకు హాజరైతే చాలు ప్రాక్టీకల్స్ కి రానిస్తారు, మిగతా క్లాసులన్నీ ఎగ్గొట్టొచ్చు. అప్పుడు నెల్లూరు ఎంసెట్ కోచింగ్ కి చాలా ప్రసిద్ధి. కోరా , నారాయణ , అమీరుద్దీన్ , ఆదిత్య , రత్నం లాటి కోచింగ్ సెంటర్స్ అన్నీ కోచింగ్ తీసుకొనే విద్యార్థులతో కిట కిట లాడుతూ ఉండేది. అలా మేము తంతే వెళ్లి కోరా లో పడ్డాము. బాగా చదువుకొనే వాళ్ళు చదువుకున్నారు , నేను-మా అనీల్గాడు మరికొంత గాంగ్ చదువుని చట్టుబండలు చేసి రోజుకో ముప్పై గంటలు క్రికెట్ ఆడేవాళ్ళము. ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి వాడు పాసయ్యాడు, నేను లెక్కల్లోనే తప్పాను. మొత్తానికి 150 మార్కులకు గాను నాకు 44 వచ్చాయి. మా అనీల్గాడు పాసైపోయాడు. గుడ్డిలో మెల్ల నాకు ఎంసెట్లో 3047 రాంక్ రావటంతో మా వాళ్లంతా బిడ్డ బాగా చదివాడమ్మా!, ఆ పేపర్లు దిద్దినవాడి చెయ్యి పడిపోను, అని వాడిని తిట్టుకున్నారు, నన్ను నమ్మేశారు. మనం కూడా మొహం దీనంగా పెట్టుకొని ప్రపంచమే నన్ను ముంచేసినట్టు కొన్నాళ్ళు జీవించేశాను. మా అనీల్గాడేమో నా వల్లే వాడి ఎంసెట్ రాంక్ దొబ్బిందని, నా దగ్గరుంటే మళ్ళీ దొబ్బద్దని తలచి, నన్ను ఒంటరిని చేసి, వాళ్ళ నంద్యాల వెళ్ళిపోయాడు, ఎంసెట్ కాదు దాని జేజెమ్మ ఐ.ఐ.టి కొడతానని శపధం చేసి మరీ. సరే బాగుపడే వాడినెవరూ చెడగొట్టలేరని వాడినొదిలేసా. నేను కూడా నా సెప్టెంబర్ ప్రిపరేషన్ లో పడిపోయా, మా కాలంలో ఇప్పటిలా ఇన్స్టంట్ ఎగ్జామ్స్ లేవు మరీ. నా సప్లిమెంటరీ పరీక్ష అయ్యింది , పాపం ఈసారి దిడ్డినోడి చెయ్యి మా వాళ్ళ నోట్లో పడి పడిపోకూడదనేమో నాకు 150 కి 144 మార్కులు వచ్చాయి. నేను కూడా మా వాళ్ళ ఇళ్ళకందరికీ వెళ్లి, పోయిన సారి దిద్దినోడు ఎడమ పక్కన ఒకటెయ్యటం మర్చిపోయాడని ప్రకటించ