ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి కృతజ్ఞతలు. పుస్తకం కొనడానికి - *************ఇంకా తెల్లవారలేదు.శీతాకాలం మంచు బాగా కురుస్తోంది. సముద్రపొడ్డునే వున్న ఆ పొడుగురోడ్డు నిర్మానుష్యంగా వుందనే చెప్పాలి. ఒకవేళ ఎవరైనా వున్నారేమో? ఆ మంచుతెరల్లోంచి మాత్రం ఎవరూ కనబడడంలేదు. చలికి జడిసే కాబోలు పక్షులు కూడా ఇంకా గూళ్ళు వదిలి రావడంలేదు. సముద్రపు హోరునికూడా ఆ మంచు మింగేసినట్టుంది; ఆ పక్కని సముద్రమే లేనట్టుంది. స్టీమర్లలో దీపాలు కాబోలు ఏవో ఆకాశదీపాల్లాగా మసక మసకగా కనబడుతున్నాయి. రోడ్డుకి రెండోవైపు ఇళ్లున్నాయి. గాని పొగమంచుతో కప్పడిపోయేయి. తెల్లారగట్ట లేచి చదువుకొనే కుర్రాళ్ళ గదుల్లో దీపాలు కాబోలు అక్కడక్కడా కనబడీ కనబడనట్టు కనబడుతున్నాయి.మంచుని చీల్చుకొంటూ ఎవరో ఇద్దరు మనుషులు వస్తున్నారు. వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనబడకపోయినా - వాళ్ళలో ఒకరు లావుగాను, మరొకరు అంతలావుగా లేనట్టూ కనబడుతున్నారు. అంత లావుకాని ఆయనచేతిలో వాకింగ్ స్టిక్ వుంది. దాన్ని మహా జోరుగా ఊపుతూ నడుస్తున్నాడతను. లావుగా వున్నాయన నోట్లో పైపొకటి వుంది. నోట్లో వుంచుకొనే ఏదో మాట్లాడుతున్నాడతను. ఇద్దరూ నెమ్మదిగానే నడుస్తున్నా లావుపాటాయన కొంచెం ఈడుస్తూ నడుస్తున్నట్టూ, రెండో ఆయన ట్రిమ్ గా నడవడానికి ప్రయత్నిస్తున్నట్టూ ఉంది. వాళ్ళిద్దరూ తలలకి మఫ్లర్లు చుట్టుకొన్నారు చలికోట్లు వేసుకున్నారు. కాళ్ళకి బూట్లు తొడుక్కున్నారు.వారిద్దరిలోనూ పైపు పట్టుకొన్నాయన యూనివర్సిటీలో అదేదో శాస్త్రంలో అసిస్టెంటు ప్రొఫెసరు. వాకింగ్ స్టిక్ పట్టుకొన్నాయన అదే యూనివర్శిటీలో మరేదో శాస్త్రంలో ప్రొఫెసరు.“మేష్టారూ!" అన్నాడు అసిస్టెంటు ప్రొఫెసరు “రష్యాలో కూడా చలి విపరీతంగా ఉంటుంది, గానండి, అదంతా అదోరకం బ్యూటీసార్, నేను అక్కడ కూడా అప్పుడప్పుడు మార్నింగ్ వాక్ కి వెళ్ళేవాణ్ణిలెండి... కోటుజేబులో చిన్న వోడ్కా బాటిల్ పడేసుకొని" అంటూ పైపు చేత్తో పట్టుకొని, బడబడ నవ్వేడతను.ప్రొఫెసరు ఏం మాట్లాడలేదు. ఆయన రష్యా వెళ్ళలేదు గాని, అమెరికా వెళ్ళేడు. అతను చిన్నప్పట్నించీ జబ్బు మనిషి. అమెరికాలో వున్నన్నాళ్ళూ హాస్పిటల్లోనే వున్నాడు. మంచుతెరలూ, మోణింగ్ వాకులూ అతనెరుగడు. తన అనారోగ్యం గురించి అతనెప్పుడూ చికాకుపడుతూనే వుంటాడు. అందుకే ఏం మాటాడలేదు.ఆయన మౌనాన్ని అర్థం చేసుకొన్నట్టున్నాడు, టాపిక్ మార్చేడు అసిస్టెంటు ప్రొఫెసరు. అసిస్టెంటు ప్రొఫెసరు పేరు ఎమ్.మారుతీరావు ఎమ్మెమ్ రావంటారు. స్టూడెంట్ సర్కిల్సులో మొద్దు మాస్టారనీ, ఏమేమీ రావనీ' ముద్దు పేర్లున్నాయతనికి.హెల్తుకి యోగాసనాలు మంచివి మేష్టారూ!... ఈ వయసులో యోగాసనాలేం చేస్తాంలెండి కాని, మోడింగ్ వాక్ ఫఱవాలేదు. మీకెందుకు, ఇలాగ నాలుగు రోజులు మీరు నాతో రండి. అయిదోరోజు మీరే వచ్చి నన్ను పిలుస్తారు” అన్నాడు మళ్ళీ దడదడ నవ్వుతూ,ప్రొఫెసరు క్లుప్తంగా “వూc" అని వూరుకొన్నాడు.ఆయన పేరు ప్రొఫెసర్ జె.గోవర్ధన గిరిధారి. ప్రొఫెసర్ జె.జీ.ధార్ అంటారు. జబ్బు గురుడు". ఆయన రహస్య నామం.కొంతసేపు ఏమీ మాట్లాడకుండానే నడవసాగేరు వాళ్ళిద్దరూ. ఈ ఇద్దరి మధ్యా చాలాకాలం నించి మంచి స్నేహం వుంది. వాళ్ళ స్నేహానికి ఒక కారణం - ఇదే ముఖ్యమైన కారణమని కొందరు అంటారనుకోండి - వాళ్ళిద్దరిదీ ఒకటే కులం అవడం - అదీ కాకుండా 'మరో విషయంలో కూడా ఇద్దరిదీ ఒకే "కులం". ఉన్నత విద్యకోసం యూనివర్సిటీ ఖర్చుమీద ' విదేశాలకి వెళ్ళి, ఉన్న విద్యతోనే తిరిగొచ్చేరు. ఇద్దరూ.. |చదువుకొనే రోజుల్లో (అంటే విద్యార్థి దశలో) తనశాస్త్రాన్ని మారుతీరావు ఎన్నడూ (సరిగా) చదువుకోలేదు. ట్యూటరయేకా చదవలేదు. లెక్చరయేక అంతకన్నా లేదు. ప్రొఫెసరయేక అసలులేదు. అతను కొద్దిరోజుల్లోనే ప్రొఫెసరయే అవకాశం వుంది. అవగలనన్న నమ్మకం కూడా అతనికి వుండేది నిన్నమొన్నటి దాకా....