బుడ్డ వెంకన్న, మళ్ళీ పుట్టాడు!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
బుడ్డ వెంకన్న పచ్చని మేని ఛాయతో, గిరజాల జుత్తుతో, ఆరడుగులకన్నా ఎక్కువ ఎత్తు వున్న భావం అధికమైన వాడై, కొంచెం వొంగినట్టుండి, ఉప్పలపాటి చుట్టూ పక్కల వూర్లకన్నిటికీ అందగాడు. ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు కలిగిన వాడు. పల్లెల్లో వ్యవసాయదారుల ఇళ్లల్లో కొందరే చదువుకోగలుగుతారు, కొందరు వయవసాయప్పనులు ఒంట బట్టించుకుంటారు, మరి కొందరు, యీ రెండూ చేయరు. ఈ బుడ్డ వెంకన్న మూడవ కోవకి చెందిన వాడు. ఊరందరికీ బుడ్డ వెంకన్న అంత మంచి వాడులేడు, చేయని సహాయం లేదు, సహాయం పొందని వాడు లేడు. ఇంట్లో మాత్రం అందరికీ భయమే. అమ్మకి గారాబంతో పాటు కొడుకుని చూస్తే ఒణుకు కూడా, భోజనంలో కూర బాగా లేక పోతే పళ్లెం ఎగిరి ఎక్కడో పడాల్సిందే. ఆయన ఎంత అంటే అంత, ఏదడిగితే అది. అలాటి బుడ్డ వెంకన్నకి వాళ్ళ మేనమామ తన పిల్లనిచ్చి పెళ్లి చేసాడు. ఎందుకు చేసుకున్నాడో ఈయనకి తెలియదు, ఎందుకిచ్చారో వాళ్లకు తెలియదు, ఈయన సంగతి తెల్సి ఆ మహాతల్లి ఎలా చేసుకుందో ఆ పరమేశ్వరుడి కూడా తెలియదు. ఇద్దరి ఇళ్ళు ఎదురెదురుగానే. ఈయన తాగి రావటం, అది నచ్చని ఆవిడ ఎదురుగా వున్న అమ్మగారింటికి పయనమవటం, ఈయన ఆ మత్తులో వాళ్ళింటి మీద దండయాత్ర చేయటం, ఆవిడకి సోదరులైన ఇద్దరు సుందోపసుందులు ఈయన్ని క్రుంగతన్నటం. ఇదంతా చూసి వాళ్ళ అమ్మ కృంగిపోవటం, మత్తువొదిలిన ఈయన వెళ్లి తన బావమరుదుల్ని తన్నటం. ఇదే నిత్యకృత్యం. ఉప్పలపాటి గ్రామస్థులకు వినోదానికి కొదవే లేదు వీళ్ళ వ్యవహారంతో. ఈ గందరగోళం లోనే బుడ్డ వెంకన్న ఇద్దరు పిల్లల్ని కూడా కనేసాడు. ఆ పిల్లలంటే వాళ్ళ నాయనమ్మకు మహా ఇష్టం, అలాగే చిన్న మేనత్త, అంటే బుడ్డ వెంకన్న చిన్న చెల్లెలికి కూడా. ఈ చిన్న మేనత్త ఎప్పుడూ ఆ పిల్లల అమ్మ పక్షమే ఎందుకంటే వాళ్ళ అమ్మ, ఈ చిన్నమేనత్త , చిన్న నాటి స్నేహితురాళ్ళు. తన అన్ననే తప్పు పట్టేది ఈ చిన్నమేనత్త. ఓ రోజు బుడ్డ వెంకన్న పక్కూర్లో ఇచ్చిన తన అక్క ఇంటికెళ్ళాడు. రాక రాక వచ్చిన తమ్ముడిని చూసి అక్క మురిసిపోయింది. తమ్ముడికి ఇష్టమని చేపలు తెప్పించింది, ఇంట్లో వున్న నాటుకోడితో ఇగురు వండింది, వడలు చేసింది. కడుపు నిండా అన్నం పెట్టింది, కాసేపు పడుకోరా! అని తన పనిలో పడిపోయింది ఆవిడ. ఓ గంట తర్వాత బుడ్డ వెంకన్న వచ్చి చెప్పాడు ప్రశాంతంగా, అక్క! అంత అయిపోయింది నేను పురుగుల మందు తాగేసాను అని. అక్క లబ లబ లాడిపోతూ ట్రాక్టర్ కట్టించింది రాజుపాళేనికి, దారిలోనే పోయాడు బుడ్డ వెంకన్న, అసలే అంతంత మాత్రపు సంబంధాలు, ఈ దెబ్బతో పూర్తిగా పోయాయి. పిల్లకాయల చిన్నమేనత్త వాళ్ళని వొదులుకోలేదు. వాళ్ళ ఇంటికి పోవటం మానలేదు. మిగిలిన అక్కలకీ, అన్నకీ ఇది చాలా మనసు కష్టం. ఈవిడని చాలా ఆపాలని చూసారు, కానీ ఈవిడ చాలా మొండి, ఆ పిల్లలని దగ్గరకి తీయటం మానలేదు, చూసి చూసి ఇక అక్కలు అన్న, ఈవిడకి వాళ్ళతో సంబంధాలు మానెయ్యమని చెప్పటం మానేశారు. ఆ బుడ్డ వెంకన్న పిల్లలు వాళ్ళ అమ్మమ్మ గారింట్లోనే పెరిగారు, నాన్నమ్మ-తాతయ్యలంటే ద్వేషం, కానీ ఏదన్న పొలమో-పుట్రో లేక ఏదన్న స్థలమో కావాలనుకుంటే మాత్రం మేము తండ్రి లేని బిడ్డలమంటూ వచ్చి సాధించుకునే వాళ్ళు. క్రమంగా పిల్లలు పెద్దలయ్యే క్రమం లో మిగతా మేనత్తల పిల్లలతో కలవటం మొదలెట్టారు వాళ్ళు. సంబంధాలు మెరుగుపడ్డా, అంతర్లీనంగా, బేధ భావం పూర్తిగా పోలేదు, పిల్లల మధ్య. వాళ్ళ నాన్న తమ్ముడు వాళ్ళకే కాదు వాళ్ళ మేనత్తలకి కూడా దూరమయ్యి ఆయన బ్రతుకు ఆయన బతికేస్తున్నాడు. ఈ క్రమంలో బుడ్డ వెంకన్న తలితండ్రులు కూడా గతించారు. బుడ్డ వెంకన్న కూతురేమో చాలా పెద్ద చదువులు చదివి, ప్రేమ వివాహం చేసుకుంది ఇతర కులస్థుడిని. పెళ్ళైన రెండు ఏళ్ళకి ఆ పెళ్లి విఫలమయ్యింది అందరికీ బాధను మిగులుస్తూ. తనకో కొడుకు, తన అమ్మని దగ్గర పెట్టుకొని ఉద్యోగం చేసుకుంటూ కొడుకుని చదివిచ్చుకుంటూ బతికేస్తుంది. ఇక బుడ్డ వెంకన్న కొడుకు టెక్నికల్ చదువు చదివి, ఒక కేంద్రీయ సంస్థలో వుద్యోగం చేస్తున్నాడు. ఆయనకీ పెళ్లయ్యింది, ఇద్దరు పిల్లలు ఆయనకి. ఒంటరి ఐన అక్కకి, ఎప్పుడో ఒంటరి ఐన అమ్మకి ఎంతో అండగా వుండవలిసిన ఆయన అస్సలు వాళ్ళ ఊసు ఎత్తడు. మనం అనుకుంటాము కళ్ల ముందర పరిస్థితులను బట్టి మనం గుణ పాఠం నేర్చుకుంటాము అని. అది ఎప్పుడో, ఎక్కడో చాలా అరుదు. చాల మందిమి అదే చట్రంలో పడిపోతాము, ఎందుకు యీ మాట అంటున్నానంటే, బుడ్డ వెంకన్న ఎలానో కొడుకు కూడా అలానే ప్రస్తుతం. విషాదమేమంటే బుడ్డ వెంకన్న జీవితాన్ని దగ్గరగా చూసి, తన పిల్లలకి ఆయన అలవాటులు రాకూడని ఎన్నో దేవుళ్ళకు మొక్కుకుంది వాళ్ళ చెల్లె