జన జీవన స్రవంతి
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
జన జీవన స్రవంతి :చీకటి ఊరిని, నెమ్మదిగా కమ్ముకోడం కనిపిస్తోంది, కిటికీలోంచి చూస్తే. దూరాన కనపడే మావిడి తోటల వెనకాల్నించీ సూర్యుడు ఎవరో తరుముతున్నట్టు హడావిడిగా కిందికి దిగిపోతున్నాడు . చదూతున్న పాత ఆంధ్రభూమి మూసి పక్కన పడేసా నేను . మిద్దె మీద గదిలో కూర్చోనున్నా. అమ్మమ్మ వాళ్ళ వూరు, పమిడిపాడు కొచ్చి రెండు రోజులైంది. ఎంసెట్ రాసి రిసల్ట్ కోసం వెయిటింగ్. పన్నెండు మైళ్ళు పమిడిపాడు గుంటూరుకి. మా అమ్మ ఏకైక తమ్ముడు, గంగాధరం మావ, ఆయన భార్య రాజత్త , అమ్మమ్మ వుంటారు ఇక్కడ. నేను వొచ్చిన రోజు సాయంకాలం నించీ మావ క్షణం తీరిక లేకుండా వున్నాడుమామూలుగా ఇంటి పట్టున ఎపుడూ ఉండని గంగాధరం మావ, ఇల్లు వదట్లేదు. ఎదురింటి రాజా రావు గారు , ఇంకా మా వీధిలో వుండే కొన్ని పెద్ద తలకాయలూ , వచ్చి పొద్దున్నించీ రాత్రి దాకా మంతనాలు, ముందు హాల్లో కూర్చోని, మావతో. నన్నేమో ఈ రూములో పడేసారు, ఓ బండెడు పుస్తకాలూ , ఒక ట్రాన్సిస్టరూ ఇచ్చి. అప్పుడప్పుడు రాజత్త వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్తుంది. టిఫిన్ , భోజనానికి పడుకోడానికి మాత్రమే కిందికి. కిటికీ లోంచి, కిందికి వీధిలోకి చూసా. వీధి అంతా నిర్మానుష్యం. మామూలుగా అయితే ఈ పాటికి వీధి అంతా సందడి సందడి గా ఉండాల. పొలాలకు పొయ్యినోళ్లూ వెనక్కొస్తూ. పైనున్న శాతవాహనుల కాలం నాటి ఫ్యాను గూడ నెమ్మదిగా తిరుగుతోంది. బైట గాలి గూడ బిగుసుకొపొయ్యింది. జైల్లో ఉన్నట్టుంది .ఊరికొచ్చినప్పట్నుంచీ ఇదే పరిస్థితి. ఇల్లు దాటనివ్వట్లేదు ఎవ్వరూ. నాకేమో ఏదోరకంగా బయటికెళ్లి వెంకటి గాణ్ణి కలవాలనుంది. వెంకటి గాడు మూడో క్లాసు దాకా నాతో చదివి , స్కూలు మానేసాడు. పొలం పనులకు పోతాడు. చెర్వు అవతల వుండే గుడిసెల్లో ఉంటాడు వెంకటి గాడు, గంగాధరం మావ పాలేరు ఓబులేసు, ఉండేది కూడా అదే గుడిసెల్లో. ఐదు దాకా ఇదే వూళ్ళో, అమ్మమ్మ దగ్గరుండి చదూకున్నా నేను. వూళ్ళో వున్న ఒకే స్కూల్లో . పమిడిపాడు లో నేనూ, వెంకటిగాడూ కలసి చెయ్యని కోతి పన్లు అంటూ లేవు. గంగాధరం మావకి పెళ్ళై పదిహేనేళ్ళు అయ్యినా ఇంకా పిల్లలు లేరు. ఆయనకి చదువు పెద్ద అబ్బలేదు. సావాసాలు ఎక్కువ. ఎవరినో ఒకరిని వేసుకోని వారంలో రెండురోజులు గుంటూరు పొయ్యిరాందే మనిషి నిలవలేడు. పొలాలన్నీ కౌలు కి ఇచ్చేసాడు. రెండెకరాల మావిడి తోట తప్ప. మామిడి తోట చూసుకునే ఓబులేసు, గంగాధరం మావకి కుడిభుజం. వారానికోసారి చీట్ల పేక ఆడుకోడానికి తప్ప తోటగ్గూడా పోడు, గంగాధరం మావ. ఎవడికి గుంటూర్లో పనున్నా , వాడ్ని తన బైకు ఎక్కించుకొని గుంటూరు తీసుకోబోతూంటాడు. ఆయన బైకు, టికెట్ లేని ఓ మినీ టౌన్ బస్సు, వూళ్ళో జనాలకి. రాజత్త, అమ్మమ్మ కు అన్ని పనులలో చేదోడు వాదోడు. అమ్మమ్మ అంటూ ఉంటుంది, మీ అమ్మ పక్కన లేని లోటు లేదురా నాకు అని రాజత్త గురించి. ఇది గాక రాజత్త పుస్తకాల పురుగు. గంగాధరం మావ గుంటూరెళ్లిన ప్రతీ సారి పుస్తకాలూ కొనుక్కొస్తాడు. ఇంట్లో పన్లయ్యాక వాటిల్లో మునిగిపోతుంది. ఇంట్లో ఉంటే, నేను గూడ అత్త వెనకాలే. అత్త చదివే పుస్తకాల గురించీ మాటలే మాటలు.ఉన్నట్టుండి కర కర మని మూల్గుతూ, ఫ్యాన్ ఆగిపోయింది. గది బయటకొచ్చి అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగడం మొదలుపెట్టా, వరండాలోంచీ మాటల శబ్దం. రాజత్త , గంగాధరం మావ గొంతులు.తడుముకుంటూ వంటింట్లోకి వచ్చి చూసా. అమ్మమ్మ గూడ కనపళ్ళేదు. అంతా చీకటి. వంటింటిలోంచి పెరట్లోకి తలుపు తెరిచి ఉండడం, కుంపటి వెలుగులో కనపడింది. చిన్నగా పెరట్లోకి వచ్చి పిట్ట గోడ ఎక్కి దూకేసా. *********************************************వీధిలో రెండడుగులు వెయ్యంగానే, కరంటు వచ్చినట్టుంది, రోడ్డు మీద అక్కడక్కడా విసిరేసినట్టుండే వీధి దీపాలు వెలగడం మొదలుపెట్టాయి. వడి వడి గా అడుగులేసుకుంటూ చెరువు అవతల గుడిసెల దగ్గరికి చేరుకున్నా. ఇంటి ముందర మట్టి అరుగుమీద కూర్చొని, లాంతరు సరిచేస్తూ కనపడ్డాడు వెంకటి గాడు. వాడు చూడకుండా , దగ్గరిగా పొయ్యి “ వెంకటీ !” అని అరిచా నేను. దడఁచుకొని వెనక్కి తిరిగాడు వెంకటి. నన్ను చూడంగానే వాడి మొహం లో ఒక వెలుగు వెలిగింది. మరు క్షణంలో వెలుగు ఆవిరై పొయ్యి భయం బయటికి రావడం...