అర్థాంతర ప్రయాణాలు.
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
అమ్మ పొట్టలోనే ఇంకొన్ని రోజులు హాయిగా వుందామనుకున్న నన్ను, అలా ఉండటం కుదరదు అంటూ ఫోర్సెప్స్ లాటి పరికరాలు వాడి మరీ ఈ లోకం లోకి తీసుకొచ్చారు అమ్మ తో పని చేసే సహ డాక్టర్లు.కళ్ళముందు, హాస్పిటల్ లో వాడే టూల్స్ కనిపించీ కనిపించక, శబ్దాలు వినిపించీ వినిపించక నా అయోమయంలో నేను ఉంటే, ఏవో మాటలు కూడా, "వీడు తెల్లగా బొద్దుగా భలేగున్నాడు అంటూ".అలా ఓ నాలుగు చేతులు మారాక, "ఇంకా ఎన్ని చేతులు మారాలి రా నాయనా అనుకుంటూ, ఉన్న పళాన నాలుగు ఆవులింతలు అరువు తెచ్చేసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నా".ముప్పావు వంతు నిద్ర, పావు వంతు మెలుకువ, మెలకువలో అమ్మ స్పర్శ, అమ్మ గొంతు కోసం వెతుక్కునే నన్ను, పెద్దైయ్యాక ఏమైతాడో వీడు అని అమ్మా నాన్నతో పాటు అందరూ అనుకుని అన్నప్రాసన మొదలెట్టేసి, ఏవో బుక్కు, పెన్ను, బంగారు గొలుసు లాంటివి ముందర పెట్టారు ఆ రోజున,కానీ చూసేవాళ్ళని సంభ్రమాశ్చర్యాలలో ముంచుతూ, వాటిలోంచి ఓ చిన్ని కత్తిని పట్టుకుని అప్పటికప్పుడే వీరులమైపోయాం. కానీ బహుశా అక్కడే నా ఫ్యూచర్ కు నాంది పడిందేమో, పనిముట్ల తో ముడిపడి వుండే వృత్తి తో! రాజ్యాలు, వాటినేలే రాజులు అప్పటికే అంతరించి పోవటం తో.అందుకు తగ్గట్టే, చిన్నప్పుటి నుండి ఇంట్లో ఉండే స్పాన్సర్, హ్యామర్, టెస్టర్ లాంటివి నన్ను తెగ ఆకర్షించి వాటితో ఆడుకోవాలనిపించేది. అవన్నీ మా నాన్న చిన్న చిన్న పనులకోసం వాడేవారు. అవి ఎలా వాడాలి అని మా నాన్నను విసిగిస్తూ గమనిస్తూ, ఛాన్స్ దొరికితే అవి ఎలా వాడాలో కాస్త తెలుసుకున్నా.ఇక ఆ విజ్ఞాన రస గుళిక, మన బుర్రలో పనిచేయడం మొదలెట్టి, మా నాన్న ప్రేమతో కొనిచ్చిన సైకిల్ మొత్తం విప్పేసి, తిరిగి ఎన్ని సార్లు బిగించినా బోల్డెన్ని నట్లు, బోల్టులు మిగిలిపోతూ ఉండటంతో, మెకానిక్ వచ్చి బిగించేవాడు. ఒక విషయం తెలుసుకోడానికి, అది నాన్న నాకు ఫ్రీడంతో ఇచ్చిన అవకాశం అనుకుంటా!! అదే ఇంకాస్త ముందుకెళ్ళి మెకానికల్ ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా కలిగించిందేమో!అమ్మ డాక్టరుగా, నాన్న ఇంజినీరుగా పని చేస్తూ, నేను, చెల్లెలుస్కూలుకు వెళ్ళొస్తూ మా ఇల్లంతా తెగ హడావిడిగా ఉండేది. ఇంత జరుగుతున్నా మద్యలో మధ్యలో మన ప్రయోగాలు మనవే కదా!!ఓసారి అమ్మ అడిగింది, "పెద్దయ్యాక ఏమౌతావురా" అని.ఠక్కున మన సమాధానం, "డ్రైవర్ అవుతా"!!కాసేపు ఓ భయంకరమైన నిశబ్దం. అమ్మకు మన రుచులు, అభిరుచుల సంగతి తెలియదు కదా పాపం. నన్నదోలా చూస్తూ ఏదో అనుకుంటూ వెళ్ళిపోయింది.నాకు అత్యంత ఇష్టమైన బస్సు ప్రయాణంలో ఎప్పుడూ ఓ స్పెషల్ సీటు రెడీ. అదే డ్రైవర్ పక్కనే ఉన్న ఇంజిన్ బానెట్. అది ఎలా ఉన్నా సరే, డ్రైవింగ్ గమనిస్తూ కాస్త ఆయన బుర్ర తింటూ మనక్కావలసిన విషయాలు రాబడుతూంటే కొన్న టిక్కెట్టుకు పూర్తి న్యాయం చేసినట్లే. అలా బోనెట్ మీద కూర్చొని అద్దం లోంచి సుదూరాన తారు రోడ్ మీద ఏర్పడే ఎండమావులను చూడటం గొప్ప అనుభూతి.నాన్నలో కాస్త నిశబ్దత, గంభీరత ఎక్కువ. అది పని ఒత్తిడి వల్ల అని తాతయ్య చెప్పేవాడు. నాన్నకు మంచి మూడ్ ఉంది అనే గుడ్డి గుర్తు , ఇంట్లో ఘంటసాల గారి పాట వినిపిస్తే , నాన్న చక్కటి గొంతుతో పాడుతుంటే, ఆ టైమ్ లో ఎవరూ ఆయన్ని డిస్ట్రబ్ చేసే వాళ్ళం కాదు. అది అమ్మ పెట్టిన రూల్.స్కూల్లో నా చదువులు టాప్ క్లాస్ కాక పోయినా, ఇంట్లో ఏ రోజూ ఇబ్బంది రాలేదు. స్కూల్లో మేం ఓ ముగ్గురం బాగా ఫ్రెండ్స్. మమ్మల్ని అమర్ అక్బర్ ఆంటోని అనేవారు తక్కిన వాళ్ళు. పేర్లకు తగ్గట్టుగా మాది ఓ సర్వమతసమ్మేళణం. ఒకరి లంచ్ బాక్స్ ఇంకోడిది. మాలోని ఆంటోని గాడు ఇప్పుడెక్కడికెళ్ళిపొయ్యాడో!!చిన్నప్పుడు నన్ను బాగా వేధించిన విషయం అంటే మా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే ఇంట్లో లేకపోవడం. గవర్నమెంట్ ఉద్యోగులుగా అమ్మా నాన్న చాలా ఊళ్ళు తిరుగుతూ మా ఇద్దర్ని, చెరీ ఒకరు పంచుకుని చదివించేవారు.తాతయ్యను అడిగితే నిజాయితీకి శిక్ష అనే వాడు. అర్థం అయ్యేది కాదు. నా ప్రయాణ పదనిసలు ఇంకొంచెం ముదిరి, హాస్టల్ లో ఉండాల్సొచ్చో , లేక టౌన్ పక్క పల్లెలో బంధువులతో ఉంటూ, రోజూ బస్సులో వచ్చి , స్కూల్ బస్సు పట్టుకుని తిరిగి, మళ్ళీ పల్లె బస్సులో ఇల్లు చేరాల్సొచ్చేది.కానీ ఆ తిరిగే శిక్ష , మెల్లగా నన్ను బస్సు మీద ప్రేమకు దూరం చేయడం మొదలెట్టింది.నేను పదో తరగతిలో ఉన్నప్పుడు తాతయ్య అన్న మాటలు అర్ధమైన రోజు రానే వచ్చింది. నాన్న పనిచేసే కరెంటు సబ్ స్టేషన్, క్వార్టర్స్ అన్నీ కలిపి కాలనీలోనే ఉండేవి. ఆఫీసు ఇల్లు పక్కపక్కనే ఉండేవి. పనుల కోసం చాలా మంది రాకపోకలు సాగేవి. అలా రాజకీయ నాయకులు కూడా వచ్చి కాస్త కఠినంగా మాట్లాడితే నాన్న వాళ్ళను గెటౌట్ అనడం, తోటి ఆఫీసర్లు నాన్నకు సపోర్టు చేయడం, జీపు డ్రైవర్ వాళ్ళకి సర్దిచెప్పడం ఇలా రభస అయ్యింది.రికమెండేషన్ పద్దతిలో వాళ్ళ పని కావాలనడం, నాన్న రూల్స్ మాట్లాడటంతో గొడవ. ఇక మళ్ళీ ట్రాన్స్ఫర్...