మా శ్రీధర గాడు! ఓ మంచి స్నేహితుడు!
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
నేను ఇంతకుముందే చెప్పా, నావి ఎలాటి వానాకాలం చదువులో, ఇంటర్మీడియట్ ఎలా చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా గట్టెక్కానో, ఎంసెట్ లో ఎలా ఓ పెద్ద రాంక్ సాధించుకొని వాకాడు ఇంజనీరింగ్ కాలేజీలో పడ్డానో. ఈ పరిచయ వాక్యాలు చదవగానే మా గిరిగాడు యధావిధిగా విరుచుకు పడతాడు, నీ దొక బయోగ్రఫీ, అది ఇంతకు ముందు అందరూ చదివేసి ఉంటారన్న నీ ఎదవ అభిప్రాయమూ అని. వాడలాగే అంటూ ఉంటాడు, నేనిలాగే రాసి పారేస్తుంటా. ఇక్కడో రహస్యముంది, అబ్బా! నా పేరు వీడు కథలో వాడేసాడు అనే తృప్తితో వాడు ఈ కథని తక్కువ విమర్శిస్తాడు అన్నది నా ఎదవ అభిప్రాయము. కానీ ఈ కథ చదివి వాడు, చాలా భయం భయం గా రాసినట్టున్నావురా అనెక్కడ అనేస్తాడో నని నా భయం. అవి నేను ఇంజనీరింగ్ చేరిన తొలి రోజులు. మా అనీల్గాడు మరియు నేను ఈ నాలుగు సంవత్సరాలు మాతో గడపబోయే మాబోటి దుర్లక్షణాలు మరియు మా తరంగ దైర్గ్యములు జత కలిసే మిత్రుల కోసం వెతుక్కుంటున్నాము. ముందే చెప్పాను కదా, మా వోడు హాస్టల్ మీద నేను ఊరి మీద పడ్డామని. మా వోడు అప్పటికే మావ!, నాకు ప్రశాంత్, భార్గవ్, జగ్గు, కోట మొదలగు వారు తెగ నచ్చేశారు అని అప్పటికే ప్రకటించేశాడు, నేను వెనకబడిపోయా మా వాడితో పోల్చుకుంటే. నాకూ అప్పటికే ఓ రూమ్ మేట్ దొరికాడు సుబ్రహ్మణ్యం అని, కానీ వాడు నాకు ఈ రెండు మూడు వారాల్లోనే అస్సలకి మనిషి అన్నవాడు ఇంతలా చదువుతాడా అనే సందేహం కలిగించేశాడు. వాడి చదువు తీరు మరియు వాడి క్రమశిక్షణా నాకు కడు దుర్లభంగా వున్నాయి. నాకు మిత్రుడయ్యే లక్షణాలు వాడిలో అస్సలకి లేవు అని అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసా. ఆ రోజు మేము మొదటి సారిగా మెకానికల్ వర్క్ షాప్ కి వెళ్ళాము. మమ్మల్ని మూడు బ్యాచ్ లుగా విభజించారు. బ్లాక్ స్మితి, టిన్ స్మీతి మరియు వుడ్ కార్పెంటరీ బ్యాచ్ లుగా. ఇదేందిరా నాయనా నాలుగేళ్ళయ్యాక యీ పనులే చేసుకుంటా బతకాలా అని చతురోక్తులు వేసుకుంటూ ఎవరి స్థానాలకు వాళ్ళం వెళ్ళాము. నాది బ్లాక్ స్మితీ బ్యాచ్. నాతో వచ్చిన పక్కనున్న పిల్లగాడు కొంచెం పల్లెటూరు నుండి వచ్చిన వాడై కనపడటంతో మనకలవాటైన పట్టణపు అతి తెలివితో, నువ్వు కింద కుప్పలా పడున్న బొగ్గుల్ని ఎత్తుకొని కొలిమిలో వేస్తూ వుండు, నేను ఈ పొడవాటి టాంగ్స్ తో వర్క్ పీస్ ని కాలుస్తూ ఉంటా అని చెప్పా. ఆ పిల్లగాడు నన్ను పైనుండి కిందవరకూ ఓ మారు చూసి, పోరా! అదేదో నువ్వే ఆ బొగ్గులేరుకో, నీ చేతులే మసి జేసుకో అని గదమాయించాడు. అప్పుడు ఇంకా గమనించా వాడిని, మనిషి మహా చురుగ్గా వున్నాడు, ముందు రెండు పళ్ళు చివర్ల విరగ్గొట్టుకొని వున్నాడు, మహా తులిపి తనానికి నిదర్శనంగా, నాకర్థమైయింది వీడు ఒకడికి చెప్పే వాడే కానీ వేరే వాడు చెప్తే వినేరకం కాడని, వెంటనే బుద్ధిగా వాడు చెప్పినట్టే చేశా. అలా నన్ను మొదటి రోజే ఏరా, పోరా అని, వాడి పెత్తనం కిందకు తెచ్చేసుకొని నన్ను ఇప్పటికీ ఆడేసుకొనే వాడే మా శ్రీధరగాడు. ర్యాగింగ్ టైం లోనే మహాధైర్యంగా తిరిగేవాడు, ఎందుకంటే వాడు లోకల్. కాలేజీ కి నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళ వూరు. వారంలోపలే మనం వాళ్ళ ఊరిని సందర్శించటం, వాళ్ళ కుటుంబ సభ్తులను మరియు బంధువులను వాడు ఏ-ఏ వరుసలతో పిలుస్తాడో మనమూ అలానే పిలిచెయ్యటం, అలాగే వాడు మా నెల్లూరుని సందర్శించటం, నేను మా వాళ్ళను ఏ వరుసలతో పిలుస్తానో వాడూ పిలిచెయ్యటం లాటి చర్యలతో మా స్నేహం బర్తృహరి చెప్పినట్టు సజ్జనుల స్నేహం ఉదయపు ఎండలా ఎలా పెరిగిపోతుందో అలా పెరిగి పోయింది. మొదటి సంవత్సరం వాడు వాళ్ళ వూరునుండి ఒక బుడ్డ బులుగు సైకిల్ లో వచ్చేవాడు, రెండవ సంవత్సరం నుండి వాడు నేను ఒక రూమ్ కి మారిపోయాము. వాడు లోకల్ అవటం నాకు చాలా సౌఖ్యంగా ఉండేది. వారంలో ఒక రోజు వాళ్ళ ఇంటినుండి ఇద్దరికీ పిలుపు వచ్చేసేది, ఏ చేపల కూరో, లేక ఏదైనా స్పెషల్ చేసినప్పుడో. వెళ్ళేసి కుమ్మేసి రావటమే. వారానికోసారి వాడి బట్టలన్నీ వూరికెళ్ళిపోయి నీట్ గా ఉతకబడి, గంజి పెట్టబడి, ఇస్త్రీ చేయబడి పర పరలాడుతూ వచ్చేవి. వాడి చొక్కాలు నేను వేసుకొని పూలరంగడి లా తిరుగుతూ ఉంటే, కుళ్లుకొని మా గోపీ గాడు, ఏరా వాడివి చొక్కాలేనా లేక అండర్ వేర్ లు కూడా వాడేస్తావా అని ఏడిచేసే వాడు. వీడు టెక్స్ట్ బుక్ లు బాగా కొనేవాడు కానీ ఇద్దరం వాటిని ఏమాత్రం నలగనిచ్చే వాళ్ళం కాదు. సంవత్సరమంతా బలాదూర్ తిరుగుళ్ళు తిరిగి పరీక్షల ముందర మాత్రం తెగ నైట్ అవుట్ లు చేసే వాళ్ళము. వచ్చే సంవత్సరం నుండి ఎప్పటి పాఠాలన్నీఅప్పుడే చదివెయ్యాలని ఒట్లు పెట్టుకొనే వాళ్ళం. కానీ షరా మామూలే. ఇక నిశ్చయించుకున్నాం మనదంతా వ