'మనిషి లోపలి విధ్వంసం' - అల్లం రాజయ్య గారు
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
గత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోపలి విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు.ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3scvsxPగత నలభై ఏళ్ల పైబడి రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న అల్లం రాజయ్య గారు తెలుగులో మనకున్న అత్యుత్తమ కథా రచయితల్లో ఒకరు. ఆయన రాసిన ‘మనిషి లోని విధ్వంసం’ ఇప్పుడు మీరు వినబోయే కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అల్లం రాజయ్య గారికి కృతజ్ఞతలు.ఈ కథ వారి కథా సంపుటి, ‘ అతడు’ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3scvsxPఅదొక చిన్నరైల్వే స్టేషన్. ఆ స్టేషన్ భవనాలు నైజాం కాలంలో కట్టినవి. ఈ ఏడు వానాకాలంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలవల్ల స్టేషన్ భవనం, గోడలు పెచ్చులూడిపోయాయి. భవనం పైనుండి కారిననీటి ధారల మూలంగా గోడల మీద చారికలు ఏర్పడినాయి. రైల్వే స్టేషను కుడిఎడమల పాతిన సిమెంట్ పోల్స్, కట్టిన ఫెన్సింగు వైరు అక్కడక్కడ విరిగి పోయాయి. ఆ స్టేషన్లోకి వచ్చే ప్రయాణీకులు పోయే ప్రయాణీకులు సాధారణంగా స్టేషన్ ద్వారం నుండి కాక విరిగిన సిమెంట్ పోల్స్ ఫెన్సింగు నుంచే నడుస్తారు.రైల్వే స్టేషన్ వెనుకవైపు, స్టేషన్ కట్టినప్పుడే కట్టిన క్వార్టర్లలో నాలుగు కూలిపోయి ఉన్నాయి. మిగతా క్వార్టర్లలో రైల్వేగ్యాంగు వాళ్లు తప్ప బుక్కింగు క్లర్కుగాని స్టేషన్మస్టరు గాని ఉండటం లేదు. వాళ్ళు దాదాపు అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో గల ఓ మాదిరి పట్నం నుంచీ రోజూ వస్తారు.రైల్వే స్టేషను దక్షిణాన నీలగిరి చెట్లు పెరిగి ఉన్నాయి. నీలగిరి చెట్ల కింద ఆకులుపడి ఆ స్థలమంతా తెల్లగా మెరుస్తున్నది. స్టేషన్‌కు ఎదురుగా పసిరిక చెట్లు, వేపచెట్లు, తుమ్మచెట్లు పెరిగి ఉన్నాయి. ఆ చెట్లకింద రైలు పట్టాలకు ఆవలి వైపున ‘తాటికల్లు’ కుండల్లో నురుగు వస్తుండగా నలుగురు గౌండ్ల వాళ్ళు గిరాకి లేక దిగాలు పడి కూర్చున్నారు. వాళ్ళకు కొంచెం దూరంలో పసుపుపచ్చ ప్లాస్టిక్ ట్రేలో సారా ప్యాకెట్లు పెట్టుకొని పేడి మూతి ఉపేంద్ర కూర్చున్నాడు.పొద్దున తయారుచేసిన ‘మిరపకాయ బజ్జీలు’ చల్లారిపోగా షేక్ దావూద్ గొణుగుతున్నాడు.వేపచెట్టు కింద కాల్చిన మొక్కజొన్న కంకులు పెట్టుకొని ముగ్గురు పల్లెటూరి ఆడవాళ్ళు ఒకరినొకరుతిట్టుకుంటున్నారు.పరికి పండ్లు అమ్మే ముసలవ్వ ఎందుకో విచారంగా కూర్చున్నది.ఆ చెట్ల కింద దుమ్ములో కూర్చుండలేక, అలాగని ఎంతో సేపు నిలబడలేక ఒక కుటుంబం దిక్కులు చూస్తున్నది.“అట్ల పోయి రైలెప్పుడు కాలవడ్తదో తెలుసక రాపోరాదు!” భార్య భర్త మీద విసుక్కున్నది. భార్య పేరు గంగమ్మ. ఆమె గులాబిరంగు పాలిస్టర్ చీర కట్టుకున్నది. చెవులకు బంగారు జూకాలున్నాయి. కాళ్ళకు పట్ట గొలుసులు, వెండి మట్టెలున్నాయి. భర్త రాయేశం తన అంగీజేబులో చెయ్యి పెట్టి, భార్యకేసి చూసి వంకర నవ్వు నవ్వాడు.రాయేశం తెల్లటి పాలిస్టర్ కమీజు తొడిగి ధోవతి కట్టుకొన్నాడు. కాళ్ళకు సింగరేణి బొగ్గుగని బూట్లు వేసుకున్నాడు. మెడకు మఫ్లర్, ఎడమచేతికి గడియారమున్నది. .“అమ్మా పరికి పండ్లే!” వారిద్దరి పదేండ్ల కొడుకు అడిగాడు. “మీ బాపు నడుగుపో” గంగమ్మ పిల్లవాడ్ని కసిరింది. రాయేశం వంకర నవ్వుకు గంగమ్మ ఎలాంటి అడ్డంకి చెప్పకపోయేసరికి ఉపేంద్రం దగ్గరికి నడిచి “ఎంతకోబత్త (సారా ప్యాకెటు) పిలడా?” అడిగాడు.“మీ కాలేరు (కాలరీ) లెంత?” ఉపేంద్రం. “మా బొగ్గుబాయిల కాడ అమ్మినట్టే అమ్ముతానవా?” “ఈడ అంతరేటు కమ్ముతె బొక్కలిరువరా?” ఒక గౌండ్లాయన కోపంగా అన్నాడు. “ఎవలు?” రాయేశం. “ఇంకెవలు పాముకోరలిరిసినోళ్ళే” ఇంకో గౌండ్లాయన. పాము కోరలిరిసినోల్లెవరో రాయేశం అడుగలేదు. వాళ్లు చెప్పలేదు. “రెండున్నర” ఉపేంద్రం.“లావు సస్తనే ఉన్నది. మా వూల్లే సార మావులా పట్టిన కొత్తల నాలుగు రూపాయలన్నరు. లొల్లయి నంక గిప్పుడు గిదేధర”.“మీ వూల్లేంది ఈ సుట్టు పక్క అన్ని ఊళ్ళల్లగిదే ధర – ఈసారి మావుల (కంట్రాక్ట్) పట్టినోడు మన్నై పోయిండనుకో.”“మా కాలేరుమీద దోసుకుంటండ్లు – ఆడ బత్తకు అయిదు రూపాయలు” రాయేశం. రెండు సారా ప్యాకెట్లు తీసుకొని ఒకటి కట్టుక్కున కొరికి నోట్లో పోసుకొని ఇంకొకటి జేబులో వేసుకున్నాడు. అయిదు రూపాయల నోటు తీసి ఇచ్చాడు.ఆ వాసన తనకే వచ్చినట్లుగా ఒక అంగన్‌వాడి టీచరమ్మ అటేపు జరిగింది.ఒక ముసలమ్మ చెవుల గంటీలు ఊగుతుండగా...