'జెన్' - పతంజలి శాస్త్రి గారు
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
రిటైరై, కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. చుట్టూ వుండే ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా, చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ, జీవించడాన్ని ఇష్టపడతారు. ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన కొడుకు కృష్ణ , తన జీవితంలో వుండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక , తన భార్యను కూడా వాటి గాటన కట్టేసే మనిషి.కథలోవుండే ఇంకో ముఖ్యపాత్ర ‘అమ్మతల్లి’ - స్నేహితుడు పనికి రాదని పారేస్తూంటే నాయుడుగారు అతన్ని ఆపి తన ఇంటికి తెచ్చుకున్న, పాడుబడ్డ ఒక మెషీను.చెప్పదల్చుకున్న విషయాన్ని పాఠకుడికి చేరవేయడానికి , ఒక శిల్పాన్ని చెక్కినట్టు కథను చెక్కుతూ మెల్లగా పాఠకుణ్ణి తనకు కావలసిన ఆవరణంలోకి తీసుకువెళతారు, శాస్త్రిగారు. నా కథలన్నీ అనుభూతి ప్రధానమైనవి, కథ నుంచి ఏమి తెల్సుకోవాలో, పాఠకుడే అలోచించి అందిపుచ్చుకోవాలి అంటారు ఆయన. పతంజలి శాస్త్రి గారు రాసిన అనేక గొప్ప కథల్లో ఇప్పుడు మీరు వినబోతున్న ‘జెన్’ ఒకటి. హర్షణీయం టీం తరఫున ఆయనకు డెబ్భై ఐదవ జన్మ దిన శుభాకాంక్షలు . Happy Birthday Sir.హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)‘జెన్’ :గేటు ముందర స్కూటరు భయంకరంగా పొరబోయి దగ్గుతోంది. కిక్ కొట్టే కొద్దీ పొడి దగ్గే తప్ప ప్రాణం పోసుకుంటున్న జాడలేదు. కృష్ణ మొహం చెమటతో తడిసిపోయింది. తన భార్యని మానభంగం చేసిన దుర్మార్గుడిలా కనిపించింది స్కూటరు. ఆఖరిసారి కసి కొద్దీ కిక్ కొట్టి, దగ్గి ఆగిపోయిన వాహనాన్ని, అదే వేగంతో ఓ తాపు తన్ని నాలుగు బూతులు తిట్టాడతను.“నీడలోకి రండి” గేటు వెనక నిలబడి అంది అతని భార్య, డాబానీడ ఆమె మీద పడుతోంది. మొహం తుడుచుకుంటూ ఆమె పక్కన నించున్నాడు కృష్ణ. స్కూటర్ని చంపేయాలనిపించిందతనికి.“ఛీ ఎదవ స్కూటరు. సరిగ్గా టైముకు పెంట పెట్టింది. పది రూపాయలక్కూడా ఎవడూ తీసుకోడు.” తరువాత స్కూటరు శీలం గురించి అతని అభిప్రాయం వెలిబుచ్చాడు.సరళ కొంచెం సిగ్గుపడి నవ్వుతూ అంది “చీ. మామయ్యగారు వింటారు”"వింటే విన్నీ, మధ్యలో నీకేం? ఆఫీసుకెళ్ళేదినువ్వా? నేనా? దరిద్రం. నా కంటే ఎదవ ఎవడూ దొరక్క నాకమ్మాడు. నాకీ చండాలం పట్టింది""కృష్ణ ఇంకా వెళ్లలేదా?" భుజం మీది తువాలుతో కళ్లజోడు తుడుచుకుంటూ గేటు దగ్గరకొచ్చాడు నాయుడుగారు."స్టార్టవట్లేదండి” పక్కకి తొలుగుతూ చెప్పింది సరళ.కొడుకు వైపు చూశారు నాయుడుగారు. ఆగ్రహంతో స్కూటర్నే చూస్తూ మాట్లాడలేదు కృష్ణ. గేటు తోసుకొని బయటికొచ్చి గూడకట్టు చుడుతూ వాహనం దగ్గరికి వెళ్లారాయన.“ఎండ్లో మీరెందుకు. మీ వల్లకాదు. నే చూస్తాలేండి.”ఆగమన్నట్టు చెయ్యి చూసింది. స్కూటరు కింద చెయ్యి పెట్టి చూశారు నాయుడుగారు. ట్యూబు సరిచేసి పైకి లేస్తూ కొడుకు వైపు చూసి నవ్వారు.“ఓవర్ ఫ్లో. చూసుకోలేదేవీ?". ఆశ్చర్యపోయాడు కృష్ణ. దగ్గరికొచ్చి నుంచున్నాడతను. “కంగార్లో చూసుకోలేదు.”“కంగారెందుకు? బండి ఆగిపోతే జాగ్రత్తగా చూసుకోవాలి. కాలిరిగేలా కిక్కిస్తే లాభం లేదు. బయలుదేరు.”నీలి ధూపం సమర్పించి బయలుదేరింది, స్కూటరు. ఇద్దరూ నవ్వుకుంటూ వరండాలోకి వచ్చారు."ఆఫీసుకు లేటయిందని కంగారండి" భర్త తరఫున అంది సరళ.“ఆఫీసుల గొడవ స్కూటర్లకి తెలీవు. బయలుదేరే ముందు మనమే చూసుకోవాలి. ఆదివారం పూట