పార్ట్ 1 - 'చిట్టి తల్లి' - పాలగుమ్మి పద్మరాజు గారి రచన
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘చిట్టి తల్లి’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . పుస్తకం కొనడానికి కావాల్సిన web linkPalagummi Padmaraju Rachanalu -Vol1కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. కథను రెండు భాగాలుగా ఆడియో చెయ్యడం జరిగింది, నిడివి ఎక్కువ కావడం వల్ల .ఎపిసోడ్లో ముందుగా వారి తండ్రి గారి గురించీ , కథ గురించీ పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.చిట్టి తల్లి:దక్షిణామూర్తి గాలి పీల్చుకోడానికి నిడదవోలు ప్లాట్ఫారం మీదికి దిగాడు. కుపే ఒక రకంగా సుఖంగానే ఉంటుందిగాని, మిగతా పెట్టెలాగ రైలు కదులుతున్నా గాలి రాదు. అయితే – కుపేలోకి బొగ్గు నెరుసులు, అనవసరమైన ప్రయాణీకులు అట్టే రారు. లాభనష్టాలు ప్రతిదానికీ ఉంటాయనుకుని తృప్తి పడ్డాడు దక్షిణామూర్తి…ప్లాట్ఫారం మహా రద్దీగా ఉంది. ఈ పెట్టెలో కాళీ లేదంటే, ప్రయాణీకులు మరో పెట్టి దగ్గరకు పరుగెత్తుతున్నారు. వాళ్ళ ఆత్రంలో జంతు సహజమైనదేదో ఉంది. అసలు దక్షిణామూర్తి ఎన్నికలో సామాన్య ప్రజలు జంతువులే, అయితే అప్పడప్పుడు ఆ జంతువులతో రాసుకు తిరగడం కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటప్పుడు, బొత్తిగా ఒంటరిగా కొన్ని గంటల సేపు కుపేలో ప్రయాణం చేశాక, జీవ చైతన్యం ఉన్న వస్తువులతో తాత్కాలిక సంపర్కం కాస్త అవసరం. అయితే ఆ సంపర్కం అతనికి విసుగు పుట్టిస్తే, మళ్ళీ తన ఏకాంతంలోకి తను పోవడానికి అవకాశముండాలి. ఆ కుపేలోకి పోతే, ఈ జనం తన్ను తాకలేదన్న ధీమాతోనే, దక్షిణామూర్తి జనసముద్రంలోకి అడుగుపెట్టాడు. సోడాలూ, తినుబండారాలూ, పుస్తకాలూ అమ్మేవాళ్ళు పెట్టెలను తోసుకుంటూ, అతన్ని రాసుకుంటూ పోతున్నారు. పక్కపెట్టెలో మనిషి అరిటిపండు తినేసి విసిరిన తొక్క అతన్ని తలవెంట్రుక వాసిలో దూసుకుపోయింది. జనప్రవాహాన్నించి కొంచెం దూరం తొలిగి నిలబడ్డాడు దక్షిణామూర్తి. ప్లాట్ ఫారం మీదికి దిగడంలోనూ లాభనష్టాలున్నాయి.“ఏండోయి దక్షిణామూర్తిగారూ? హ! హ!హ!” అంటూ ఒక విగ్రహం అతని రెండుచేతులూ పట్టుకుని ఊపింది.“ఏమిటి విశేషాలు? పట్నమేనా? ఏవండీ! అక్కడెక్కడో అచ్చు ఇటికల ఫాక్టరీ పెడుతున్నారంట, కాస్త వివరాలు మాక్కూడా ఇవ్వండి.దానమ్మా మోసిరి ఉన్న లాభాలన్నీ మీరే ఏసుకోవాలేంటండీ? అవునుగాని, కలప మా దగ్గిర కొనడం బొత్తిగా మానేశారేంటి?”దక్షిణామూర్తికి వ్యాపారమంటే పిచ్చి మోజు. లాభ నష్టాల మాట అటుంచి, అసలు వ్యాపారంలో ఏదో ఒక విధంగా తనది పైచెయ్యి అనిపించుకోవాలి. అయితే ఒక్కొక్కప్పుడు – ముఖ్యంగా ఇలాగ విశ్రాంతి కోసం ప్రయాణాలు చేస్తున్నప్పుడు – వ్యాపార వాతావరణం నించి దూరంగా ఉండాలనిపిస్తుంది. కాని పెద్ద వ్యాపారస్థుడుగా పేరు ప్రఖ్యాతులు గడించాక, ప్రతి ఊళ్ళోనూ పదిమందితో వ్యాపార రీత్యా పరిచయం ఏర్పడ్డాక, అలా దూరంగా తొలిగిపోయి ఉండడం అసాధ్యమని అతనికి అనుభవంవల్ల తెలుసు. అదీగాక తనకు లోపల ఎంత చిరాకుగా ఉన్నా వాళ్ళతో ఆప్యాయంగా, చిరునవ్వు చెదరకుండా మాట్టాడ్డం వ్యాపారానికి ముఖ్యావసరం – ఒక్కరికి మనస్సు నొచ్చుకునీ మాట అతడు మాట్లాడాడా, అతను ఇన్నాళ్ళూ నిర్మించుకుంటూ వచ్చిన పలుకుబడి, ఔన్నత్యం పేకమేడలాగ కూలిపోతుందని అతనికి తెలుసు. పలకరించడం కోసమే దగ్గరగా వచ్చారు. మరికొందరు అతని సహాయం అర్థించడానికొచ్చారు. . అతడు అందరిని సమంగా మాటలతో గౌరవించి, రైలు కదలబోతుండగా తన కుపే ఎక్కేశాడు. ఎక్కుతూ రైలులో ప్రయాణం చేస్తున్న ఉద్యోగిని సంజ్ఞచేశాడు“చూడప్పలసామీ, ఆ పెద్దమనుషులంతా ఈ కుపేలో పై బర్తుకోసం నిన్ను వేధించుకు కతింటారు. నా స్నేహితులెవరో బెజవాడలో ఎక్కుతారు, అంచేత రెండూ నేనే రిజర్వు చేయించానని చెప్పు.”“నాకు మీరు చెప్పక్కర్లేదు సార్. అప్పుడే కొందరు నన్నడగడం, నేను కాళీ లేదని చెప్పడం అయింది.”ఉద్యోగి కదులుతున్న రైలు కమ్మీ పట్టుకుని పక్క కంపార్టుమెంటులోకి వెళ్ళిపోయాడు. దక్షిణామూర్తి తన కుపే తలుపులు గట్టిగా మూసుకున్నాడు. ఇంక పట్నం వెళ్ళేవరకూ వాటిని తెరవకూడదనుకున్నాడు. పాపం రైల్వే ఉద్యోగులు అతనెంత చెపితే అంత. అతను కావాలంటే రైలంతా కాళీ చేయించి అతనికిస్తారు.కొంచెం బొగ్గురజను పడిందేమోనన్న అనుమానం కొద్దీ పక్క బాగా దులిపి మళ్లీ వేశాడు. దక్షిణామూర్తి. తలగడకింద లోపలికున్న పిస్తోలు తీసి చేతితో ఒక్కసారి దాని బరువు చూసి, పక్కని పెట్టుకున్నాడు. ఆ పిస్తోలు దగ్గరుంటే తనకింక ఏ అపాయం రాదని అతని నమ్మకం. అప్పుడే కనుచీకటి పడుతోంది. బర్తుమీద మూలగా ఉన్న దీపం వెలిగించాడు. పైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ విప్పి చదవడం మొదలు...