నల్లజర్ల రోడ్డు (1/3) - తిలక్ గారి కథ
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya‘“నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు”. అవధానిగారు యిలాగ అనేటప్పటికి మేమందరం పక్కున నవ్వాం. .కొవ్వొత్తి దీపపు వెలుతురులో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండిదారాల్లా మెరిసాయి.“చంద్రుడూ వెన్నెలా ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం. కాని ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయ పెడతాయో మీకు తెలియదు” అన్నారు మళ్ళీ.“చెప్పండి. మీరేదో కథ చెబుతారని తెలుస్తూనే వుంది. వినటానికి సిద్ధంగా ఉన్నాం” అన్నాను నేను.“ఈ రాత్రికింక లైట్లురావు. ఎక్కడో తీగ తెగిపోయి వుంటుంది.” అన్నాడు నారాయణ.. –“తోట అంతా చీక టైపోయింది” అన్నాడు నెర్వస్ గా ఆచారి. అస్థిమితంగా చేతివేళ్లతో బల్లమీద ఆదితాళం వేస్తున్నాడు. “ఇంకా – కొవ్వొత్తులున్నాయాండీ!” అని అడిగాడు. అవధానిగారు తల వూపారు – ఉన్నాయన్నట్టు“ఈ తోటా, తోటలో మీ బంగళా, మీరు చేసిన విందూ – ఓహ్! మరిచిపోలేం” అన్నాడు నారాయణ.“వూరికి యింతదూరంగా యీ తోట వుండడమే అంత ‘ బాగా లేదు” అన్నాడాచారి.“చెప్పండి కథ” అన్నాను నేను. “కథా!” నిరసనగా చూశారు – అవధానిగారు.“అదే! అదే! మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన….” అని సర్దుకున్నాను. అవధానిగారు కవీకాదు; కథకుడూ కాదు.. జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి. హృదయమూ, చమత్కారమూ, ఆలోచనా ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా విరుద్దంగా బాగా డబ్బున్నవాడు. . ఆయన చెప్పడం మొదలు పెట్టారు.“ఏలూరులో చూసుకోవాల్సిన పని అంతా అయిపోయింది. ప్లీడరు గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక, కారు స్టార్టు చేశాడు రామచంద్రం, పది గంటలు దాటింది రాత్రి. నాగ భూషణం మామయ్యా, నేనూ వెనకాల సీటులో కూర్చున్నాం. ప్లీడరుగారు – కారు దగ్గరకి వచ్చి”నా మాట విన్నారు కాదు” అన్నారు. “అబ్బే ఎంత సేపండీ, సరీగ్గా తొక్కితే ఒక్క గంటన్నరలో తణుకులో పడతాం. మీరేం యిదవకండి” అన్నాడు రామచంద్రం.– “అమ్మమ్మ! ఎంత మాట! కలక్టరుగారింట్లో శుభ • కార్యమంటే వేరే చెప్పాలా! ” అన్నారు ప్లీడరుగారు … యావద్విషయాన్నీ గ్రహించిన వారై.కారు సాగింది.“అప్పటికి నాకు పద్దెనిమిదేళ్ళు. అప్పటికి – మీ రెవరూ పుట్టివుండరు” అన్నారు – అవధానిగారు మా అందరికేసి చూసి.“అటువంటి ప్రమాదం సంభవించే సూచనలు కూడా వాతావరణంలో ఉండి ఉండవండి” అన్నాడు నారాయణ. తోటలో గలగల చప్పుడయింది. ఆచారి ఉలిక్కిపడి “దొంగలేమో” అన్నాడు.“పక్షులు చెట్లలో కదులుతున్నాయి. అంతే” అన్నారు అవధానిగారు.కథలోకి రండి” అన్నాను నేను. . “అంటే….. ” కోపంగా చూశారు అవధానిగారు. “అదేనండీ, మీ చిన్నప్పటి….”అవధానిగారు చిన్నగా నవ్వి గడ్డం చేత్తో ఒక్కసారి సవరించుకున్నారు. కొంచెం ముందుకు వంగి యిలా చెప్పసాగారు.-ఆరుమైళ్ళు వచ్చేటప్పటికి కారు ఆగిపోయింది. రామ చంద్రం దిగి బానెట్ చూశాడు. ” ఇది వెధవ కారులా వుంది. నడచి వెనక్కి పోదాం పద. ఎందుకేనా మంచిది” అన్నాడు నాగభూషణం మామయ్య.“అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమోగాని యీ కారుని తిడితే మాత్రం నే నూరుకోను. అసలీ యింజనులాంటిది ఇండియాలో వుండదు” అన్నాడు రామచంద్రం.“అందుకే ఆరుమైళ్ళకే ఆగిపోయింది” మామయ్య విసుగ్గా అన్నాడు. “డొక్కు కార్లు కొనకురా , అంటే విన్నావ్? సెకండ్ హాండ్ వి కొనవల్సిన ఖర్మ నీకే మొచ్చింది? మనమాట ఎలాగున్నా వీణ్నికూడా మనతో తీసుకువచ్చాం. కర్మ! వీడు ఎనిమిది గంటలకి పడుకోకపోతే మా అక్కయ్య ఎనిమిదిమంది డాక్టర్లని ఒకేసారి పిలిచి చూపెడుతుంది” అన్నాడు నన్ను ద్దేశించి.“ఏం భయంలేదు మామయ్యా. రాత్రిళ్ళూ ,కార్లలో , ప్రయాణం చెయ్యడం నాకు సరదా” అన్నాను నేను.రామచంద్రం మావూళ్ళో పెద్ద టెన్నీస్ ఛాంపియన్. – పొడుగ్గా, బలంగా, హుషారుగా వుంటాడు. మా, వూరి క్లబ్బుకి , సహాయ కార్యదర్శి, సేవాసదనానికి గౌరవాధ్యక్షుడు. ఆ సదనం ఏమిటో, యేం చేసేదో యిప్పటికీ నాకు తెలియదు. ఇటువంటి సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు. రామచంద్రానికి కాలవ వొడ్డున పెద్ద మేడ వుంది. మేడలో అతనికొక భార్యా కుమారరత్నమూ , కూడా వున్నారు. అతను భార్య నెక్కువ ప్రేమిస్తాడో భార్య పేర ఆమె తండ్రి వ్రాసి...