ట్రిగ్గర్

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

ట్రిగ్గర్అశోకరాజు సోఫాలో  కూచుని కాఫీ తాగుతూ  టీవీ ఆన్ చేసాడు. ‘ ముగ్గురు కాలేజీ పిల్లలు ఓ నగల దుకాణం మీద దాడిచేసి   పట్టుబడ్డారని బ్రేకింగ్ న్యూస్ కింద  చూపిస్తున్నారు. సంఘటనలో గాయపడ్డ వాచ్ మెన్ చావు బతుకుల్లో వున్నాడు.  జరిగిందంతా ఊహించి 3 -డీ యానిమేషన్ సాయంతో, నేపధ్య సంగీతంతో కలిపి ఛానల్ వాళ్ళు  ప్రేక్షకులకు అందచేస్తున్నారు.  దీనికి అదనంగా స్టూడియోకి వచ్చి కూచున్న  మేధావులు ‘నేటి యువత - సినిమాలు’ అనే చర్చా కార్యక్రమంలో ఒళ్ళు మరచి  పాల్గొంటున్నారు. టీవీ ఆఫ్ చేసాడు. కాఫీ గ్లాసు పక్కన బెట్టేసి, బయలుదేరబోతూ  భార్యని అడిగాడు, “వీడింకా లేవలేదా?”“లేదు. అదేదో తాడో, పేడో కొని చేతిలో పెట్టారుగా,  రాత్రంతా దాన్ని ముందరేసుకుని  కూర్చోనుంటాడు. స్కూల్ బస్  టైం కి అరగంట ముందు లేచి పరిగెడతాడు” అందావిడ.                                        *****అన్న, చేతులు అటూ ఇటూ చాపుతూ   రకరకాల పోజులు ఇస్తూంటే, తమ్ముడు మొబైల్ తోటి ఫోటోలు తీస్తున్నాడు. గదిలో ఓ మూల బంకర్ మంచం వేసుంది. ఇంకో పక్క పుస్తకాల అలమరలు, వాటి పక్కనే రెండు స్టడీ టేబిల్స్. చేస్తున్న పని ఆపి  “అన్నా నేనూ  పట్టుకుంటా. నాకు గూడా ఫోటో  తీయవా” అన్నాడు తమ్ముడు. “నీ చేతి కొద్దు చిన్నా.  నాన్న గూడా కింది నించీ వచ్చేస్తూంటారు ఈపాటికి” చిన్నా మొహం ముడుచుకుని ఫోటో షూటింగ్ మళ్ళీ  కంటిన్యూ చేసాడు. అలా ఓ  ఐదు నిమిషాలు  గడిచింతర్వాత,  చెయ్యి కుర్చీకి  తగిలి, అన్న చేతిలో ఉన్న తుపాకీ,  జారి, బెలూన్ చిట్లినట్టుగా శబ్దం వచ్చింది. మొబైల్ పట్టుకునున్న, చిన్నా  కుప్పకూలాడు. మెడ మీంచి రక్తం, సన్నటి ధారగా స్రవించడం మొదలైంది. పదేళ్ళ తమ్ముణ్ణి ఒళ్ళోకి తీసుకుని  చిన్నా! చిన్నా!  అని అరవడం మొదలెట్టాడు అన్న. ఏ మాత్రం కదలిక లేదు.  కుదిపి కుదిపి అలిసిపోయి, గోడకు చేరగిలబడ్డాడు. కళ్ళు మూతబడ్డాయి. తలమీద  కన్నీళ్ళ కుండ ఒలికిందా అన్నట్టు, ఒళ్ళంతా తడిసిపోయి వుంది. మరుక్షణంలో గదిలో నిండిన నిశ్శబ్దాన్ని తొలుస్తూ, నేల మీద పడున్న మొబైల్ మోగడం మొదలైంది. బుగ్గ మీది చారికలు తుడుచుకొని, కనపడే ఎర్రచుక్కను బలంగా  పక్కకు తోసి ఫోను చెవికి తగిలించాడు.  “రే! నాన్నని ఫోన్ చెయ్యమని చెప్పు?  ఫోన్ తీట్లేదు.” “హలో….  హలో… . మాట్లాడవేం రా?  టైం అవుతోందక్కడ. వెళ్ళాలి నేను. చిన్నాగాడు ఏం చేస్తున్నాడు? టిఫిన్లు తిన్నారా?” ఆమె కంఠం ఆగకుండా  మోగుతోంది.  ఫోన్ పక్కన పెట్టేస్తూంటే చెయ్యి వణుకుతోంది. పక్కన పడున్న రివాల్వర్ తీసుకుని తన  కణతకు గురిపెట్టాడు.  ఇంతలో తలుపు తోసిన శబ్దం. నాన్న… లైటర్ మంటను సిగరెట్ దగ్గరకు తీసుకొస్తూ లోపలికొస్తున్నాడు. కనపడిన దృశ్యం చూసి, కాళ్ళు ఘనీభవించిన కాంక్రీట్ లో ఇరుక్కు పోయినట్టుగా  ఆగిపోయాడు. మరుక్షణం ఈ లోకంలోకి వచ్చి కేకలు పెడుతూ పిల్లల వైపు  పరిగెత్తాడు. *****రాజు  స్టేషన్కి వచ్చి,  కూచుని ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసాడు. కరకరమని శబ్దం చేస్తూ,  చెంగీజ్ ఖాన్ కాలం నాటి ఆ యంత్రం  వేగంగా తిరగడం మొదలైంది.  కుడివైపున్న  కిటికీలోంచి బైటికి చూస్తే, సూర్యుడు ఇప్పుడల్లా బయటికొచ్చేటట్లు కనపడ్డం లేదు. ఆకాశం నలుపెక్కి పోయివుంది.  స్వింగ్ డోర్ ధడాల్న తెరుచుకుని  కానిస్టేబిలు ఆనందరావు  వచ్చి  ఎదురుగా నిలబడ్డాడు. తల పైకెత్తాడు  రాజు. “సార్, గాంధీనగర్ లో , షూటింగ్ జరిగిందట సార్.”“గాంధీనగర్ లోనా?“ కనుబొమలు పైకెత్తాడు.  “అవును సర్. ఫోన్ వచ్చింది. పది పన్నెండేళ్ల  పిల్లలంట.”“పిల్లలా?” కంఠం మారుమోగింది. సమాధానం వచ్చే  లోపలే, కుర్చీని ఒక్క ఉదుటున వెనక్కి తోసి వున్న పళంగా బయటికి కదిలాడు రాజు.  ఆనందరావు, లెధర్ బాగ్ భుజానేసుకుని మఫ్టీలో వున్న ఇంకో కానిస్టేబులు జీపు వెనుకభాగంలో కూర్చున్నారు. కొత్తగా రంగులేసున్న అపార్ట్మెంట్ కాంప్లెక్. కిందున్న లాన్ లో, మగా ఆడా కల్సి పోయి, రెండు  చిన్న గుంపులుగా విడిపోయి మాట్లాడుకుంటున్నారు. జీపు దిగగానే ఒక  నడివయసు...