వర్షంలో పిల్లి : (ఆంగ్లమూలం 'Cat in the Rain' by Ernest Hemingway)
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
‘ వర్షంలో పిల్లి’ , ఈ కథకు అనువాదకులు శ్రీ పతంజలి శాస్త్రి గారు. కథకు ఆంగ్ల మూలం ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ‘Cat in the Rain’. కథకు అనువాదంతో పాటూ , కథ గురించి వారు ఇచ్చిన వివరణ కూడా ఇదే పేజీలో చదవవొచ్చు.‘వర్షంలో పిల్లి’: తెలుగు అనువాదం – పతంజలి శాస్త్రి (‘Cat in the Rain’: ఆంగ్ల మూలం – ఎర్నెస్ట్ హెమింగ్వే)ఆ హోటల్లో ఇద్దరే అమెరికన్లు దిగేరు. వాళ్ళ గదిలోకి వెళ్తూ, మెట్లెక్కి దిగుతున్నప్పుడు తారసపడే వాళ్ళెవ్వరూ తెలీదు వాళ్ళకి. ఎదురుగా సముద్రం కనిపించే రెండో అంతస్థులో గది వాళ్ళది. పార్కు, వార్ మెమోరియల్ కూడా కనిపిస్తుంది అక్కణ్ణించి. పార్కులో పెద్ద కొబ్బరిచెట్లు, ఆకుపచ్చని బెంచీలు. వాతావరణం బాగున్నప్పుడు ఎప్పుడూ ఎవరో ఒక చిత్రకారుడు సరంజామాతో వుంటాడక్కడ. పెరిగిన కొబ్బరిచెట్లూ, పార్కులు, సముద్రం, ఎదురుగా మెరుస్తున్న హోటళ్ల రంగులూ, చిత్రకారులు ఇష్టపడతారు. వార్ మెమోరియల్ చూడ్డానికి దూరంనించి ఇటాలియన్లు వస్తారు. కంచు పోతపోసిన మెమోరియల్ వర్షంలో మెరుస్తోంది. వర్షం పడుతోంది. కొబ్బరి చెట్ల మీదనించి జారుతోంది. కంకరరోడ్ల మీద నీళ్లు మడుగులు కట్టేయి. పొడవుగా వర్షంలో విరిగిపడుతూ, తిరిగి వెనక్కి జారుతూ,మళ్ళీ తీరం మీదికి పొడుగు గీతలా విరిగి పడుతోంది సముద్రం. వార్ మెమోరియల్ చౌరస్తా దగ్గిర కార్లు వెళ్లిపోయాయి. అవతల హోటలు గుమ్మంలో ఖాళీ చౌరస్తా చూస్తూ నుంచున్నాడు హోటలు వెయిటరు. బయటకు చూస్తూ కిటికీ పక్కన నుంచుంది అమెరికన్ గృహిణి. బయట సరిగ్గా కిటికీ కింద ఒక పిల్లి. అది వర్షపు నీళ్లు కారుతున్న ఆకుపచ్చ టేబిలు ఒకదాని కింద నించుంది. వర్షం మీద పడకుండా, సాధ్యమైనంత ముడుచుకుపోవడానికి ప్రయత్నిస్తూ వుంది. “కిందికి వెళ్లి ఆ పిల్లిని తెస్తున్నాను” అందామె. మంచం మీంచి ఆమె భర్త “ ఒద్దు. నేను వెళ్లి తెస్తాలే” అన్నాడు. “కాదు. నే తెస్తాను. ఆ టేబిలు కింద తడిసిపోకుండా కూచోడానికి ప్రయత్నిస్తోంది పాపం.”మంచం కాళ్ళ వేపు రెండు దిండ్ల మీద ఆనుకుని, మళ్ళీ చదువులో పడ్డాడు భర్త. “తడవకేం” అన్నాడతను. ఆమె కిందికి వెళ్ళింది. ఆఫీసు గది దాటుతుండగా, హోటల్ మేనేజర్ లేచి ఆమెకి గౌరవంగా తల వంచాడు. అతని టేబిలు ఓ చివర వుంది. పొడవాటి వృద్ధుడతను. “వర్షం పడుతోంది” అందామె. యజమాని అంటే అభిమానం ఆమెకి. “అవును మేడమ్. ఏమీ బాగా లేదు. పాడు వాతావరణం.”గదిలో టేబిలు వెనక నుంచున్నాడతను. ఆమెకి నచ్చుతాడతను. ఫిర్యాదులు తీసుకునేటప్పుడు తీవ్రంగా పెట్టే అతని గంభీరమైన ముఖం ఆమె కిష్టం. అతని హుందాతనం ఆమెకిష్టం. ఆమెకి సేవలందించటానికి అతను చూపించే ఉత్సాహం ఆమెకిష్టం. అసలు అతను హోటలు మానేజర్ గా ఎట్లా వుండాలనుకుంటాడో అదామెకిష్టం. పెద్దతనంతో భారీగా వుండే ముఖం, అతని పెద్ద చేతులు, ఆమెకిష్టం. అతని గురించి ఆలోచిస్తూనే , తలుపు తీసి బయటికి చూసిందామె. గట్టిగా పడుతోంది వాన. రబ్బరు కోటు వేసుకుని ఒక వ్యక్తి చౌరస్తా దాటుతూ హోటలు వేపు వస్తున్నాడు. కుడివైపు ఎక్కడో ఉంటుంది పిల్లి. సన్ షేడ్ల కిందినించి బహుశా తను వెళ్లగలదేమో. గుమ్మంలో నుంచుని ఉండగానే తన వెనక గొడుగు తెరుచుకుంది. వాళ్ళ గది శుభ్రం చేసే అమ్మాయి. “మీరు తడవకూడదు” ఇటాలియన్ మాట్లాడుతూ చిరునవ్వింది. హోటలు మేనేజర్ పంపించాడన్నమాట. ఆ అమ్మాయి పట్టుకున్న గొడుగు కింద ఆమె కంకర బాట కింద నడుస్తూ వాళ్ళగది కిటికీ కిందికి వచ్చిందామె. వర్షంలో శుభ్రమై పచ్చగా మెరుస్తూ టేబిలు వుంది గానీ, పిల్లి వెళ్ళిపోయింది. హఠాత్తుగా ఆమెకి ఏదో నిరాశ కలిగింది. అమ్మాయి ఆమెని చూసి అంది, “ మీరేవన్నా పోగొట్టుకున్నారా?”“ఒక పిల్లి వుంది”“పిల్లి”“అవును”“పిల్లి? వర్షంలోనా” నవ్విందాఅమ్మాయి. “ ఊ.టేబిలు కింద” అని మళ్ళీ అందామె, “దాన్ని ఎంతో కావాలనుకున్నాను. ఆ పిల్లి కావాలి నాకు.”ఆమె ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ముఖం బిగుసుకుంది. “ రండి మేడమ్. లోపలికి వెళ్దాం. తడుస్తారు మీరు.” అంది. “అవును గదా” అందామె. మళ్ళీ కంకర కాలిబాటలో నడుచుకుంటూ లోపలి వచ్చేరు. పనమ్మాయి గొడుగు ముడవడానికి గుమ్మం దగ్గర ఉండిపోయింది. అమెరికన్ అమ్మాయి ఆఫిసు దాటుతూండగా మేనేజర్ తలవంచాడు. ఆమెకు తనలో ఏదో కుచించుకుపోయినట్టై, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తను ఒక అల్పప్రాణిలా, అదే సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తిలా, అనిపించేలా చేస్తాడు అతను. ‘తాను చాలా ప్రాధాన్యత గల మనిషిని’ అనే ఒక క్షణికమైన భావన కల్గుతుంది. మెట్లెక్కి వెళ్లిపోయిందామె. గది తలుపు తీసుకుంది. మంచం మీద జార్జి పడుకుని చదువుకుంటున్నాడు. పుస్తకం...