కూపే (ఆంగ్ల మూలం : రేమండ్ కార్వర్ రాసిన 'Compartment')

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

ae30HCvSxkXmzvGvXUuL‘కూపే’ ( మూలం: రేమండ్ కార్వర్ కథ ‘కంపార్ట్మెంట్’)అమెరికన్ రచయిత రేమండ్ కార్వర్ కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రచనల్లో ‘Compartment’ ఒకటి. కథాంశం ఎనిమిదేళ్లుగా దూరమైన కొడుకుని కలవడం కోసం మేయర్స్ అనే వ్యక్తి చేసే ప్రయాణం. సంభాషణల ద్వారా లేదా రచయిత జోక్యం ద్వారా కాకుండా, మేయర్స్ మనసులో ఆలోచనలూ, అతని చుట్టూ కనపడుతున్న వాతావరణం లో అతను గమనించే విషయాలూ వీటి గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తూ కథను ముందుకు తీసుకెళ్తారు రచయిత. మేయర్స్ వ్యక్తిత్వాన్ని తేటతెల్లంగా మన ముందుంచడానికి రచయిత చేసిన ప్రయత్నం ప్రతి వాక్యంలో కనపడుతుంది. కథలో అప్రస్తుతం అని మనకనిపించే రచయిత ఇచ్చిన కొన్ని వివరాలు , ప్రయాణంలో క్రమంగా అతని ఆలోచనలో వచ్చిన మార్పుని, ముగింపునీ మనం అర్థం చేసుకోడానికి వుపయోగపడతాయి. ఉదాహరణకి కథలో మేయర్స్ చూసిన కలిసిన ప్రతి వ్యక్తి మేయర్స్ కు తెలీని భాషలో మాట్లాడతారు. ఇది మేయర్స్ వ్యక్తిత్వంలో ఉన్న ఇబ్బందిని మనకు సూచిస్తుంది.ముగింపు తెల్సుకుని మరిచిపోయే కథ కాదు ‘కంపార్ట్మెంట్’. కథపై మీ ప్రతిస్పందన తెలియజేయడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి. ‘కూపే’:మేయర్స్ మొదటి తరగతి కూపేలో ప్రయాణిస్తున్నాడు. ఫ్రాన్సులోని స్ట్రాస్బెర్గ్ యూనివర్సిటీ లో చదువుతున్న కొడుకుని కలవడానికి ఈ ప్రయాణం. కొడుకుని చూసి ఎనిమిదేళ్లయింది. ఆ అబ్బాయి తల్లితో మేయర్స్ విడిపోయిన తర్వాత ఈ ఎనిమిదేళ్లలో ఫోన్లో వాళ్ళిద్దరూ ఎన్నడూ మాట్లాడుకోలేదు. కనీసం ఓ ఉత్తరం ముక్క కూడా లేదు… . కొడుకు తల్లితోనే ఉంటున్నాడు. వాడి పాడు జోక్యం వల్లే, చివరన తామిద్దరం అంత తొందరగా విడిపోయావని మేయర్స్ గట్టి నమ్మకం. తమ పెనుగులాటలో వాడు తన మీదకి దూకినప్పుడే ఆఖరు సారి వాణ్ణి చూడ్డం. పక్కనే నించుని తన భార్య ఒక్కొక్కటిగా పింగాణీ గిన్నెలు ముందు గదిలోకి విసరడం మొదలెట్టి, కప్పుల మీదికొచ్చింది. తాను “ఇంక ఆపేయ్” అని గట్టిగా కేక పెట్టడంతో, వాడు ఒక్క ఉదుటున మీదికి వచ్చేసాడు. మేయర్స్ గబుక్కున పక్కకు జరిగి, వాడి తలను తన చంకకీ చేతులకీ మధ్య గట్టిగా ఒడిసిపట్టుకున్నాడు. వాడు ఏడుస్తూ, మేయర్స్ వీపు మీద, పొత్తికడుపు మీద ఆపకుండా గుద్దేసాడు. మేయర్స్ పట్టిన పట్టు విడవకుండా, అందిన కొద్దీ చితక బాదేశాడు. వాణ్ణి దడాల్న వెనక్కి తోసి, గోడకి అదిమిపెట్టి, చంపుతానని బెదిరించాడు. చంపేసేవాడేమో ఆ కోపంలో.. . తను అప్పుడు ఏవన్నాడో ఇంకా గుర్తుంది, “ నీకీ బతుకిచ్చిందే నేను, వెనక్కి తీసుకోగల్ను కూడా , జాగర్త”ఆ భయానక దృశ్యం తల్చుకుని ఒక్కసారి మేయర్స్ గట్టిగా తల విదిలించాడు, అదేదో ఇంకెవరికో జరిగిన సంఘటనలా. అవును…. తాను కూడా ఇంతకు మునుపులా లేడు. ఒంటరిగా బతుకుతున్నాడు. తన పనేదో తను చూసుకుంటూ, వేరే ఎవ్వరితో సంబంధం లేకుండా. రాత్రి పూట శాస్త్రీయ సంగీతం వింటూ, ‘నీటి పక్షులకు ఉచ్చులు ఎలా తయారు చేయాలి’ అనే విషయం మీద పుస్తకాలు చదువుకుంటూ పొద్దు పుచ్చుతున్నాడు. తలుపుకు అవతల సీట్లో కూర్చోనున్న వ్యక్తి తన టోపీని కళ్ళ మీదకు లాక్కుని నిద్ర పోతున్నాడు. మేయర్స్ అదేవీ పట్టించుకోకుండా, సిగరెట్ వెలిగించి, తదేక దృష్టితో కిటికీలోంచి బయటికి చూడ్డం మొదలుపెట్టాడు. అపుడపుడే తెల్లవారుతోంది. పక్కనించీ వెళ్లిపోతున్న పచ్చని పొలాల మీద పొగమంచు పల్చని తెర కప్పింది. అక్కడక్కడా పొలాల మధ్యలో కట్టుకున్న బంగళాలూ, వాటి చుట్టూ కట్టిన ప్రహరీ గోడలూ.  ‘ఇలాంటి ఇళ్ళల్లో బావుంటుంది, పాత కాలం ఇల్లూ, చుట్టూ వుండే పెద్ద గోడ.’ అనుకున్నాడు మేయర్స్. టైము ఆరుగంటలు దాటింది. ముందు రోజు రాత్రి పదకొండు గంటలకి మిలాన్ లో రైలు ఎక్కినప్పట్నించీ నిద్రే పోలేదు. రైలు మిలాన్ స్టేషన్ దాటిన తర్వాత అనుకున్నాడు ‘ అదృష్టం.. కూపే లో నేనొక్కణ్ణే!’. లైటుంచి, టూరిస్టు గైడు పుస్తకాలు తిరగేయడం మొదలెట్టాడు. ఇటలీలో ఏమేం చూసుండొచ్చో, చేసుండొచ్చో అర్థం అవుతోంది. ఇటలీకి రావడం ఇదే మొదటి, ఆఖరిసారి కచ్చితంగా. వదిలివెళ్లే సమయంలో ఆ దేశం గురించి తెలుసుకోడం .. కొంత బాధగానే వుంది.  పుస్తకాలు సూటుకేసులో ఉంచి, సూటుకేసు పై అరలో పెట్టాడు. కోటు బయటికి తీసి దుప్పటిలా కప్పుకున్నాడు. లైటు ఆర్పేసి, నిద్ర పడుతుందన్న ఆశతో, కూపే చీకట్లో అలా కళ్ళు మూసుకు కూర్చున్నాడు. చాలా సమయం గడిచిపోయింది అనిపించింది. సరిగ్గా నిద్ర పట్టే సమయంలో,...