అమ్మూరు
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
1976 వ సంవత్సరం - చిన్నా :" అమ్మా ! నేనొచ్చేసా " అంటూ పుస్తకాల సంచీని ఒక మూలకి, చేతి లోని క్యారేజీ ని ఇంకో మూలకి విసిరేస్తూ వచ్చి అమ్మకి అతుక్కు పోయాడు చిన్నా. స్కూల్ నుండి వొచ్చేటప్పటికి అమ్మ ఎదురుచూస్తూ కనపడితే వాడి ఆనందం పట్టనలివి కాదెవ్వరికీ. " అబ్బో! మా చిన్న ఐదు ఊర్లు ఏలేసి వచ్చాడమ్మా" అంటూ ఒక ముద్దు పెట్టుకుంది చిన్నాని, అమ్మ. "అమ్మా ! ఈ రోజు స్కూల్ నుంచి వస్తుంటే ఏం జరిగిందో తెలుసా. ఊర్లోకి రెండు కార్లు వస్తూ కనపడ్డాయమ్మా. ఎవరింటికో తెలుసా నీకు" " రాఘవన్న వొచ్చాడ్రా అమెరికా నించి, శంకరవ్వ కోసం ." అంటూ చిన్నా కోసం రెండు మనుగుబూవులు ఒక చిన్న గిన్నె లో పెట్టి ఇస్తూ, "నువ్వు తింటూ ఉండరా తండ్రీ, నీ ప్రశ్నలతో చంపకుండా, నాకు చాలా పనుంది, నీకు రేపు టిఫిన్ కోసం బియ్యం నానెయ్యాలి " అంటూ చిన్న వాళ్ళ అమ్మ వసారాలోకెళ్లింది. "అమ్మా! రాఘవన్న ఇంక మన ఊర్లోనే ఉంటాడా?, నేను వాళ్ళింటికెళ్తే మాట్లాడతాడా?" అంటూ అమ్మ వెనకాలే వెళ్ళాడు చిన్నా. " ఇక్కడ ఓ నెల ఉండి పెళ్లి చేసుకొని పోతాడటరా . నీతో ఎందుకు మాట్లాడ్డు ? చిన్నప్పుడు నిన్ను తెగ ఆడిచ్చే వాడు కదా! " " ఇప్పుడు నువ్వు గూడ తోడు రామ్మా! శంకరవ్వ వాళ్ళింటికి. నాకు వాళ్ళ వాకిట్లోనే వుండే ఆ నల్ల కుక్క అంటే భయం.""నీకు, ఆ మురళీ గాడికి సవాలక్ష సార్లు చెప్పానురా, దాని మీద రాళ్లు విసరొద్దని. వింటారా మీరు" అంటూ విసుక్కుంది అమ్మ. అమ్మ వచ్చేటట్టు లేదు గాని, మనమే శంకరవ్వ ఇంటి ముందు నాలుగు రౌండులు కొడదాము, ఎవరన్నా లోపలి కెళ్తుంటే వాళ్ళ వెంట పడి పోవొచ్చు అనుకుంటూ బయటకెళ్ళాడు చిన్నా. కుక్క భయమో, లేక రాఘవన్నని ఎలా పలకరించాలి అనే బెరుకో లేక సిగ్గో కానీ, శంకరవ్వ వాళ్ళ ఇంటి ముందు తచ్చాడడం మొదలు పెట్టాడు చిన్నా. ఇంతలో రాఘవ అన్నే శంకరవ్వని చిన్నగా నడిపించుకుని ఇంట్లోంచి బయటకి వచ్చాడు. చిన్నాకి ఏనుగెక్కినంత సంబరం వేసింది. ఇంక వీధిలో అందరూ రాఘవన్నని కుశల ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. "రాఘవయ్య, ఎప్పుడొచ్చావు?, వుంటావా నాలుగు రోజులు?, పెళ్లి ఎప్పుడయ్యా?, అమ్మనేమన్న అమెరికాకి తీసుకెళ్తావా?" అంటూ. వాళ్లందరికీ ఓపిగ్గా సమాధానాలిస్తూ వెళ్తున్నాడు రాఘవన్న,చక్కని పలువరుసతో, తెల్లని మేనిచ్ఛాయతో అచ్చు సినిమాలో జగ్గయ్యలాగ కనపడతా వుండాడు, చిన్నాకి రాఘవన్న. అప్పటికే అమ్మలక్కలు, "మన రాఘవయ్యకు చూడు వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమో!, అమెరికా నించొచ్చి వవాళ్ళ అమ్మని ఎంత జాగర్తగా దేవళం తీసుకెళ్తున్నాడు" అంటూ గుసగుసలు మొదలెట్టేశారు. చిన్నా వాళ్ళ వెనకే నడుస్తూ, రాఘవన్న కళ్ళల్లో పడ్డానికి , రయ్ రయ్ అని శబ్దం చేస్తూ, రాఘవన్న పక్కనుంచే పరిగెత్తాడు. "ఎవర్రా! అలా పరిగెత్తేది" అంటూ శంకరవ్వ కేక పెట్టింది. చిన్నా ఆగిపోయాడు. రాఘవన్న వేపే చూస్తున్నాడు, శంకరవ్వను పట్టించుకోకుండా. చిన్నా ఇంట్రడక్షన్ ఇవ్వడం మొదలు పెట్టింది శంకరవ్వ తన కొడుక్కి, " ఒరే రాఘవా ! వీడు మీ సుజాతక్క కొడుకు, భలే తెలివి గలోడు . వీడి బుర్ర నిండా ఎప్పుడూ ప్రశ్నలే! మనింటికొస్తే అదేంది, ఇదేందీ అంటూ చంపుతాడు, ఒక్క నిమిషం కుదురుగా ఉండడు " అనుకుంటూ. ఈలోపల దేవళం రావటం, శంకరవ్వ లోపలి వెళ్ళటం, రాఘవన్న దేవళానికి ముందున్న అరుగు మీద కూర్చోడం జరిగిపోయాయి. చిన్నా కూడా వెనక్కి ఓ పదడుగులు వేసి, ఒక్క లగు లగెత్తి, ఎగిరి రాఘవన్న పక్కన కూర్చున్నాడు అరుగు మీద. "ఏమి చదువుతున్నావు" అడిగాడు రాఘవన్న చిన్నా భుజం మీద చెయ్యేసి. "ఆరో క్లాస్, జెడ్.పీ ఉన్నత పాఠశాల, రామలింగాపురం అఫ్ పెదపుత్తేడు""అబ్బో! నేను కూడా అక్కడే చదివేను తెలుసా!. మా హెడ్ మాస్టర్ మీరా రెడ్డి గారు, బహుశా ఇప్పుడు వేరే ఆయనేమో? ” "రాఘవన్నా! ఎక్కడైనా హెడ్ మాస్టర్లు మార్తారేంటి, మాక్కూడా ఆయనే""సైన్స్ కి ఎవరు మీకు, ప్రఫుల్ల దేవి గారేనా""మాకా పుల్లా దేవి కాదన్నా! కే .ఎస్ అయ్యోరు సైన్స్ కి, లెక్కల కి" అంటూ పళ్ళు ఇకిలిచ్చాడు చిన్న. ఓ చిన్న నవ్వు నవ్వేసి , రాఘవన్న వాళ్ళు చదువుకొనే టప్పుడు పని చేసిన టీచర్స్ ఎవరన్నా ఉన్నారా అంటూ ఒక్కోరి పేర్లు అడుగుతూ మొదలుపెట్టి , ఒక్కొక్క అయ్యవారు ఎట్టా పాఠాలు చెప్పే వారో, అప్పుడు బడి ఎట్టా ఉండేదో, వాళ్ళు ఎట్టా చదివే వారో, ఎట్టా...