సాబువ్వ

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

సాబువ్వమబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యను చూసి "ఏందయ్యా.. పైన మోడం గట్టిందెప్పుడూ సూళ్ళేదా" అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది."కాదే దేవమ్మా .. ఎప్పుడూ ఓ సుక్క గూడా రాల్చని మబ్బులు గూళ్ళు గూళ్ళుగా ఔపిస్తూ ఎందుకే ఆశల్లేపుతాయి.. మనం గూడా మనుసులమే కదా!! ఓ రెండు సినుకులు రాలిస్తే పైన నీళ్ళు ఆవిరైపోతాయా" అని దేవమ్మను చూసి అంటూంటే..నువ్వు రమ్మని పిలిసి సూడు వత్తాయ్.. నే పోతాండా, ఆడ ఎండుగెడ్డి పీకాల, నువ్వు ఆ మూలంతా సదను సేసి రా.. క్యారీరు చింతచెట్టుకు ఏలాడ గట్టినా, నువ్వొచ్చినంక బువ్వ పెడతా అంటూ వెళ్లిపోయింది దేవమ్మ. వానెప్పుడు పడాలని ఈడ నేను ఊరకే పీకులాడాల అని గొణుక్కుంటూ వరదయ్య పన్లో పడ్డాడు. మధ్యాహ్నం రాగి ముద్దను ఎర్రకారం పచ్చడితో మింగుతూ పక్కనే ఉల్లిగడ్డ కొరుకుతూ చివర్లో చిలికిన మజ్జిగ తాగి "దేవమ్మా ఈ పొద్దు ముద్దలో ఏం కలిపినావే.. మా రుచిగుండాది అంటే “స్పూను మంచినూనె ఏసినానయ్యా మెత్తగా ఉండాది" అంది దేవమ్మ. నాకు "సాబువ్వ ఎప్పుడు పెడతావే" అంటే "ఇప్పుడేం పండగలు లేవు. సామికి పూజ చేసి బెల్లం బువ్వ పెట్టిన రోజే నీకు" అంటూ దేవమ్మ తింటోంది. రాయలసీమలో అనంతపురం తీవ్ర వర్షాభావానికి లోనైన జిల్లా. టెక్నికల్ గా "రెయిన్ షాడో రీజియన్". దశాబ్దాలుగా వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా ఇంకిపోయి, జిల్లాలో పారే నది లేకపోవడంతో పంట కాలువలు కూడా కనిపించవు. కొన్ని చోట్ల ఎడారిలా ఇసుక మేటలు దర్శనమిస్తాయి. వర్షాధారిత పంటలే దిక్కు. అందులో ముఖ్యమైంది వేరుశనగ. ఇతరత్రా పంటలు కూడా ఉన్నా ఏదో అంతంత మాత్రమే.. వర్షం ఎంతుంటే అంతలా.ఇదే జిల్లాలో వరదయ్య దంపతులుండే ఊరు సీతారామపురం. గుడి, బడి, చిన్నాసుపత్రి, సర్పంచ్ ఆఫీసు.. ఇలా పల్లెలో ఉండే సౌకర్యాలన్నీ ఉన్నాయి. వరదయ్య ఇల్లు ఓ మోస్తరుగా ఉంటుంది. ఒక్కడే కొడుకు శ్రీనివాస్. భార్యతో టౌనులో ఉంటూ ఇద్దరూ ప్రైవేటు స్కూళ్ళలో పనిచేస్తూ తమ ఇద్దరాడపిల్లలతో కలిసి వీరిద్దరికీ తోడుగా ఉంటూ అపుడపుడూ పల్లెకు వచ్చిపోతుంటారు. వరదయ్యకు ఉండే ఆరెకరాల పొలంలో సెనక్కాయతో పాటు టమాటో ఇంకొన్ని కూరగాయలు పండించి అవి టౌనుకెళ్ళే మస్తాన్ కు అమ్మి జీవితం సాగిస్తున్నాడు. ఉన్న బోరులో నీళ్ళు కూడా ఎక్కువ రావు. ఇంకాస్త లోతుగా మళ్ళీ బోరేస్తే నీళ్ళొస్తాయని ఆశ."దేవమ్మా.. ఈతూరి గూడా పంట మీద ఆశలు ఇడిసేయాలా.. పంట కోసం తీసిన బ్యాంకు లోను ఎట్టనే కట్టేది" అంటూ బీడీ పొగ మద్య ఎటో చూస్తూన్న వరదయ్య ప్రశ్న ఆమె కళ్ళను కిందికి దించేశాయి. ఇద్దరి మౌనం మద్య "వానాకాలం ఇంకా వొచ్చేదుంది కదయ్యా.. సూద్దాం. బ్యాంకోళ్ళతో మాట్లాడు. వడ్డీ కట్టనీకి టైమడుగు. లేదంటే పిల్లోడిని అడుగుదామా""వొద్దొద్దు.. నువ్వట్టాంటి ఆలోశన చైరాదు. మనం పిల్లోల్లకి పెట్టాల్నే గానీ ఆల్లనెట్టా అడుగుతావే" అన్నాడు. సాయంత్రం శ్రీనివాస్ ఫోన్ చేసి ఇద్దరితో మాట్లాడి పెట్టేశాడు. బ్యాంకు ప్రస్తావన రాలేదు.ఆ వారం చివర్లో ఊళ్ళో ఒక చాటింపేశారు. భూదేవమ్మ ఇంటికొచ్చి "అయ్యా! సర్పంచాఫీసోళ్ళు చెప్పినారు. మూడు రోజుల తర్వాత ఎవల్నీ బైట తిరగొద్దంటన్నారు. బీడీల కోసం ఊరంతా తిరగొద్దు. శెట్టి గారి అంగట్లో సామాన్లు తీసకరా.. మళ్ళీ బైటికి పంపిస్తారో లేదో!!వరదయ్య వెళ్ళి తెచ్చిన సరుకులు చూసి "ఏందయ్యా ఇన్ని సబ్బులు, నురగ నీళ్ళు తెచ్చినావు, ఇయన్నీ మనవేనా.. రాగులు తక్కవ రంగులెక్కువైనాయి" అంటే "ఏమో అందరూ కొంటున్నారు.. నన్నూ కొనమన్నారు. దేశంలోకి రోగమేందో వచ్చిందట. చేతులు కాళ్లు సబ్బుతో బాగా కడిగి మూతికి బట్ట కట్టుకోమన్నారు. అందరితో పాటు మనం అని తెచ్చినా" అన్నాడు.ఇదేం బాధ అని దేవమ్మ వంటింట్లోకి దూరింది. వరదయ్య కొడుక్కి ఫోన్ చేసి "ఏం సీనయ్యా.. ఆడ ఎట్టుండాది. అన్నీ మూసేస్తారంట గదా.. నువ్వు టీచరమ్మను, పిల్లోల్లను తీసుకొని ఊరికొచ్చేయ్. టౌన్లో వొద్దులే" అంటే సరే అన్నాడు శ్రీనివాస్.    ఆ సాయంత్రం ఊరుచేరిన అందరినీ చూసుకుంటూ ఈ ఇద్దరూ తెగ మురిసిపోయారు."తాతయ్యా మా స్కూల్ కూడా మూసేశారు.. మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో తెలీదు. అంతవరకూ మనమంతా ఇక్కడే ఉంటామని నాన్న చెప్పాడు" అంటే "మీకెన్ని దినాలు కావాలంటే అన్ని దినాలు ఈడనే ఉండండమ్మా" అని తాత వాళ్ళతో ఆటలు మొదలెట్టాడు. వరదయ్యకు కోడలంటే చాలా గౌరవం. ఆమెను టీచరమ్మా అని పిలుస్తాడు. కోడలు ఎప్పుడు వంటింట్లో సాయానికి వచ్చినా దేవమ్మ ఆనందమే వేరు. "దేవమ్మా పిల్లోల్లకి కారం ఎక్కువ పెట్టాకు, తినలేరు" అంటే రాత్రికి కొర్రన్నం లోకి వంకాయ కూర, టమాటా చారు చివర్లో చిలికిన మజ్జిగతో ముగించారు.రాత్రి ఇంటి ఆరు బయట...