‘తెరిచున్న కిటికీ’: మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

‘తెరిచున్న కిటికీ’:  మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki)  రాసిన ‘The Open window’(https://americanliterature.com/author/hh-munro-saki/short-story/the-open-window)“అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తుందండీ, ఈలోపల నా కంపనీ భరించాలి మీరు” అంది ఆ పదిహేనేళ్ల యువతి నవ్వుతూ, కొత్త మనిషిని కలుస్తున్నాను అన్న బెరుకేవీ లేకుండా. వాళ్ళ అత్త రాక ప్రాముఖ్యతని   తక్కువ చేయకుండా, ఈ అమ్మాయిని పొగుడుదామని కొంత ఉత్సాహపడ్డాడు, ఫ్రాంటన్ నట్టెల్. నిజానికి, ఇలా ఒకరి తర్వాత ఒకర్ని, కొత్తవాళ్ళని కలవడం  అతనికంత గొప్ప ఐడియాలా అనిపించడంలేదు. తన నరాల వ్యాధి   తగ్గడానికి  ఇది  ఏ రకంగా ఉపయోగపడుతుందో అర్థం కావడం లేదు.   పల్లె ప్రాంతంనికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని  ఏర్పాట్లు చేసుకుంటూంటే, వాళ్ళ అక్కయ్య అంది,    “నాకు బాగా తెల్సు.  నువ్వు అక్కడికెళితే, ముసుగేసుకుని ఎవ్వరినీ కలవకుండా మూలుగుతూ కూర్చుంటావు. ఆ ఒంటరి బతుక్కి, నరాలు ఇంకా బలహీనపడతాయి. నాకు తెల్సిన వాళ్లందరికీ  ఉత్తరాలు రాసిస్తాను. నా మాట విని, వాళ్ళని కలుస్తూ వుండు. నాకు తెల్సినంతమటుకు  వాళ్ళందరూ మంచి మనుషులు. నిన్ను ఇబ్బంది పెట్టరు .”ఫ్రాంటన్ కి అనుమానం వచ్చింది, ‘తను కలవబోయే మిసెస్ సాపిల్టన్, ఈ ‘మంచి’ అనబడే  కాటగిరీలో ఉందా?’ అని. అతను కొంత  కుదురుకున్నాడు అని నిర్ధారించుకుని , “మీకీ  చుట్టుపక్కల చాలా మంది  తెల్సా?” అని అడిగింది ఆ అమ్మాయి.  “ఒక్కరు తెలిస్తే ఒట్టు. ఓ నాలుగేళ్ళ క్రితం అనుకుంటా, మా అక్కయ్య ఇదే  ఊళ్ళో,  పాస్టర్ గారింట్లో కొన్నాళ్ళుండింది. తనకు పరిచయం ఉన్నవాళ్ళని కలవమని కొన్ని ఉత్తరాలు రాసిచ్చింది.” అని బదులిచ్చాడు, చివరి వాక్యం మటుకు పట్టి పట్టి ఉచ్ఛరిస్తూ. “అయితే మా అత్తయ్య గురించి కూడా మీకేవీ పెద్ద తెలిసుండదే?” నింపాదిగా అడిగింది ఆ అమ్మాయి. “ఆమె పేరు, అడ్రస్ మాత్రం తెల్సు” అంటూ అనుకున్నాడు,  ‘అసలు ఈ మిసెస్ సాపిల్టన్ గారికి పెళ్లయిందా? భర్త వున్నాడా? లేడా?,  ఈ రూమ్ చూస్తూంటే మటుకు కొన్ని మగవాసనలు కనపడుతున్నాయి,  అని. “ఆమె జీవితంలో మూడేళ్ళ క్రితం ఒక పెను ప్రమాదం జరిగింది, మీ అక్కయ్య గారు అప్పుడు ఇక్కడుండరు.” అంది ఆ పిల్ల. “ఏవిటీ” ఉలిక్కిపడి అడిగాడు ఫ్రాంటన్, ఇలాటి ప్రశాంతమైన పల్లెటూళ్లలో ప్రమాదాలా ? అని లోపల ఆశ్చర్యపోతూ .  “ మీకు విచిత్రంగా  లేదూ! ఈ చలికాలంలో,  అలా ఆ కిటికీ తెరిచిపెట్టటం” అందా అమ్మాయి, అక్కడ తెరిచున్న  ఒక పెద్ద ఫ్రెంచి కిటికీ ని చూపిస్తూ. దాదాపు తలుపంత సైజులో ఉండే ఆ కిటికీలోంచి,  ఇంటి ముందరున్న లాన్ కనపడుతోంది. “గదిలో వెచ్చగానే వుంది. అది  సరే! ఆ కిటికీకి, ప్రమాదానికీ  సంబంధం ఏదన్నా  ఉందా ఏవిటి కొంపదీసి?”“మూడేళ్ళక్రితం ఇదే  రోజు, ఆవిడ భర్త, ఇద్దరు తమ్ముళ్లూ, అదే  కిటికీలోంచే బయటకు దిగి,  ఉల్లంకి పిట్టని వేటాడ్డానికెళ్లారు. వెళ్ళినవాళ్ళు అంతే!  ఇంక తిరిగిరాలేదు.  ఓ చిత్తడి నేల దాటుతూ పొరపాట్న ఒక  భయంకరమైన ఊబిలో కూరుకుపోయారు.  ఆ వేసవంతా,  ఆగకుండా వర్షాలు పడ్డం వల్ల  మామూలుగా గట్టిగా వుండే నేల కూడా, ఒక్కోచోట  మెత్తబడి పోయింది. అన్నిటికంటే భయంకరవైన విషయం, పాపం!  ఆఖరికి వాళ్ళ శవాలు కూడా దొరకలేదు” ఆ అమ్మాయి గొంతులో అప్పటిదాకా ధ్వనించిన స్థైర్యం బదులు తడబాటు తెలుస్తోంది. “పిచ్చి  అత్తయ్య, ఇప్పటికీ  అలవాటు ప్రకారం వాళ్ళు ఆ కిటికీలోంచే  వెనక్కొస్తారనీ, వాళ్ళతో పాటూ కనిపించకుండా పోయిన  బూడిద రంగు కుక్కపిల్ల కూడా తిరిగొస్తుందనీ, ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి రోజూ,  రాత్రి బాగా చీకటి పడే దాక , ఆ కిటికీ అలానే తెరిచి ఉంచుతుంది. పాపం! నాకు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పింది, ఎలా వేటకి బయలుదేరారో? మావయ్య తెల్లటి వాటర్ ప్రూఫ్ కోటు వేసుకుని, వాళ్ళ తమ్ముడు రోనీ ఏమో , ఈమెని ఎపుడూ ఏడిపించడానికి  పాడే పాట ఒకటి ‘బెర్టీ బెర్టీ’ అని పాడుకుంటూ.  నిజం చెప్పొద్దూ! ఒక్కోసారి, ఇలాంటి సాయంకాలం పూట, వాళ్ళు ఆ కిటికీలోంచి ఇంటి లోపలికి వచ్చేసినట్టు అనిపించి,  నాకు ముచ్చెమటలు పోస్తాయి.”  ఆ అమ్మాయి కంఠంలో చిన్న వణుకు కనిపిస్తోంది.  మాట్లాడ్డం ఉన్నట్టుండి ఆపేసింది ఆ అమ్మాయి. గబగబా రూంలోకి వచ్చిన...