Part I - 'జాన్ పాల్ చేసిన బీరువా కథ'
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
మనం చాలా ప్రేమించే మనుషులు మనకు దూరం అయితే, అస్తిత్వానికి అర్థం లేకుండా పోయినట్టు అన్పిస్తుంది. చుట్టూ వున్న ప్రపంచం అర్థరహితంగా అనిపిస్తుంది. సుప్రసిద్ధ రచయిత్రి వసుంధరాదేవి రాసిన ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ కథను అరసం వారు ప్రచురించిన 'ఆర్.వసుంధరాదేవి కథలు' అనే పుస్తకంలో చదవొచ్చు.ముందుగా ఈ కథ గురించి - మధురాంతకం నరేంద్ర గారి మాటల్లో .ఈ పుస్తకం కొనాలంటే - https://www.anandbooks.com/R-Vasundhara-Devi“టేపులో నీ పాట తీసేసి కొత్త పాట, జానీ మేరా నామ్ లోది. మంచిది పెట్టేశాడు. అన్న..." పాప చెప్పింది.గబగబా ముందు హాల్లోకి వెళ్ళాను. రేడియోలో వస్తున్న పాటని చాలా శ్రద్దగా టేప్ రికార్డర్‌లో రికార్డు చేసుకుంటున్నాడు బాబు.“ఎందుకని నా పాట తీసేశావ్?" అనడిగాను. "ఇష్" అన్నాడు నావేపు చూడకుండానే.రికార్డింగ్ అయ్యాక "మంచిపాట నాశనం చేసేశావమ్మా, రికార్డు చేసుకుంటున్నప్పుడు మాట్లాడేశావ్" అన్నాడు.నాపాట పోగొట్టి ఇంకా పైగాను! “అది పాతపాట. ఎవరిగ్గావాలి?" అన్నాడు.“నాకు కావాలి. అందుకేగదా రికార్డు చేసుకున్నాను. అది తియ్యొద్దని చెప్పానుకదా!" అన్నాను."అమ్మా అది రికార్డు చేసి సంవత్సరం అయింది. ఒక్కనాడు కూడా నీయంతట నీవు దాన్ని పెట్టుకొని వినలేదు. అది టేపులోవుంటే నీకేం, లేకుంటే నీకేం?... మంచిపాట వస్తున్నది. తొందరలో దాని మీద పెట్టేశాను" అన్నాడు. అంతటితో ఆ సంభాషణ అయిపోయిందని తాను కొత్తగా పెట్టుకున్న పాటలు వింటూ కూర్చున్నాడు.ఆ పాట పోయింది. ఇహరాదు. వాదించి లాభమేమిటి?నా పాట పోయినందుకు నాలో నిరాశ, ఎదో విలువైనది పోగొట్టుకున్నానన్న బాధ. ఆ పాట ఉన్నా నేను పెట్టుకోను. ఎప్పుడైనా ఎవరైనా వరుసలో పెడితే వినడమే. అది ఎవరికీ అక్కర్లేని పాతపాట. నాకు కావలసిన పాట. కావలసినదైనా నేను పెట్టుకోని పాట. అది ఆ టేపులోవుంటే నాకేదో తృప్తి. ఇప్పుడు అది పోయినందుకు బాధ.ఎందుకో ఆ పాట నాకు కావాలి. నాకు ఇష్టమైందని కాదు. కాని నాకు కావలిసింది. ఎందుకో అర్థం కాకపోయినా నాకు చాలా ముఖ్యమైనది.'ఆడేపాడే పసివాడ.... అది ఏ సినిమాలోదో, ఎవరు పాడినదో, దానిలో భావమేమిటో నాకు గుర్తులేదు. నాకు అక్కర్లేదు. ఆ పాట వింటూంటే నాలో, సంచలనం రేగుతుంది. ఉధృతంగా ఎగిరిపడుతున్న అలలతో, తుఫానునాటి సముద్రంలాగా అయిపోతుంది మనసు.....ఎంతో ఆశించినదాన్ని పొందలేక విషాదభరితమైన జీవితం కల ఒక అమ్మాయి. ఆనందానికి ప్రతిరూపంగా కనిపించిన పసివాణ్ణి చూచి, ఎంతో ఆనందంతో పాడుతుంది. ఆ పాట. పాట అయిపోయేసరికి పిల్లవాడు దుర్మరణం పాలౌతాడు. మళ్ళీ కటిక చీకటిలాంటి విషాదం ఆవరిస్తుంది...ఆనందానికి విషాదానికీ గల సరిహద్దులో, రెండూ ఒకటయ్యేచోట ఆ పాట. పాట వింటూంటే ఆనందమూ, దాని వెనుకనే పొంచివున్న విషాదమూ రెండూ ఒక్కసారిగా తీవ్రమౌతాయి. ఊపిరి సలుపనివ్వకుండా పెరిగి పెరిగి... ఉక్కిరిబిక్కిరై నలిగిపోతుంది. గుండె.ఆ పాత పాట నాకు యిష్టమని కాదు. నేను నా అంతట ఎప్పుడూ దాన్ని పెట్టుకోను. కాని నాలోనే అందరాని లోతుల్లో ఉండే సత్యానికి ప్రతినిధిగా అది అక్కడ ఉండటం చాలా ముఖ్యం....మనిషి మనసు చిత్రమైనది. ఆ పాట అక్కడ ఉన్నన్నాళ్ళూ నేను దాని గురించి తలచలేదు. కాని అది చెరిగిపోయేసరికి దాని గురించి యింతగా ఆలోచించుకున్నాను. అది మాటల్లేని మూగరాగమై నాలో నిలిచిపోయింది....ఇంట్లో ఇంకో బీరువా ఉంటే నాకు ముఖ్యమైనవి పిల్లల చేతుల్లో పడకుండా భద్రంగా దాచుకోవచ్చును. కావలసినవి జారిపోకుండా, మాసిపోకుండా, చెరిగిపోకుండా, పోకుండా దాచుకోగలను.ఈ యింట్లో నాకు ఓ బీరువా చాలా అవసరం!*********************'జాన్‌పాల్ బలే టక్కరివాడమ్మా"మా యింట్లో పనులు చేసి వెళ్తుండే పనివాళ్లు ముగ్గురూ ఒక్కరకంగానే చెప్పారు, జాన్ గురించి. ఆ విషయం నాకూ కొంచెం అనుభవమే. కాని 'తెలియని దేవతకన్నా తెలిసిన దయ్యం మేలు' అన్న సామెత ననుసరించి నడుస్తుంది నా బుద్ధి.బీరువాను రెడీమేడ్ గా కొనాలంటే పాతిక మైళ్ళవతల ఉన్న పట్నం వెళ్లి కావలసిన సైజులో ఆర్డరిచ్చి రావాలి. షాపువాళ్లు యిప్పుడిస్తాం, అప్పుడిస్తాం అంటుంటే అక్కడకు నాలుగుసార్లు వెళ్ళాలి. తర్వాత జాగ్రత్తగా పాక్ చేయించి దెబ్బ తగలకుండా బస్సుమీదనో లారీ మీదనో తీసుకురావాలి. ఇంతా చేశాక వాళ్లు రెండోరకం కొయ్యవేసిన చక్కగా పాలిష్ చేసి, ఘనంగా వార్నిష్ చేసి మసిపూసి చేసిన మారేడుకాయలాంటిది...