Part - ii : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.
Harshaneeyam - A podcast by Harshaneeyam
Categories:
కొంచెం సేపయిన తర్వాత ఆమె ఒక్క నిట్టూర్పు విడిచి ఇలా అంది. “మీ ఊరు చాలా వెనకబడి ఉందండీ!”నాకేమీ తోచక, “శాస్త్రి కూడా వస్తే బాగుండేది” అన్నాను. ఆమె ఒక క్షణం ఆగి, “చాలా వెనకబడి ఉంది” అతని తనలో తాను అనుకుంటున్నట్లు అన్నది. “లేకపోతే బొంబాయి ఉన్నట్లు ఉండమంటే ఎట్లా ఉంటుంది!” అన్నాను.“ఊరు సంగతి కాదు. మనుషుల సంగతి. నేను వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. మీరు మాంధాత కాలంలో ఉన్నారు. అబ్బా, మీ ఊళ్ళో ఎలా బ్రతుకుతున్నారో. ఒకరితో మాట్లాడితే యింకొకరికి కోపం, అందరితో మాట్లాడితే అందరికీ కోపమే! దీన్నే ఈర్ష్య అంటారు కాబోలు. శాస్త్రి ఇంటో మీ అందరి సంగతి గమనించాను. కాఫీ హోటల్ కి వెళ్ళేటప్పుడు ఊళ్ళో వాళ్ళ సంగతి చూచాను. ఏం అన్యాయం? అన్నీ ప్రిమిటివ్ లక్షణాలే. ఆడవాళ్ళ పని మరీ అన్యాయంగా ఉంది. ప్రతి భార్యా తన భర్తని యితర స్త్రీలనుండి కాపాట్టమే తన ధర్మంగా నటిస్తుంది. తన భర్తతో మాట్లాడే ప్రతి స్త్రీ తన భర్తను కాజెయ్యటానికే ప్రయత్నిస్తూ ఉంది అనుకుంటుంది. ఎంత ప్రిమిటివ్! మీరంతా మాంధాత యుగంలో ఉన్నారు.”నేనేమీ మాట్లాడలేదు. ఆమె మాటలు యదార్థం అని నాకు తెలుసు. ఆమె వచ్చిందగ్గరనుంచి మా జీవితంలో అమానుషత్వం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.“మీరు తెలివిగలవాళ్ళు. మీరు అనుకుంటున్న దానికంటే తెలివికలవాళ్ళు. అందుకని మిమ్మల్ని చూస్తూవుంటే నాకు ముచ్చటగా ఉంటుంది. కాని ఏం లాభం? మీ చుట్టూ వున్న సంఘంలో మీరు ఒకరు అవటంవల్ల మీలో కూడా ప్రిమిటివ్ ఇనిస్టింక్స్ చాలా ఉన్నయ్. మొదటినుంచి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరిక్కడ ఉండి చెడిపోతున్నారు. మీ కొక్క సలహా చెపుతానుమీరిక్కడ స్త్రీల క్లబ్బు నొకదాన్ని ఆర్గనైజు చెయ్యండి. ఆడవాళ్ళని కొంచెం కలిసి మెలసి తిరిగేటట్టు చేస్తే తప్ప ఈ పశుత్వం పోదు. నామాట వినండి.”ఈ మాటలు మేం బ్రతుకున్న బ్రతుకునంతా ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చినయ్. భార్యల్ని ఇళ్ళల్లో పెట్టటం బజార్ల వెంట తుకిడీ లు తుకిడీలుగా తిరగడం ఏ స్త్రీ అయినా కనిపిస్తే కోతి చేష్టలు చెయ్యటం- ఆడవాళ్ళ సంగతే సదా మాట్లాడుకోవటం – అంతా అసహ్యంగా కనిపించింది. ఈ మధ్య మా ఊళ్ళో ఆడవాళ్ళకోసం జరిగిన హత్యలు జ్ఞాపకం వొచ్చినై. వీటన్నిటికీ కారణం ఆమె చెప్పిందేనా? ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడ్డాను. ఆమెకూడా గ్రహించినట్లు ఉంది. మళ్ళీ ఆ సంగతి ఎత్తలేదు..హాల్లో ప్రవేశించిం తర్వాత మొత్తం రెండు మూడుసార్లు మాట్లాడించింది. ఒకసారి “నాకు ఛార్లెస్ బోయర్ అంటే ఇష్టం. కామేశ్వరుడికి గ్రేటాగార్బో అంటే ఇష్టం” అంది.“ఛార్లెస్ బోయర్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో నాకు తెలుసు. కానీ మీకు ఇష్టం అవటం చాలా ఆశ్చర్యంగా వుంది” అన్నాను.“ఎందుకని?”“అతడు చాలా మాస్కులైన్ గా ఉంటాడు. అతడు ముద్దు పెట్టుకుంటూ ఉంటే తెర చిరుగుతుందేమోనని భయం వేస్తుంది నాకు.”ఆమె చిరునవ్వు నవ్వుతూ, “చిరిగితే చిరిగిందిలే అని పిస్తుంది నాకు” అంది. కొంచెం సేపు వుండి, “విరుద్ధ స్వభావాలు ఆకర్షించుకుంటాయి అనుకోవటం పాత సిద్ధాంతం” అని నెమ్మదిగా చెప్పింది.ఇంకా కొంచెం సేపు ఉండి, “మీరన్న మాటకి నాకొక్క విషయం జ్ఞాపకం వస్తూవుంది. మీతో చెప్పక పోవటం ఎందుకు? మా ఊళ్ళో ఒక మహిళా సంఘంలో సభ్యురాలిగా జేర్చుకోమని అప్లికేషన్ పెట్టుకున్నాను. వాళ్ళు నా అప్లికేషన్ తిరగగొడుతూ ఈ సంఘం స్త్రీలకు మాత్రమే’ అని రాసి పంపారు” అని బిగ్గరగా నవ్వటం మొదలు పెట్టింది. నాకు మాత్రం ఆమెను చూస్తే జాలి వేసింది.మళ్ళీ సినిమా చూస్తూ కూర్చున్నాంమొదటిరాత్రి తెల్లవారగానే కథానాయకుడూ, కథానాయకి అత్యుత్సాహంగా చెట్టుకొమ్మ పట్టుకొని ఒకళ్ళు పువ్వు వాసన చూస్తూ, ఒకళ్ళు డూయట్ సాంగ్ పాడుతూ ఉంటే ” ఈ సీను ఎట్లాఉంది?” అని అడిగింది.“బాగోలేదు. ఆమె కాసేపు అభినయిస్తే బాగుండేది!” అన్నాను. “ఎందుకని”“గత రాత్రి అనుభవం ఆమెకు ప్రథమం చూడండి. అందుకని అతని మొహం చూసీ చూట్టంతోనే సిగ్గు జనించటం సహజం” అన్నాను.“ఆమెకు ఆ అనుభవం ప్రథమం అని మీకెట్లా తెలుసు?” అని నవ్వింది. నవ్వుతూ తన చేతుల్లో వున్న సంపెంగపువ్వు నా చేతిలో పెట్టింది. నాకు పువ్వులంటే ఇష్టం లేకపోయినా వాసన చూస్తూ కూచున్నాను.“గ్రేటాగార్బో “క్వీన్ క్రిస్టనా” చూశారా”“ఆ”“ఆ సీను ఎట్లావుంది”ఆమె ఏ సీనుకి రిఫర్ చేస్తూవుందో నాకు తెలిసింది. ఆ సీన్లో గ్రేటాగార్బో పక్కన పడుకునే వరకు ఆమెకుర్రవాడు అనుకుంటాడు హీరో. అకస్మాత్తుగా తెలుస్తుంది ఆమె కుర్రదని.. ఆ సీను ఎట్లా ఉందని ఆమె నన్ను అడుగుతూ ఉంది.“బాగుంది”“ఆ షాటు ఎట్లా వుంది”ఆమె ఏ షాట్ని గురించి అడుగుతూ ఉందో నాకు తెలిసింది. కాని ఆమె ఆ షాట్ అడగటం లేదు. ఆ షాట్లో ఉన్న గ్రేటా గార్బో సంగతి అడుగుతూ ఉంది. గార్బో వదులుగా ఉన్న చొక్కాతో నిలబడి వుంది. లోపల మరేమీ లేదు.