part ii - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

ఆగదిలో యింకోవస్తువేదో ఉన్నట్టు రావుగారికి కనిపించింది. తెరచిన తలుపులోనుంచి లోపలికేదో ప్రవేశించినట్లుగా, చేతిలో దీపం వెలిగించి ఆయన ఆవేపు చూశారు. ముష్టి ఆమె గజగజ వణకుతూ నీరు కారుతూ వొకమూల నిలబడివుంది. ఆమె తడివెంట్రుకలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటివెంట నీరు కారుతోంది.‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా వుంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలులయ్యారు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియవేశారు. కాని గాలి ఒక్కసారి వూపింది. గడియ వూడిపోయింది. ఇద్దరూ మళ్ళీ తలుపులు మూసి గదిలో వున్న కర్రసామాను అంతా కొన్ని కుర్చీలూ, ఒక బీరువ, బరువైన డ్రాయరూ తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది. ఇపుడు కొంత వెచ్చగా వుంది. భయం తగ్గింది. ఎక్కడో పెద్ద చప్పుడైంది. ఏదో పడిపోయింది. స్టేషన్ లోపలే పడిపోయిందేమో? “ఏం గాలి వానండి బాబుగారు నేను పుట్టిన్నాటి నుండి యింత గాలివాన నేను సూడలేదు.” అంది ముష్టి ఆమె గొంతులో ఏమీ బెదురులేకుండా. అంత ప్రశాంతంగా ఆమె ఎట్లా మాట్లాడకలుతుందో ఆయనకు అర్థం కాలేదు. ఆమెవేపు దీపం వేసి చూశారు. మూలగా చలిచేత ముడిచి పెట్టుకుని వొణుకుతూ ఆమె కూచుంది. రావుగారు పెట్టి తీసి తనపంచ ఒకటి తీసి ఆమెవేపు విసిరి ‘తడిబట్ట విడిచి యిది కట్టుకో’ అన్నారు. ఆయనన్న దేమీ ఆమెకు వినిపించలేదు. కానీ పొడిబట్ట యిచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తూ బట్టమార్చుకుంది. ఆ మూలే పొడిగా వున్నచోట కూర్చుంది. రావుగారికి తనకు ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చిందితన పెట్టె తీసి అందులో వున్న బిస్కట్ల పొట్లం తీశారు. ఒకటొకటి చొప్పునా నమలడం మొదలు పెట్టారు. |అక్కడే కూర్చున్న ఆమె ముఖం వేపు చూసారు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని ఆయనకు స్ఫురించింది.“బిస్కట్లు తింటావా?” అని అడిగారు. “ఏంటన్నారు?” అన్నదామె గట్టిగా, ఆ గాలి హోరులో ఒకరు మాట్లాడితే ఒకరికి వినిపించలేదు. ఆయన దగ్గరగా వచ్చి కొన్ని బిస్కట్లిచ్చారు. . “ఇవ్వేవున్నాయి, తినడానికి” అన్నారు రావుగారు ఏదో పొరబాటు చేసినట్లుగా. కాని అసలు లేనిదానికంటె నయం కాదూ? తన చోటికి తిరిగి వెళ్ళి పెట్టిమీద కూచున్నారు. కుర్చీలు తలుపులకి అడ్డం పెట్టివున్నాయి. ఆమె గదిలో వుండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటె ఆమె వుండడం కొంత నయం. – దేని గురించీ బాధ పడదు. గాలివానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠురాలు ఆమెకు అనుభవమై వుంటాయి. అంచేత ఆమె ఏ పరిస్థితినైనా కంగారు పడకుండా ఎదుర్కోగలదు. . రావుగారు గడియారం వంక చూచారు. తొమ్మిది గంటలయింది. అయినా రైలు దిగిన తర్వాత కొన్ని యుగాలు గడిచినట్లు ఆయన కనిపించింది. ఆయన వచ్చే స్టేషను వరకు మిగతా వారితో కూడా ప్రయాణం సాగించివుంటే బాగుండును. పెద్ద గాలివాన చెలరేగుతుందనీ, తను దిగేది ఒక చిన్న స్టేషను అని ఆ కంగారులో ఆయనకు స్పురించలేదు. స్టేషన్ నుంచి వూరు సుమారు రెండుమైళ్ళు ఉంటుంది. వూరికి తర్వాత స్టేషన్ నుంచైనా చేరుకుని వుండవచ్చు. అన్ని విషయాలను కొన్ని సూత్రాలతో బంధించడం అలవాటయిన ఆయన మనస్సు గాలి యొక్క వేగాన్ని గురించి యోచించింది. బహుశా గంటకు 80 లేక 100 మైళ్లు వుండవచ్చు గాలివేగం. పెద్ద భయం ఆయన మనస్సును ఆవరించింది. ఈ గది కూలిపోవచ్చు. బయటికి పోయే ఒక్కదారీ కుర్చీలతోటి, బల్లలతోటి మూసివుంది. ముష్టిమనిషి కూచున్న చోటికి ఆయన కంగారుగా పరిగెత్తారు. “ఈ యిల్లు కూలిపోదుగదా?”అని ఆయన అడిగారు.“ఎవరు చెప్పగలరు? యిల్లు గట్టిగానే వున్నట్టుంది. గాలిబలం ఎక్కువయితే ఏది ఆగుద్ది?”ఆమె మాటల్లో ధైర్యాన్ని కలిగించేది ఏదీ లేకపోయినా, ఆమె గొంతులో ఏదో ఒక చనువూ స్థైర్యం ధ్వనించింది. ఆయన పెట్టి దగ్గరకు పోయి కూర్చున్నారు. ఆయన కూర్చున్న మూలకు నెమ్మదిగా ఆమెకూడా చేరింది. “అక్కడ కూర్చుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు” అంది. “గాలివాన యింత ముదిరిపోతుందని నే ననుకోలేదు.”“బాబుగారు ఎందుకలా భయపడతా” రందామె. “ఒక్కరుండే కంటె ఇద్దరమున్నాంగదా! టికెట్టు కలెక్టరు దొంగముండావాడు. రైలు కదులుతూంటే నన్ను దింపేశాడు, ఏం చెయను! యిక్కడుండి పోయాను. అయినా నాకేటి విసారం? బాబుగారు చుట్టమెట్టుకోనాకి ఓ పొడిగుడ్డిచ్చారు. ఏదో కాంత అకలికి మేత పడేశారు. వచ్చే టేసనులో ఈ మాత్రం సుకమయినా వుంటాదని ఎలా అనుకోగలను? వున్నంతలో సుకంగా వుండాలి బాబుగారు! అదిలేదని, యిదిలేదని సీకాకుపడితే ఏం లాబం?”ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమిత పడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయన కసహ్యం. ఆయన మనస్సుకీ ఆమె మనస్సుకి ఎంతో అంతరం వుంది.అయినా ఆ భయంకరమయిన రాత్రి తనకు తోడుగా...